నిజాం వంశీకుల ప్యాలెస్ కూల్చి ఆస్పత్రి కడతారా?
ABN, First Publish Date - 2023-08-03T02:53:40+05:30
అల్వాల్‌లో ఉన్న చారిత్రక కట్టడమైన కోఠి ప్యాలెస్ అసఫియా భవంతిని కూల్చి టిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకున్నారని నిజాం మునిమనవడు హిమాయత్ అలీ మీర్జా ప్రశ్నించారు.
టిమ్స్ నిర్మాణానికి ఎవరి అనుమతులు తీసుకున్నారు?..
సర్కారుపై నిజాం మునిమనవడు హిమాయత్ అలీ మీర్జా ధ్వజం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అల్వాల్‌లో ఉన్న చారిత్రక కట్టడమైన కోఠి ప్యాలెస్ అసఫియా భవంతిని కూల్చి టిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకున్నారని నిజాం మునిమనవడు హిమాయత్ అలీ మీర్జా ప్రశ్నించారు. అల్వాల్- బొల్లారం మధ్య 28.41 ఎకరాల్లో రాష్ట్రపతి భవనానికి ఆనుకుని ఉన్న భవనం అది. ఆ భవంతికి మరమ్మతులు చేసి నిజాం వారసత్వ సంపదను కాపాడాల్సిన సీఎం వాటిని ధ్వంసం చేయడం వెనక మతలబేంటని మీర్జా ప్రశ్నించారు. ఓ వైపు ఏడో నిజాం ఉస్మాన్ అలీ బహదూర్‌ను పొగడుతున్నట్లు మాట్లాడుతూ.. మరోవైపు ఆయన నిర్మించిన చారిత్రక కట్టడాలను నేలమట్టం చేయడమేంటని ధ్వజమెత్తారు. కోఠి ప్యాలెస్ అసఫియా పూర్తిగా నిజాం వంశానికి చెందిన ఆస్తి అని.. అందులో తనకు 36 శాతం వాటా ఉందన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల కింద నిజాం ఈ కట్టడాన్ని ఇచ్చేశారని ఒకసారి.. ప్రభుత్వానికి నజరానాగా ఈ భవంతిని ఇచ్చారని మరోసారి.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏవేవో చెబుతూ, ఏవో పత్రాలు చూపిస్తోందని... వాటిని నిజాం వంశీకులు సమ్మతించరని మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సికింద్రాబాద్‌లో సివిల్ కోర్టును ఆశ్రయించగా స్టే వచ్చిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్యాలె్‌సను నేలమట్టం చేసి టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేపడుతోందని మండిపడ్డారు. సర్కారుపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు మీర్జా హెచ్చరించారు. ప్రమాదకరస్థాయికి చేరిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి నష్టం కలగకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మీర్జా అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించారు.
Updated Date - 2023-08-03T02:53:40+05:30 IST