సీఎం చొరవతో పల్లెలు అభివృద్ధి
ABN, First Publish Date - 2023-04-03T00:18:27+05:30
సీఎం కేసీఆర్ చొరవతో అంచెలంచెలుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
సర్వాయి పాపన్న గొప్ప పోరాటయోధుడు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పెద్దమడూరులో సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ
దేవరుప్పుల, ఏప్రిల్ 2: సీఎం కేసీఆర్ చొరవతో అంచెలంచెలుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని పెద్దమడూరులో మంత్రి ఎర్రబెల్లి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో వేర్వేరుగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో 75 ఏళ్లలో చేయని అభివృద్ధిని 8 ఏళ్లుగా చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చెక్‌డ్యాంలు కట్టడం వల్లే బోరు బావుల్లో నీటి ఊటలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వాలు ఏమి అభివృద్ధి చేశాయో ప్రశ్నించాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించి ప్రజలు రోగాల బారిన పడకుండా చేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాటయోధుడని తెలిపారు. ఆయన వ్యక్తి మాత్రమే కాదని.. ఒక శక్తి అని, నిజాం పాలనపై తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటించాడన్నారు. ఈ ప్రాంతంలో ఆయన పుట్టడం మన అదృష్టంగా భావించాలన్నారు. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని, హైదరాబాద్‌లో 5 ఎకరాల స్థలంలో పెద్ద భవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.20లక్షల నిధులు మంజూరీ ఇస్తానన్నారు. కాగా, గ్రామ గౌడ సంఘం ప్రతినిధుల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి కల్లు సేవించారు.
సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుతో పాటు ఆవిష్కరణ, కంఠమహేశ్వరస్వామి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసిన గ్రామానికి చెందిన యువకుడు బబ్బూరి శ్రీకాంత్‌ను మంత్రి దయాకర్‌రావు అభినందించారు. అందరు సంపాదిస్తారు కాని.. కొంత మందికి ఖర్చు చేసే గుణం ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు ఆకవరం సృజన, రాజన్న, ఎంపీటీసీ పానుగంటి గిరి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి, నాయకులు బస్వ మల్లేశం, పల్లా సుందర్‌రాంరెడ్డి, బండ రాములు, సంజీవరెడ్డి, బుక్కా రమేష్, రమేష్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T00:18:27+05:30 IST