ప్లాస్టిక్‌ను అరికడదాం.. ప్రకృతిని రక్షిద్దాం
ABN, First Publish Date - 2023-06-05T00:47:26+05:30
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలనే విషయంలో ఐక్య రాజ్య సమితి ఎన్నో ఏళ్లుగా ప్రపంచ దేశాలను చైతన్యం చేస్తూనే ఉంది. పెరుగుతున్న భూతాపం, కాలుష్యం నేపథ్యంలో ప్రపంచానికి ముంచుకు వస్తున్న ముప్పును కళ్ల ముందు ఉంచుతున్నది. అయినా మానవాళి వాటిని పెడ చెవిన పెడుతూనే ఉంది. దాని ఫలితమే పెరిగిన ఉష్ణోగ్రతలు. వేసవి వచ్చిందంటే మానవాళి భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మనిషి మేలుకోక పోతే పర్యావరణం జీవరాశి మనుగడకు ప్రతికూలంగా మారక తప్పదు.
ఐక్యరాజ్య సమితి పిలుపును ఆచరిద్దాం
పర్యావరణ హితానికి ప్రతిన బూనుదాం
మొక్కలు నాటి కర్బన ఉద్గారాలు తగ్గిద్దాం
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్, జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలనే విషయంలో ఐక్య రాజ్య సమితి ఎన్నో ఏళ్లుగా ప్రపంచ దేశాలను చైతన్యం చేస్తూనే ఉంది. పెరుగుతున్న భూతాపం, కాలుష్యం నేపథ్యంలో ప్రపంచానికి ముంచుకు వస్తున్న ముప్పును కళ్ల ముందు ఉంచుతున్నది. అయినా మానవాళి వాటిని పెడ చెవిన పెడుతూనే ఉంది. దాని ఫలితమే పెరిగిన ఉష్ణోగ్రతలు. వేసవి వచ్చిందంటే మానవాళి భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మనిషి మేలుకోక పోతే పర్యావరణం జీవరాశి మనుగడకు ప్రతికూలంగా మారక తప్పదు.
మితిమీరుతున్న పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేసే ఉద్ధేశంతో ఐరాస మొదటిసారి 1972లో జూన్ 5 నుంచి 16 వరకు స్టాక్‌హోంలో పర్యావరణ పరిరక్షణ అంశాలపై సమావేశాలు నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతీ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఒక్కో సంవత్సరం ఒక ప్రత్యేక నినాదంతో పర్యావరణ దినోత్సవం జరుపుకునేలా ఐరాస ప్రపంచ దేశాలను చైతన్యం చేస్తున్నది. ఇప్పటి వరకు ఇచ్చిన నినాదాల వివరాలు ఇలా ఉన్నాయి..
1973లో అనేక పర్యావరణ సమస్యల గుర్తింపు, అవగాహన
1974లో మానవుని దురాశ ఫలితంగా విధ్వంసమౌతున్న భూగోళం పరిస్థితిపై అవగాహన కల్పించింది.
1989లో భూతాపం-భూగోళానికి హెచ్చరిక అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది.
పర్యావరణ అంశాల పట్ల జాగ్రత్తలు పాటించకుండా నెలకొల్పే పరిశ్రమలు, ఏటా మిలియన్‌ల హెక్టార్ల అడవుల అదృశ్యం, అడ్డగోలుగా శిలాజ ఇంధనాల వాడకంపై అవగాహన కల్పించింది.
నీటికోసం బిలియన్ల ప్రాణాలు పోతున్నాయి
నీటి ఆవశ్యకత, పరిరక్షణ పద్ధతుల పట్ల అవగాహన కల్పించేందుకు 2003లో ‘నీరు- నీటి కోసం బిలియన్ల ప్రాణాలు పోతున్నాయి’ ఇతివృత్తంగా ఐరాస ప్రకటించి సమస్యలను మానవాళి ముందుంచింది. భూమిపై మూడొంతులు నీరున్నా దానిలో 97.5 శాతం ఉప్పు నీరే. మిగతా 2.5 శాతం మంచి నీటిలో వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 0.007 శాతం మాత్రమే.
నిలబడ్డ కొమ్మను నరుక్కుంటున్న మనిషి
అంతరిస్తున్న అడవులు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, భూతాపం మనిషి మూర్ఖత్వానికి తాను నిలబడ్డ కొమ్మను తానే నరుక్కుంటున్న తీరుకు నిదర్శనం. 33 శాతం అడవులు, చెట్లు ఉంటేనే మానవాళికి మనుగడ, ప్రకృతి సమతుల్యత కాపాడడం సాధ్యమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా మనిషి తలకు ఎక్కడం లేదు.
ఇప్పుడు మనిషి ఏం చేయాలి?
పారిశ్రామికీకరణం, అడవుల నరికివేతను అరికట్టాలి.
పరిసరాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, నీటి పొదుపు, విద్యుత్, శిలాజ ఇంధనాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.
పండుగలు, వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి. ప్రతీ ఒక్కరిని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలి.
కాలుష్యాలు ఇదే తీరుగా కొనసాగితే 2100 సంవత్సరం నాటికి ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగి మానవుల వ్యాధి నిరోధకతపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు హచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది భిన్నం..
నలభైఐదు ఏళ్లుగా పర్యావరణ దినోత్సవాలకు ఇతివృత్తాలను ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యం నివారణ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం దీనిలో ముఖ్యాంశాలు. అదే విధంగా ప్రజలంతా ప్రకృతితో అనుసంధానం కండి అనే నినాదంతో ముందుకు సాగుతూ ప్రకృతిని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుందనే విషయం గ్రహించాలి.
పర్యావరణాన్ని ఇలా కాపాడవచ్చు : డి.సత్యప్రకాష్, జన విజ్ఞాన వేదిక కన్వీనర్
ప్రతీ ఒక్కరు మొక్కలు విరివిగా నాటాలి. సామాజిక అడవులు పెంచాలి. ప్లాస్టిక్ బ్యాగులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, విద్యుత్ వాడకం తగ్గించాలి. దీని కోసం ప్రజా రవాణ వ్యవస్థను ఎక్కువగా వాడాలి. పరిశ్రమలు కూడా కర్బన ఉద్గారాలను విడుదల చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బొగ్గు ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. కరెంట్, సొంత వాహనం వాడకం తగ్గించాలి.
Updated Date - 2023-06-05T00:47:26+05:30 IST