ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగుల చెరువు నిండేదెన్నడో..!

ABN, First Publish Date - 2023-02-01T00:09:12+05:30

పక్కనే కెనాల్‌ ఉన్నా నీటిని వినియోగించుకోవడానికి రైతులకు వీలులేకుండా పోతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, సముద్రాల, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాల మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్‌-పాలకుర్తి కెనాల్‌ ద్వారా నీళ్లు వెళుతున్నా సంబంధిత గ్రామాలకు సాగునీరు అందడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగేళ్లయినా పూర్తికాని ఫీడర్‌ చానల్‌ పనులు

అశ్వరావుపల్లి వద్ద భూసేకరణలో సమస్యలు

పరిష్కరించడంలో శ్రద్ధ చూపని పాలకులు

కాలువ సిద్దమైతే వేలాది ఎకరాలకు సాగునీరు

విధిలేక మోటార్లతో తరలిస్తున్న రైతులు

మంత్రి చొరవచూపాలని వేడుకోలు

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 31: పక్కనే కెనాల్‌ ఉన్నా నీటిని వినియోగించుకోవడానికి రైతులకు వీలులేకుండా పోతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, సముద్రాల, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాల మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్‌-పాలకుర్తి కెనాల్‌ ద్వారా నీళ్లు వెళుతున్నా సంబంధిత గ్రామాలకు సాగునీరు అందడంలేదు. నేలకు 10 మీటర్ల లోతులో కెనాల్‌ ఉండడంతో రైతులు ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమస్యను 2016లో అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీ్‌షరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు రఘునాథపల్లి మండలం ఆశ్వరావుపల్లి రిజర్వాయర్‌ నుంచి ఇప్పగూడెం నాగుల చెరువు వరకు 9 కిలోమీటర్ల మేర ఫీడర్‌ చానల్‌ను పునరుద్ధరించాలని ప్రతిపాదించారు. వెంటనే రూ 3.65 కోట్లతో పనులు చేపట్టే విధంగా టెండర్లు పూర్తి చేశారు. 2017 నవంబరులో శంకుస్థాపన చేశారు.

పనులు సాగిన తీరు..

ముందుగా ఆశ్వరావుపల్లి రిజర్వాయర్‌ నుంచి కోమల్ల మాటు వరకు కాలువ పునరుద్ధరణ పనులు పూర్తిచేశారు. 8 కిలోమీటర్ల పరిధిలో 9 చోట్ల రైతుల సౌకార్యార్థం కాలువపై బ్రిడ్జిలను నిర్మించారు. కొమల్ల-ఇప్పగూడెం గ్రామాల మధ్య ఉన్న మల్లంపల్లి, శివాజినగర్‌, అక్కపల్లిగూడెం గ్రామాలలోని కుంటల పునరుద్ధరణ పనులు కూడా ఈ ప్యాకేజిలో భాగంగానే పూర్తి చేశారు. కాని ఫీడర్‌చానల్‌ పనులు మాత్రం ఆగిపోయాయి. కాలువలో ఎక్కడికి అక్కడ చెట్లపొదలు పెరిగిపోయాయి. కనీసం వరదనీరు కూడా కాలువ గుండా ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. ఫీడర్‌ చానల్‌లో చెట్ల తుప్పలను తొలగించి అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ వద్ద నుంచి నీటిని విడుదల చేస్తే నాగులచెరువులోకి వస్తాయి.

ఆగిందెక్కడ..

ఫీడర్‌ చానల్‌ కోసం అశ్వరావుపల్లి రిజార్వాయర్‌ వద్ద కేవలం 300 మీటర్ల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు మూడు నుంచి నాలుగు ఎకరాల భూ మి అవసరం అవుతుంది. అది అశ్వరావుపల్లి, కోమల్ల గ్రామాల సరిహద్దులో ఉండడంతో ఈ రెండు గ్రామాల ప్రజలు భూమి ఇవ్వడానికి అంగీకరించడంలేదు. దీంతో పనులు ఆగిపోయాయి. ఈ సమస్యను అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో పనులు కాక రైతులు ఇబ్బందిపడుతున్నారు.

ఫీడర్‌ చానల్‌తో ప్రయోజనాలు..

ఫీడర్‌ చానల్‌ పనులు పూర్తయితే రఘునాథపల్లి మండలంలోని కోమల్ల, కంచనపల్లి, గబ్బెట, శివాజినగర్‌, మల్లంపల్లి గ్రామాలతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం అక్కపల్లిగూడెం, ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం, గ్రామాలకు సాగునీరు అందుతుంది. అంతేగాకుండా ఇప్పగూడెం నాగుల చెరువు నిండితే తూము ద్వారా రంగరాయగూడెం, సముద్రాల, గుంటూరుపల్లితో పాటు పాలకుర్తి మండలం గూడూరు, బమ్మెర, కోతులబాధ, ఈరవెన్ను గ్రామాలకు నీటిని తరలించవచ్చు. మొత్తంగా ఈ కాలువ ద్వారా సుమారు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.

రైతుల భగీరథయత్నం..

ఫీడర్‌ ఛానల్‌ పనులు ఆగిపోవడంతో నాగుల చెరువు కింది ఆయకట్టు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి మోటర్లు ఏర్పాటు చేసుకొని ఘన్‌పూర్‌-పాలకుర్తి ఆర్‌ఎస్‌ కెనాల్‌ నుంచి చెరువులోకి పంపింగ్‌ చేస్తున్నారు.

చెరువు నిండితే వేలాది ఎకరాలు సాగులోకి

వీరగోని నారాయణగౌడ్‌, సముద్రాల గ్రామ రైతు

నాగుల చెరువు గోదావరి జలాలతో నిండితే చెరువు కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలకు సాగునీరు అందు తుంది. అంతేగాకుండా ఇంత కాలం నీళ్లు లేక పడావుపడిన వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. ఆ దిశగా అధికారులు చర్య తీసుకోవాలి. మంత్రి దయాకర్‌రావు చొరవ చూపాలి.

భూ సేకరణ సమస్యతో జాప్యం..

ఎమ్డీ యాసర్‌, ఏఈ, నీటిపారుదల శాఖ

ఆశ్వరావుపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఫీడర్‌ చానల్‌ ఏర్పాటుకు రైతుల నుంచి కొంత భూ సేకరణ చేయాల్సి ఉంది. చానల్‌ పైన 9చోట్ల బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. కాలువలో చెట్ల పొదలను తొలగించే పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే భూ సేకరణ పూర్తి చేసి, కాలువలో చెట్ల పొదలను తొలగించి నీటిని విడుదల చేస్తాం.

Updated Date - 2023-02-01T00:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising