అక్రమ దందా..!
ABN, First Publish Date - 2023-01-20T00:20:27+05:30
యార్డుకు చేరని దిగుబడులు ఇండ్ల వద్దనే బేరమాడుతున్న దళారులు సెస్సు ఎగవేత.. తక్కువ ధరకు కొనుగోలు మార్కెట్ అధికారుల ఆదేశాలు బేఖాతరు
గూడూరు, జనవరి 19 : పత్తి దిగుబడులు చేతికొచ్చాయి. తక్కువ ధరకు కాజేసేందుకు వ్యాపారులు, దళారులు ఎత్తుగడలు వేస్తున్నారు. రైతులు చెమటోడ్చి పండించిన పత్తికి గిటు బాటు ధరలు కల్పించడంతో పాటు వ్యాపారుల మోసాలను కళ్లెం వేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన వ్యాపారుల అక్రమ కొనుగోళ్లు ఆగడం లేదు. యథేచ్ఛగా వ్యాపారులు దుకాణాలు, రైతుల ఇండ్ల వద్దనే పత్తి కొనుగోళ్లు సాగిస్తున్నారు. అధికారుల పట్టింపులేని చర్యలతో గూడూరు మండలంలో పలు గ్రామాల్లో పలువురు వ్యాపారులు అక్రమ పత్తి కొనుగోళ్లను చేపడుతున్నారు. సంబంధిత అధికా రులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గూడూరులో అక్రమ పత్తి కొనుగోళ్లపై ఆంద్రజ్యోతి ప్రత్యేక కథనం.
పత్తి వాహనం కనిపిస్తే చాలు
మార్కెట్ యార్డుకు వెళ్లనీయకుండా పరిశ్రమల వైపు మళ్లిస్తున్నారు. మంచి ధర కల్పిస్తా మని రైతులకు ఆశ చూపుతున్నారు. వారిని నమ్మి వెళితే తక్కువ ధరకు దిగుబడులు కొని మోసగిస్తున్నారు. పత్తి వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మార్కెట్ యార్డు, వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.
నెక్కొండ, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో 20 కి.మీ వరకు రోడ్లపై, దుకాణాలు, ఇండ్ల వద్ద ఎక్కడ రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయరాదు. ఈ నిబంధనలను మార్కె టింగ్ శాఖ బైలాలో పొందుపరిచారు. అయినా కొందరు దళారి పత్తి వ్యాపారులు మార్కెట్ యార్డుకు దిగుబడులను రానీకుండా అడ్డుకుంటున్నారు. ఇండ్లల్లో పత్తి నిల్వలు ఉన్న రైతులను గుర్తించి బేరమాడి మార్కెట్ లేదా పరిశ్రమలకు తరలిస్తున్నారు. గూడూరు జాతీయ రహదారి వైపున 10 అక్రమ పత్తికొనుగోలు దుకాణాలు వెలిశాయి. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు రోజు వందల వాహనాలు పత్తి దిగుబడులతో బారులు తీరుతాయి. వివిధ ప్రాంతాల నుంచి పత్తి రైతులు తమ దిగుబడులు అమ్మేందుకు వస్తారు. వీరిని బుట్టలో వేసుకునేందుకు కొందరు యాజమానులు గ్రామాల్లో దళారులను నియమించారు. ఒక్కో వాహానంలో 18 నుంచి 28 క్వింటాళ్ల పత్తి ఉంటుంది. ఇలా రోజుకు వందల క్వింటాళ్ల పత్తి టెండర్లు లేకుండా దుకా ణాల్లో కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు చెప్పిందే ధర రైతులకు బేరమాడే అవకాశం ఉండటం లేదు. తుకాల్లోనూ, ధరల్లోనూ మోసాలు జరుగుతున్న మార్కెట్ అధికారు లు చర్యలు తీసుకోవడం లేదు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
