‘యంత్ర లక్ష్మి’ ఏడబాయె..
ABN, First Publish Date - 2023-06-30T00:32:27+05:30
వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణ (ఫామ్ మెకనైజేషన్) పథకం అటకెక్కింది. ‘యంత్రలక్ష్మి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ఈ పథకం 2017-18 ఆర్ధిక సంవత్సరం వరకు మాత్రమే అమలై ఆ తర్వాత ఆగిపోయింది. నాలుగేళ్లుగా ఇది అమలు కావడం లేదు. వ్యవసాయంలో ఉపయోగపడే యంత్రాలను.. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ రైతులకు ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందించేందుకు ఈ యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టారు. అయితే పథకం అమలు నిలిచిపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ పథకం అమలులో ఉన్నదా...? లేక రద్దు చేశారా...? అనే విషయంపై వ్యవసాయశాఖ అధికారులకే స్పష్టత లేదు.
అటకెక్కిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం
రైతుబంధు పథకంతో బ్రేక్
రైతులకు అందని సబ్సిడీ యంత్రాలు
అన్నదాతలపై ఆర్థికభారం
అమలుపై అధికారులకే లేని స్పష్టత
వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణ (ఫామ్ మెకనైజేషన్) పథకం అటకెక్కింది. ‘యంత్రలక్ష్మి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ఈ పథకం 2017-18 ఆర్ధిక సంవత్సరం వరకు మాత్రమే అమలై ఆ తర్వాత ఆగిపోయింది. నాలుగేళ్లుగా ఇది అమలు కావడం లేదు. వ్యవసాయంలో ఉపయోగపడే యంత్రాలను.. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ రైతులకు ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందించేందుకు ఈ యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టారు. అయితే పథకం అమలు నిలిచిపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ పథకం అమలులో ఉన్నదా...? లేక రద్దు చేశారా...? అనే విషయంపై వ్యవసాయశాఖ అధికారులకే స్పష్టత లేదు.
హనుమకొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయరంగంలో కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు, ఆధుని క వ్యవసాయ పద్ధతుల వైపు రైతులను ప్రభుత్వం ప్రో త్సహించింది. వ్యవసాయ యంత్రాలను గ్రామీణ ప్రాం తాల్లో పేద, సన్నకారు రైతులకు అందించేందుకు యంత్రలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఇనుప నాగలి మొదలు ట్రాక్టర్ వరకు ప్రభుత్వం రాయితీపై ఇస్తోంది. దీంతో నాగలి పట్టి దుక్కిదున్నే రైతులు ట్రాక్టర్ల వినియోగానికి అలవాటుపడ్డారు. అదే విధంగా సాగుకు అవసరమైన సంప్రదాయ పరికరాలకు బదులు ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. తొలుత ఈ పథకం అమలు.. అధికార పార్టీ నాయకుల జోక్యంతో అభాసుపాలుకాగా, గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. 2017-18లో గ్రామానికి ఒకటి నుంచి మూడు ట్రాక్టర్లు చొప్పున పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లాలో ఈ పథకానికి రూ.100కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. జిల్లాల పునర్విభజన తర్వాత నిధుల ఊసే ఎత్తడం లేదు.
యంత్రాలతోనే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలంలో 9.22లక్షల ఎకరాల్లో ఆహార, ఉద్యానవన పంటలు సాగు చేయనున్నట్టు అంచనా. మరో 43 వేల ఎకరాల్లో పండ్ల తోటలను పెంచనున్నారు. ప్రస్తుతం సాగుకు ఉమ్మడి జిల్లాలో 21,120 ట్రాక్టర్లు, 10,860 రోటోవేటర్లు, 84 ప్యాడీ త్రెషర్స్, 1254 హార్వెస్టర్లు, 474 మినీ ట్రాక్టర్లు, 570 పవర్ టిల్లర్లను రైతులు వినియోగిస్తున్నారు. ప్రతీ సీజన్‌లోనూ కనీసం 50 నుంచి 100 వరకు ట్రాక్టర్లను రైతులు కొనుగోలు చేస్తారు. గతంలో వీటన్నింటిపై రాయితీ ఉండేది. కాగా, యంత్రాలు, పరికరాలు, పనిముట్లు, ట్రాక్టర్ల రాయితీని నిలిపివేయడంతో రైతులే పూర్తి ధరకు బయట మార్కెట్లో కొనాల్సి వస్తోంది. దీంతో మోయలేని ఆర్థిక భారం పడుతోంది. ఇటీవల మందుల పిచికారీకి డ్రోన్లను వినియోగిస్తున్నారు. హార్వెస్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్ల వినియోగం కూడా పెరగగా బోదెలు చేయటం, పసుపు ఉడికించి పాలిసింగ్ చేయడం, పత్తిలో దౌరకొట్టడం, మొక్కజొన్నలను ఒలవటం, ఇతర పంటల నూర్పిడి, మామిడిలో సస్యరక్షణ మందుల పిచికారీ, నేలను చదును చేయటం, గట్టు చేయటం తదితరాలన్నీ యంత్రాలు, పరికరాల సాయంతోనే చేపడతున్నారు.
