పట్టాలిస్తామని పిలిచి పార్టీ కండువాలు కప్పేశారు!
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:58 AM
ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అని పిలవడంతో పొలోమంటూ చెక్కునత్తం సభకు జనం పరుగులు తీశారు. వైసీపీ రంగులతో ఆ ప్రభుత్వం కార్యక్రమం సందడిగా కనిపించింది.
కుప్పం, మార్చి 7: ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అని పిలవడంతో పొలోమంటూ చెక్కునత్తం సభకు జనం పరుగులు తీశారు. వైసీపీ రంగులతో ఆ ప్రభుత్వం కార్యక్రమం సందడిగా కనిపించింది. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి మొదలు మండల వైసీపీ కన్వీనర్ దాకా బారెడు పొడుగున పేర్లు చెక్కిన శిలాఫలకం నిలబెట్టారు. ప్రసంగాలు మొదలయ్యాయి. సహజంగానే నాయకులు ఊదరగొట్టేశారు. ఎప్పుడెప్పుడు పట్టా కాయితాలు పట్టుకుని వెళ్లిపోదామా అని జనం నీరసంగా ఎదురు చూశారు. కొద్ది మందిని పిలిచి ఇళ్లపట్టాలు అందజేశారు. ఆ తర్వాత అందరినీ ఒకేసారి స్టేజీ మీదకి రమ్మని పిలిచారు. ఒకేతూరి పట్టాలు ఇస్తారేమో అని జనం తోసుకుంటా తొక్కుకుంటా స్టేజీ ఎక్కేశారు. చేతిలో పట్టాకాయితాలు పెట్టలేదుగానీ, అందరి మెడల్లో వైసీపీ కండువాలు వేసేశారు. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ సంఘటన గురించి ‘వైసీపీ తీర్థం పుచ్చుకున్న లెక్కకుమిక్కిలి కుటుంబాలు’ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా పార్టీ కార్యక్రమంగా మారిపోవడంతో వీఆర్వో గోవిందరాజులు గ్రూప్ ఫొటోలో కనిపించకుండా మొహం దాచుకునేందుకు నానా తంటాలు పడ్డా సాధ్యం కాలేదు పాపం. పట్టాలిస్తామని పార్టీ కండువాలు కప్పడాన్ని ఖండిస్తూ తెలుగు యువత నాయకులు చెక్కునత్తం మణి, బూత్ ఇన్‌ఛార్జి కనకరాజ్ గురువారం శిలాఫలకం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు.
Updated Date - Mar 08 , 2024 | 01:00 AM