మార్కెట్ లావాదేవీలు జరిగితే ఏ వ్యాపారి ఎంతమేర కొనుగోలు చేశారో తెలిసిపోతుంది. కొన్న దిగుబడి విలువలో ఒక శాతం యార్డుకు సెస్సు చెల్లించాలి. దీన్ని తప్పించుకునేందుకు యార్డుకు రాక ముందే ఇండ్లు, రహదారులు, దుకాణాల్లో బేరమాడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీనిపై ప్రశిస్తే యార్డులో కొన్నా సెస్సు చెల్లిస్తామని అంటున్నారు. కానీ కొనుగోలు ధరను తగ్గించి చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌లో రైతుల నుంచి క్వింటా పత్తికి రూ.7500 నుంచి రూ.8వేలు కొనుగోలు చేసి. రూ.5వేలకే కొన్నట్లు లెక్కలు చూపిస్తున్నారని సమాచారం. తద్వారా రూ.5వేల కొనుగోలు ధరపైనే యార్డుకు వాణిజ్య పన్నుల శాఖకు సెస్సు చెల్లిస్తున్నారు. ఇలా అక్రమ పత్తి వ్యాపారులు పన్నులో ఎగవేస్తున్నారు. గ్రామాల్లో రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి క్వింటా పత్తికి రూ.6500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని తిరిగి రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలతోనే మార్కెట్ కేంద్రాల్లో విక్రయిస్తూ పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నారు. ఈ విషయంలో మార్కెట్ అధికారులు కఠినంగా వ్యవహ రించకపోవడంతో వ్యాపారుల పత్తి అక్రమ కొనుగోళ్లు గూడూరు ప్రాంతాంలో యద్థేచ్చగా సాగుతున్నాయి.
మోసపోతున్న రైతు
మార ్కెట్ యార్డులో దిగుబడులను విక్రయించడం ద్వారా రైతులు మంచి ధర పొందే అవకాశం ఉంది. చెల్లింపుల సక్రమంగా లేకపోయిన తూకాల్లో మోసం జరిగినా నిలదీసే వీలు ఉంటుంది. అధికారులకు ఫిర్యాదు చేస్తే వ్యాపారుల లైసెన్స్ కూడా రద్దు అవుతుంది. కానీ దళారుల మాటలను నమ్మి రైతులు నిలువుగా మోసపోతున్నారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
మినీ మార్కెట్‌లను తలపిస్తున్న షాపులు
గూడూరు జాతీయ రహదారిలో పోడవున ఉన్న అక్రమ పత్తి కొనుగోలు దుకాణాల ముందు నిలబడిన పత్తి వాహనాలు మినీ మార్కెట్‌ను తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఈ దుకాణాల్లో ఒక్క కేజీ పత్తి కూడా కొనుగోలు చేయరాదు. అలాంటిది పత్తి వ్యాపారులు వేల క్వింటాళ్లు నేరుగా కొని మార్కెటింగ్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
గుమస్తాలే పత్తి వ్యాపారులు
రెండు సంవత్సరాల కిందట గూడూరు మండల కేంద్రంలో కేవలం రెండు పత్తి కొనుగోలు దుకాణాలు మాత్రమే ఉన్నాయి. ఈ దుకాణాల్లో పని చేసిన గుమాస్థాలే అక్రమ పత్తి వ్యాపారస్తులుగా మారారు. గూడూరు జాతీయ రహదారిలో ఎంపీడీవో కార్యాల యం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు 10 అక్రమ పత్తి కొనుగోలు దుకాణాలు వెలిశాయంటే పత్తి కొనుగోలు ద్వారా ఎంత లాభర్జన ఉందో అర్థం చేసుకో వచ్చు. గ్రామాల్లో సైతం దళారులను ఏర్పాటు చేసుకు ని నెలవారి వేతనాలను చెల్లిస్తున్నట్లు సమాచారం. పత్తి వ్యాపారం చేసేవారికి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకారం ఉండడం గమానార్హం.
Updated Date - 2023-01-20T00:20:32+05:30 IST