చిన్నయంత్రాలకు కూడా..
ఈ నేపథ్యంలో యంత్రాలతోపాటు టార్పాలిన్ షీట్లు, పంపుసెట్లు, పిచికారి యంత్రాలు, సీడ్ డ్రిల్, నీటిపైపులు, బిందు, తుంపర సేద్య పరికరాలు, పాలీహౌ్‌సలు, సోలార్ ఫెన్సింగ్, పత్తితీత యంత్రాలు, మామిడి కాయలను తెంపే పరికరాలు, కొడవళ్లు, గడ్డి కత్తిరించే యంత్రాలు, ఇతరత్రా ఎద్దులతో నడిపే పరికాలకు గతంలోలాగా ఇచ్చినట్టు రాయితీలు ఇవ్వడం లేదు. పత్తి, పెసర, కంది వంటి పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించే పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. కేవలం పవర్ స్ర్పేయర్లను మాత్రమే రైతులకు అరకొరగా పంపిణీ చేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో పవర్ స్ర్పేయర్లు, స్ర్పింక్లర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే సీజన్ పూర్తయ్యే వరకు కూడా అవి రైతులకు అందడం లేదు. దీంతో రైతులు కిరాయిలకు తీసుకోచ్చి వినియోగించుకోవాల్సి వస్తోంది. గతంలో ఏటా గ్రామానికి మూడు, నాలుగు ట్రాక్టర్లు, వాటి అనుబంధ పరికరాలను ప్రభుత్వం 50 శాతం రాయితీపై ఇచ్చేది. ప్రస్తుతం ఈ రాయితీ పథకం లేకపోవడంతో రైతులు ప్రైవేటు ఫైనాన్స్‌లపై ఆధారపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వడ్డీల భారం, డీజిల్ ధరల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
విడుదల కాని నిధులు
ఉమ్మడి జిల్లాకు కనీసం రూ.100కోట్ల వరకు నిధులను, ఆర్‌కేవీవై, యంత్రలక్ష్మి, ఉద్యానవన శాఖ పథకాల ద్వారా ఇవ్వాల్సి ఉన్నా తొమ్మిది సీ జన్లుగా నిధులను విడుదల చేయటం లేదు. కల్టివేటర్, రోటోవేటర్, ప్లవ్‌లతో నేలను దున్నటం, దమ్ము చేయటం, సరుకుల రవాణా తదితరాల కు ట్రాక్టర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. చాలాగ్రామాల్లో దుక్కిటెడ్ల స్థానంలో ట్రాక్టర్లు చే రాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పె రగగా ప్రస్తుతం యంత్రాల్లేనిదే ఏ పొలం పనీ సాగని పరిస్థితి నెలకొంది. కనుక ప్రభుత్వం యాంత్రీకరణ రాయితీ ఇవ్వాలని రై తులు కోరుతున్నారు. జిల్లాకు కావలసిన వ్యవసాయ యాం త్రీకరణ నిధులకు ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం మంజూరు చేస్తే రైతులకు ఇస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
కనుమరుగు
వ్యవసాయ యాంత్రీకరణ దేశవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో గత ప్రభుత్వాలు సబ్సిడీ మీద వ్యవసాయ యంత్రాల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 వరకు సబ్సిడీపై లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇచ్చింది. 2018లో రైతు బంధు పథకం తెరమీదికి వచ్చిన తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అటకెక్కించింది. వ్యవసాయ కూలీల కొరత తీవ్రమవుతుండగా సాగుకు సాయంగా నిలిచే ఆధునిక యంత్రాలను రాయితీపై ఇవ్వకపోవడంతో రైతులకు సాగు కష్టంగా ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం యంత్ర పరికరాలపై ఇచ్చే రాయితీలకు మంగళం పాడింది. ఫలితంగా రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
Updated Date - 2023-06-30T00:32:27+05:30 IST