చట్టం బలపడితేనే అడవి నిలుస్తుంది
ABN, First Publish Date - 2023-09-22T00:12:49+05:30
అడవులు వేగంగా అంతరించిపోతున్న తరుణంలో అడ్డుకుని వాటిని పరిరక్షించేందుకు అటవీ సంరక్షణ చట్టాన్ని కఠిన నిబంధనలతో తీసుకువచ్చారని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ శశాంక
గూడూరు, సెప్టెంబరు 21: అడవులు వేగంగా అంతరించిపోతున్న తరుణంలో అడ్డుకుని వాటిని పరిరక్షించేందుకు అటవీ సంరక్షణ చట్టాన్ని కఠిన నిబంధనలతో తీసుకువచ్చారని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. గూడూరు మండలం సీతానాగారం శివారు కొమ్ములవంచ సమీపంలో ఉన్న భీమునిపాదం జలపాతం వద్ద జిల్లా స్థాయి అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి డీఎ్‌ఫవో రవికిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుతం వాటన్నింటిని అటవీశాఖ అమలు చేస్తుందన్నారు. అడవి అమ్మ లాంటిదన్నారు. స్వార్థంతో మానవుడు ప్రకృతికి చేసిన విఘాతాలే నేడు ఉగ్రరూపంతో మానవాళిని వేధిస్తున్న విపత్తులకు, ఉపద్రవాలకు కారణమన్నారు. తాజాగా, ఇప్పుడు అడవికి ముప్పు ఏర్పడిందన్నారు. అడవులతో పాటు దాని విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 14 శాతం మేరకే దట్టమైన అడవులు ఉండేవని కలెక్టర్ శశాంక అన్నారు. అడవుల విస్తీర్ణం పెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి మండలంలో ఐదు గ్రామాలను గుర్తించి అడవి అంతరించిపోకుండా ఉపాధిహామీ పథకం ద్వారా ట్రెంచ్ పనులు నిర్వహించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో 1.50 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉందని, పోడు పేరుతో విధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికి 90వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మళ్లీ పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
డీఎ్‌ఫవో రవికిరణ్ మాట్లాడుతూ... జిల్లాలో అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అటవీశాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం రేంజ్ పరిధుల్లో పోడు భూములను గుర్తించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ గుండేటి చంద్రమోహన్ మాట్లాడుతూ... అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకారం ఉంటుందని చెప్పారు. అడవులను నరికి కలపను స్మగ్లింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అడవులను కాపాడి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎస్పీ తీర్థాల సత్యనారాయణ, జిల్లా అధికారులు సన్యాసయ్య, రమాదేవి, ఎఫ్‌డీవోలు చంద్రశేఖర్, కృష్ణమాచారి, రేంజ్ అధికారి సురేష్, డీఆర్వోలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసన్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఎఫ్‌ఎ్‌సవోలు, బీట్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:12:49+05:30 IST