ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అభయహస్తం’ ప్రీమియం డబ్బులు అటేనా!?

ABN, First Publish Date - 2023-03-29T00:11:31+05:30

అభయ హస్తం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అమలు చేసిన బీమా పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్నేళ్లపాటు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని మాత్రం ఇప్పటికీ తిరిగి చెల్లించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పథకం రద్దయినా ఇప్పటివరకూ తిరిగివ్వని సర్కారు

ఈ నెలలో చెల్లిస్తామని ప్రకటన

ఇప్పటివరకు జారీ కాని ఉత్తర్వులు

90 వేల మంది లబ్దిదారులు

ఉమ్మడి జిల్లాకు రావాల్సిన మొత్తం రూ. 45 కోట్లు

హనుమకొండ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : అభయ హస్తం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అమలు చేసిన బీమా పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్నేళ్లపాటు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని మాత్రం ఇప్పటికీ తిరిగి చెల్లించడం లేదు. ఈ మొత్తాన్ని ఏప్రిల్‌ మొదటి వారంలో చెల్లించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు.

గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సెర్ప్‌ ఉద్యోగులకు కొత్త వేతన స్కేళ్ల అమలుతో పాటు అభయ హస్తం డబ్బులను చెల్లించిన ఎస్‌హెచ్‌జీల సభ్యులకు తిరిగి చెల్లించాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారికంగా ప్రకటించారు. మార్చిలో డబ్బులు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి కసరత్తు జరుగుతున్నట్టు కనిపించడం లేదు. అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటి వరకు అందలేదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు. అభయహస్తం డబ్బులు తిరిగి వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మహిళలు నిరాశకు లోనవుతున్నారు.

పెన్షన్‌ కోసం..

మహిళలకు వారి వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించేందుకు పెన్షన్‌, బీమా పథకంగా ఈ అభయ హస్తం పథకాన్ని 2009 నవంబర్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకం రద్దు చేసినా మహిళలు చెల్లించిన ప్రీమియం డబ్బులు చెల్లించలేదు. ఈ పథకం కింద వస్తుందనుకున్న పెన్షన్‌ రాక, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్‌ పొందలేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90 వేల మంది మహిళలు ఈ అభయహస్తం ప్రీమియం సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 86వేల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా 4వేల మంది పట్టణ ప్రాంతం వారు. ఒక్కోక్కరికి సుమారు రూ. 4 వేల నుంచి రూ. 5వేల వరకు రావాల్సి ఉంది.

2009లో...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉండగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2009లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కోసం ఎల్‌ఐసీ అనుసంధానంతో అభయహస్తం పేరిట బీమా పాలసీని ప్రవేశపెట్టింది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయస్సు కలిగిన మహిళలు అభయ హస్తం బీమా పథకంలో చేరొచ్చు, పాలసీ తీసుకున్న సభ్యులు ఏడాదికి రూ.365 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 59 ఏళ్లు నిండే వరకు వాయిదాలు చెల్లిస్తూ ఉండాలి. వారి పిల్లలు చదువుతుంటే ఉపకార వేతనం మంజూరు చేస్తారు. 60 ఏళ్ల నుంచి చివరి మజిలీ వరకు నెలకు రూ. 500 చొప్పున పింఛను వస్తుంది. చనిపోతే రూ. 30వేలు, ఆర్థిక సాయం నామినీకి అందజేస్తారు.

రూ.45 కోట్లు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలు హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లిలతో పాటు వరంగల్‌ మహానగర పాలక సంస్థ, అప్పటి మూడు పురపాలక సంఘాలు జనగామ, నర్సంపేట, మహబూబాబాద్‌ పరిధిలోని 90 వేల మంది స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు అభయ హస్తంలో చేరారు. 2013 వరకు వార్షిక ప్రీమియంగా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. అయిదేళ్లు చెల్లించిన మొత్తం రూ.40 కోట్లు అయింది. అప్పటి నుంచి వడ్డీకూడా లెక్కిస్తే రెండింతలు అవుతుంది.

2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభయహస్తం బీమా పథకాన్ని రద్దు చేసి ప్రీమియం వసూళ్లను నిలిపివేసింది. మార్పులు, చేర్పులతో మరింత మెరుగైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ అమలు చేస్తుందని మహిళలు భావించారు. కానీ పథకాన్ని కొనసాగించకపోగా కట్టిన ప్రీమియం సొమ్ములు కూడా వెనక్కి ఇవ్వలేదు. అభయహస్తం పథకం లబ్దిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడాన్ని గమనించిన ప్రభుత్వం ప్రీమియం సొమ్ము తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లోని సెర్ప్‌ సిబ్బంది మహిళల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. వారం, పది రోజుల్లో ప్రభుత్వం వడ్డీతో సహా ప్రీమియం డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందని భరోసా ఇచ్చారు. నెలలు గడిచినా డబ్బులు ఖాతాల్లో జమకాక మహిళలు నిరాశకు లోనవుతున్నారు.

నీరుగారిన లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం అసరా పించన్‌ కింద నెలకు రూ. 2016 చెల్లిస్తున్నందు వల్ల అభయ హస్తం అవసరం లేదని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జీవన్‌ బీమా యోజన (పీఎంజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష యోజన (పీఎంఎ్‌సకేవై) పథకాలు అభయహస్తం తరహాలోనే ఉన్నాయి. కనుక అభయ హస్తం కొనసాగించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించింది.

అభయహస్తం పథకాన్ని మొత్తానికి ఎత్తివేసిన ప్రభుత్వం ఈ పథకం కింద నమోదైన ఎస్‌హెచ్‌సీ మహిళా సభ్యులకు ఆసరా పథకం వర్తింప చేయాలని నిశ్చయించింది. 2009లో అభయ హస్తం పథకం ప్రారంభమైనప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 90వేల మంది సభ్యులు ఉండగా వీరిలో 50 శాతం మందికి ఆసరా పెన్షన్‌ రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అభయ హస్తం పథకం వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అభయ హస్తంలోని సభ్యుల్లో ఆసరా పెన్షన్‌ అందనివారిని గుర్తించి అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు అప్పట్లో ప్రకటనలు కూడా వెలువడ్డాయి. కానీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటి వరకు జారీ కాలేదు. అభయ హస్తం ఎత్తివేయడం వల్ల చాలా మంది మహిళలకు ఈ పథకం కింద పెన్షన్‌ రాకుండా పోయింది. అటు ఆసరా పెన్షనూ రావడం లేదు. దీనితో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది.

Updated Date - 2023-03-29T00:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising