సీడబ్ల్యూసీలో ‘పాలమూరు’ గట్టెక్కేనా?
ABN, First Publish Date - 2023-09-22T02:44:05+05:30
అనుమతులకు సంబంధించి అత్యంత కీలకమైన కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నీటి కేటాయింపులకు చట్టబద్ధత దక్కేనా?..
తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందమే కీలకం
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అనుమతులకు సంబంధించి అత్యంత కీలకమైన కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాజెక్టుకైనా అనుమతులు రావాలంటే నికర జలాలే ప్రామాణికం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 2022 ఆగస్టు 18వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో 246ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్(కృష్ణా ట్రైబ్యునల్)లో ఏపీ కేసు వేయగా... ఆ ప్రాజెక్టు తమ పరిధిలో లేదని ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా పరిధిలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విచారణ జరుగుతుండగానే... ట్రైబ్యునల్ తీర్పునివ్వ డం ఒక విధంగా తెలంగాణకు విజయం లాంటిదేనని భావిస్తున్నారు. అయితే, అదే ప్రామాణికం చేసుకొంటే పాలమూరు ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేస్తుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.
వాస్తవానికి పాలమూరును కొత్త(2015 తర్వాత చేపట్టిన) ప్రాజెక్టుగానే పరిగణిస్తామని తాజా తీర్పు లో ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. 2014నాటి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న సెక్షన్-89లో నిర్దిష్టంగా ప్రాజెక్టుల ప్రస్తావన లేనందున పాలమూరు కూడాట్రైబ్యునల్‌లో గట్టెక్కే అవకాశాలున్నాయని తెలంగాణ భావిస్తోంది. ఇక, ప్రాజెక్టుకు నిర్దిష్ఠంగా నికర జలాల కేటాయింపు లేకుండా సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చే అవకాశాలు లేవు. తెలంగాణ పేర్కొంటున్న 90 టీఎంసీల్లో ప్రధానంగా 45టీఎంసీల (పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన రాష్ట్రాలు ఆ మేరకు కృష్ణా జలాలు వాడుకోవాలనే బచావత్ ట్రైబ్యునల్ వెసులుబాటుతో దక్కిన జలాల)పై ఉమ్మడి ఏపీకే అధికారం ఉందని సీడబ్ల్యూసీ ఇప్పటికే చెప్పింది. దాం తో ఈ నీటిని గంపగుత్తగా తెలంగాణ వాడుకోవాలంటే విధిగా ఏపీతో ఒప్పందం జరగాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు డీపీఆర్ గట్టెక్కాలంటే ఏపీతో సయోధ్య కుదిరితేనే సాధ్యమయ్యే అవకాశాలున్నాయి.
నిర్మాణానికి ప్రతిబంధకాల్లేవు
ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల దాకా ఉండగా... తొమ్మిదేళ్లలో రూ.25వేల కోట్ల దాకా వెచ్చించారు. 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.1187 కోట్లే కేటాయించారు. నిధుల విడుదల, ప్రాధాన్యం ఇలాగే ఉంటే మరో ఐదేళ్లు అయినా ప్రాజెక్టు పూర్తి కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అనుమతులు వస్తేనే రుణాలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌ను లింకు చేశారు. ఇప్పటిదాకా రూ.18,500 కోట్లను ఈ కార్పొరేషన్ కిందనే సమకూర్చారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్‌ఫసీ) రుణాలు అందించాయి. ఇప్పుడు ఆ సంస్థలు సైతం రుణాల విడుదలను ఆపేశాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల నుంచి రుణాలు కావాలంటే విధిగా ప్రాజెక్టు అనుమతులు ఉండాల్సిందే. అయితే, తెలంగాణ రుణ పరిమితి కూడా గరిష్ఠస్థాయికి చేరడంతో నీటిపారుదల ప్రాజెక్టులకు రుణాలు అందే అవకాశాలు లేకుండా పోయాయి.
Updated Date - 2023-09-22T02:44:05+05:30 IST