ఏజెన్సీ పల్లె నుంచి రాష్ట్ర మంత్రి దాకా..
ABN, First Publish Date - 2023-03-14T00:10:10+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కాకులమర్రి విజయ రామారావు(85) మృతితో ఆయన స్వగ్రామమైన ములు గు జిల్లా ఏటూరునాగారంలో విషాదం నెలకొంది.
ములుగు, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కాకులమర్రి విజయ రామారావు(85) మృతితో ఆయన స్వగ్రామమైన ములు గు జిల్లా ఏటూరునాగారంలో విషాదం నెలకొంది. మారుమూల ఏజెన్సీ పల్లె నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానాన్ని స్థానికులు గుర్తుచేసుకుం టున్నారు. కాకులమర్రి వెంకటచెల్లాయమ్మ-గోపాల్‌రావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా విజయరామారావు పెద్దవారు. రెండో తరగతి వరకు ఏటూరునాగారంలో చదువుకున్న ఆయన ఆతర్వాత తన అమ్మమ్మ గారి ఊరైన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విద్యనభ్యసించారు. హై స్కూల్, ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశారు. కరీంనగర్‌లో కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశారు. మద్రాసు యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. 1959లో సివిల్స్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికైన విజయరామారావు హైదరాబాద్ కమిషనర్‌గా సేవ లందించారు. అత్యున్నతమైన సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికైన ఆయన హవాలా కుంభ కోణం, బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై పేలుళ్ల ఘటనలపై దర్యాప్తు చేసి విశేష గుర్తింపు పొందారు. ఉద్యోగ విరమణ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అంతటి స్థాయికి ఎదిగినప్పటికీ పుట్టిన ఊరైన ఏటూరునాగారాన్ని ఆయన మర్చిపోలేదు. గోదావరి వరదలతో ఏటూరునాగారం ముంపునకు గురవుతుండగా కరకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. విజయరామారావు తండ్రి గోపాల్‌రావు ఏటూరునాగారానికి మొదటి సర్పంచ్ కాగా ఆయన సోదరుడు చక్రధర్‌రావు కూడా సర్పంచ్‌గా పనిచేశారు. పది రోజుల క్రితం ఏటూరునాగారం వచ్చిన ఆయన బంధువులు, సన్నిహితులతో చాలాసేపు గడిపారు. అనూహ్యంగా ఆయన మరణించడంతో వారు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - 2023-03-14T00:10:18+05:30 IST