ఎనిమిది వేలు.. ఏ మూలకు!?
ABN, First Publish Date - 2023-06-26T23:41:37+05:30
గ్రామాల్లో ఏళ్లతరబడి పనిచేస్తున్న జీపీ కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా పనిచేసినా కనీస వేతనానికి కూడా నోచుకోక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
పనిభారంతో సతమతమవుతున్న ఉద్యోగులు
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు
కనీస వేతనం చెల్లించాలని డిమాండ్
సమస్యల పరిష్కారానికి జూలై 6 నుంచి సమ్మెబాట
లింగాలఘణపురం, జూన్ 26: గ్రామాల్లో ఏళ్లతరబడి పనిచేస్తున్న జీపీ కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా పనిచేసినా కనీస వేతనానికి కూడా నోచుకోక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏడాదంతా కష్టపడితే వచ్చే వేతనం ఆస్పత్రులకు కూడా సరిపోక అనేక అవస్థలు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎందరు ముఖ్యమంత్రులు మారినా వేతనాల పెంపులో అత్తెసరు సాయం తప్ప కనీస వేతనానికి నోచుకోవడం లేదు.. స్వరాష్ట్రంలోనైనా తమ బతుకులు బంగారుమయవుతాయనుకున్న పంచాయతీ ఉద్యోగుల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్నట్లుగా తయారైంది. పొద్దున లేచింద మొదలు పరుగుపరుగున వీధుల్లో చీపుర్లు, పారలు పట్టుకు తిరిగే తమ బతుకులు ఇంకెన్నడు బాగుపడుతాయంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనిభారంతో సతమతం..
గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు పనిభారం పెరిగిపోయి సతమతమవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పుడున్నవారితోనే నెట్టుకురావాలని ఒత్తిడి తెస్తుండటంతో ఉన్నవారిపై పనిభారం పెరుగుతోంది. గ్రామస్థాయిలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా పంచాయతీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా అందరూ వారిపై పనిభారం మోపుతూనే ఉంటారు. రాత్రి పగలు, తేడా లేకుండా పనులు చేయిస్తూనే ఉంటారు. ఇంత చేసినా వేతనాల పెంపు విషయంలో మాత్రం తమను పట్టించుకునే దిక్కులేదని పంచాయతీ ఉద్యోగులు వాపోతున్నారు.
అరకొర వేతనం.. పొట్టగడవని వైనం..
రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులతో పోల్చుకుంటే అత్యంత ఎక్కువ పనిచేస్తూ అతి తక్కువ వేతనం పొందేది తామేనని గ్రామపంచాయతీ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.8,500 ఏ మూలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదికూడా నెలనెలా చేతికి అందకుండా విడతల వారీగా చెల్లిస్తున్నారని, అందులో వైద్యఖర్చులకే సగానికి పైగా ఖర్చవుతున్నాయని గోడు వెల్లబోసుకుంటున్నారు. నెలనెలా వచ్చే రేషన్ బియ్యంతోనే ఆకలి తీర్చుకుంటున్నామని, పిల్లల చదువులకు, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సివస్తోందని వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1210 మంది సిబ్బంది..
జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 281 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో 1210 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1138 మంది మల్టీపర్పస్ వర్కర్లు, 10 మంది స్వీపర్లు, ముగ్గురు ఆపరేటర్లు, నలుగురు ఎలక్ట్రీషియన్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు బిల్‌కలెక్టర్లు, 19 మంది కారోబార్లు, 28 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ముగ్గురు అటెండర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలవారీ వేతనాలు ఠంచన్‌గా జమకాకుండా ఎప్పుడు చేతికందుతాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రధాన డిమాండ్లు
కనీస వేతనానికి నోచుకోకుండా ఏళ్లతరబడిగా వెట్టి చాకిరీకి గురవుతున్న పంచాయతీ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూలై 6 నుంచి సమ్మెబాట పడుతున్నారు. జీవో నెంబర్ 51 ని రద్దు చేయాలని, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే డిమాండ్లతో సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు.
వెట్టిచాకిరీ చేస్తున్నాం...
- గండి సురేందర్, మల్టీపర్పస్ వర్కర్, వడ్డిచర్ల
ఏళ్లతరబడిగా గ్రామపంచాయతీకి వెట్టిచాకిరి చేస్తున్నప్పటికీ కడుపుకు సరిపడే తిండి దొరకని దుస్థితి నెలకొంది. నెలకు ఇచ్చే వేతనం రూ. 8500తో కుటుంబపోషణ కష్టమవుతోంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగుల వేతనాలు పెంచి ఆదుకోవాలి.
రెగ్యులరైజ్ చేయాలి...
- మల్లాచారి, గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు
గ్రామపంచాయతీల్లో అనేక ఏళ్లనుంచి బతుకు పోరాటంచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ప్రతీ కార్మికుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కారోబార్లకు అసిస్టెంట్ సెక్రెటరీగా గానీ, జూనియర్ అసిస్టెంట్‌గా గానీ స్పెషల్ స్టేటస్ కల్పించాలి. ఇందుకోసం గ్రామపంచాయతీ ఉద్యోగుల రాష్ట్రకమిటీ పిలుపుమేరకు జూలై6 నుంచి సమ్మె చేసేందుకు సన్నద్ధమవుతున్నాం.
Updated Date - 2023-06-26T23:41:37+05:30 IST