డబుల్ ట్రబుల్
ABN, First Publish Date - 2023-10-02T00:06:56+05:30
నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇంటికల సాకారం కావడం లేదు. స్వరాష్ట్రంలోనైనా ఇళ్ల్లు దక్కుతాయని ఆశపడిన నిరుపేదలకు నిరాశ ఎదురైంది. గృహాలు లేనివారికి ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, పంపిణీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ అక్కడక్కడ ఫలించగా, ఇల్లు దక్కినప్పటికి వసతుల లేమితో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైన రోడ్లు, సైడ్‌డ్రైనేజీలు లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు.
రెండు పడకల ఇళ్లను పంపిణీ చేశారు.. వసతులు మరిచారు..
సౌకర్యాలు లేక లబ్ధిదారుల ఇబ్బందులు
ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతున్న నిర్మాణాలు
జిల్లాకు 5,571 మంజూరు కాగా, 1,733 మాత్రమే పూర్తి
కొన్నిచోట్ల పూర్తయినాఅందని గృహాలు
మహబూబాబాద్ టౌన్, అక్టోబరు 1 : నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇంటికల సాకారం కావడం లేదు. స్వరాష్ట్రంలోనైనా ఇళ్ల్లు దక్కుతాయని ఆశపడిన నిరుపేదలకు నిరాశ ఎదురైంది. గృహాలు లేనివారికి ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, పంపిణీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ అక్కడక్కడ ఫలించగా, ఇల్లు దక్కినప్పటికి వసతుల లేమితో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైన రోడ్లు, సైడ్‌డ్రైనేజీలు లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. మరోపక్క విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, వీధి దీపాలు పెట్టకపోవ డంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులు చీకట్లో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఇక కొన్నిచోట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తరునా ఎంపికలు పూర్తి కాలేదు. దీంతో అవి నిరుప యోగంగా మారుతున్నాయి. ఇంకా కొన్నిప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 5,571 ఇళ్లు మంజూరు కాగా, 1,733 ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 1,313 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 1,096 మందికి ఇళ్లను కేటాయించారు. మిగతా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి.
వసతుల లేమితో ఇక్కట్లు..
జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి.. లబ్ధిదారులు నివసిస్తున్నా సరైన సౌకర్యాల్లేక అవస్థలు పడుతున్నారు. మానుకోటలోని రామచంద్రాపురం కాలనీ శివారులో మునిసిపల్ పరిధిలోని 36 వార్డుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిలువ నీడలేని నిరుపేదలకు గృహాలు అందించేందుకు 360 నిర్మాణాలు చేపట్టారు. ముందుగా చేపట్టిన 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణాలు పూర్తికాగా, వార్డుల్లో గ్రామసభలో నిర్వహించి అర్హులను ఎంపికచేసి గృహాలు కేటాయించారు. వారు ప్రస్తుతం అందులో నివాసముంటున్నారు. మిగతా 160 నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే అక్కడ కనీస వసతులు కూడ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ శివారులో ఉన్న డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లడానికి సరైన రోడ్డుమార్గం లేక, వర్షంవస్తే బురదయయగా మారుతున్న మార్గం గుండానే అక్కడికి వెళ్లాల్సిన ధైన్యస్థితి నెలకొంది. అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీలు కూడలేక పోవడంతో మురికినీరు, వర్షపునీరు ఇళ్ల మధ్యకు వచ్చి చేరడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో నిరుపేదలు రోగాల బారిన పడుతున్నారు. మరోపక్క వీధి దీపాలు లేక రాత్రి అయితే ఆ ప్రాంతమంతా అంధకారంగా మారుతోంది. చుట్టూ ప్రహరీ నిర్మించక పోవడంతో పందులు వస్తున్నాయి. పక్కనే శ్మశాన వాటిక ఉండడంతో ఇళ్ల మధ్యలో నుంచే దహన సంస్కారాలకు శవాలను తీసుకువెళ్లడంతో లబ్ధిదా రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లు పంపిణీ చేశారు.. వసతులు మరిచారంటూ లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
మహబూబాబాద్ జిల్లాలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లవద్ద అక్కడక్కడ సౌకర్యాలు కల్పించినప్పటికి మరికొన్ని ప్రాంతాల్లో వసతుల లేమితో లబ్ధిదారులు కష్టాలు పడుతున్నారు. మరిపెడ మండల కేంద్రంతో పాటు తానంచర్ల శివారు తండాలు, ఎల్లంపేట రోడ్డు పక్కనఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ప్రధానంగా తాగునీటి, సెప్టిక్ ట్యాంకులు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, సైడ్ డ్రైనేజీ సమస్యలు దర్శనమిస్తున్నాయి. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం, వేములపల్లి, గున్నెపల్లి, బీరిశెట్టిగూడెంలో ఇళ్ల్లు నిర్మించారు. కానీ, లబ్ధిదారులకు అందించకపోవడంతో అవి నిరు పయోగం ఉన్నాయి. సీరోలు మండలం కాంపెల్లి శివారు పలుకుబోడు తండాలో డబుల్‌బెడ్ ఇళ్ల వద్ద సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి.
తొర్రూరు మండలం చీకటాయపాలెంలో సైడ్ డ్రేనేజీలు లేక మురికినీరు రోడ్డుపైకి వస్తోంది. తొర్రూరు మునిసిపాలిటీ పరిధిలో కొన్ని నిర్మాణాలు పూర్తయినప్పటికి పంపిణీ కాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరికొన్ని ఇళ్ల నిర్మాణాలు 2014లో ప్రారంభమైనప్పటికి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. గార్ల, పుల్లూరులో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల్లవద్ద రోడ్డు లేక అవస్థలు పడుతున్నారు. చిన్నగూడూరు మండలకేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికి అవి లబ్ధిదారులకు అందించలేదు. కురవిలో ఏడాది క్రితం డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించగా, నేటికి విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వసతులు కల్పించి ఆదుకోవాలి : వరికుప్పల కవిత, డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుడు, మానుకోట
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కనీస వసతులు కల్పిం చాలి. రోడ్డు మార్గం లేక వర్షం వస్తే బురదమయం గా మారిన మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాం. అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ కాల్వలులేక నీరంతా ఇళ్ల మధ్యలో చేరడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ వద్ద సౌకర్యాలు కల్పించి తమను ఆదుకోవాలి.
వీధి దీపాలు లేక భయంతో గుడుపుతున్నాం : బూర్ల ఉమ, డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుడు, మానుకోట
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద వీధిధీపాలు లేక భయంతో గడుపుతున్నాం. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఊరికి చివరలో ఉండడంతో రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. చీకట్లో కుక్కల అరుపులు వినిపిస్తే భయంతో వణికిపోతున్నాం. పాలకులు, అధికారులు స్పందించి వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
Updated Date - 2023-10-02T00:06:56+05:30 IST