TS Roads Damage: రిపేరుకు దారేదీ?
ABN, First Publish Date - 2023-02-06T02:42:14+05:30
ఆర్ అండ్ బీ రోడ్లు.. పంచాయతీరాజ్ రోడ్లు! శాఖ ఏదైతేనేం! రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయం! మొన్నటి వర్షాలు, వరదలకు మరింత ధ్వంసమయ్యాయి! కొన్ని రోడ్లలోని గుంతల్లో ప్రయాణం ఊయలను తలపిస్తోంది.
అడుగడుగునా గుంతలు..
అధికారుల కళ్లకు గంతలు
పాడైన రోడ్ల మరమ్మతులకు కుదరని ముహూర్తం
రెండు నెలల కిందటే అధికారులతో సీఎం సమీక్ష.. వర్షాకాలంలోపు పూర్తి చేసేయాలని కేసీఆర్ ఆదేశంపాలనా అనుమతులు ఇచ్చినా మొదలుకాని పనులు.. గత బిల్లులు కోట్లలో పెండింగ్.. కాంట్రాక్టర్ల వెనకడుగుటెండర్లు వేసినచోట్ల పలు కారణాలతో అధికారుల కొర్రీలు.. టెండర్ రూల్స్ మార్చాలని కాంట్రాక్టర్ల విజ్ఞప్తులు
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు మోక్షం లేదు. గుంతలతో వాహనదారులకు నరకం కనిపిస్తున్నా.. అధికారులకు పట్టడం లేదు. సర్కారు పాలనా అనుమతులిచ్చినా పనులు చేపట్టడం లేదు. గత బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మొత్తం మీద రిపేరుకు దారి కనిపించడం లేదు!
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆర్ అండ్ బీ రోడ్లు.. పంచాయతీరాజ్ రోడ్లు! శాఖ ఏదైతేనేం! రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయం! మొన్నటి వర్షాలు, వరదలకు మరింత ధ్వంసమయ్యాయి! కొన్ని రోడ్లలోని గుంతల్లో ప్రయాణం ఊయలను తలపిస్తోంది. ఆ రోడ్లలో ప్రమాదాలు జరిగి పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలూ వ్యక్తమయ్యాయి. దాంతో, రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడంతోపాటు కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మించాలని, ఈ పనులను వానాకాలం లోపు పూర్తి చేసేయాలని ఆదేశించారు. లేదంటే ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయని కూడా స్పష్టం చేశారు. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.635 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో వరదలతో పాడైన రోడ్ల మరమ్మతుల కింద 747 పనులు చేయాల్సి ఉందని ఆ శాఖ తేల్చింది. బీటీ రెన్యువల్స్ కింద 850 పనులున్నాయని పేర్కొంది. రెండు పనులకూ కలిపి రూ.1867 కోట్లు కేటాయిస్తూ డిసెంబరులోనే పరిపాలనా అనుమతులు జారీ చేసింది. అయినా, ఇప్పటి వరకూ ఒక్క రహదారి కూడా మరమ్మతుకు నోచుకోలేదు. మరమ్మతులకు రెండు శాఖలూ కార్యాచరణ రూపొందించలేదు. ఇప్పటికీ టెండర్లే పూర్తి కాలేదు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. గతంలో చేసిన పనులకు కోట్ల రూపాయల్లో పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీ ఎ్‌సవై) కింద పంచాయతీరాజ్‌లో రూ.430 కోట్లు, ఆర్ అండ్ బీలో రూ.400 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. పెండింగ్ బకాయిల చెల్లింపుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే టెండర్లలో ఆలస్యం, పనుల్లో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అందువల్లే పలు ప్రాంతాల్లో ఇప్పటికీ టెండర్లు దాఖలు కాలేదని సమాచారం. ఇప్పటికే టెండర్లన్నీ పూర్తయ్యాయని అర్ అండ్ బీ అధికారులు చెబుతున్నా 70 శాతం మేరకే టెండర్లు అయినట్టు తెలుస్తోంది. మరొకటి.. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు టెండర్లు వేసినా అంచనాలను పెంచేశారని.. ఆశించిన మేరకు టెండర్లు రాలేదనే రకరకాల కారణాలతో అధికారులు వాటిని ఆమోదించడం లేదని చెబుతున్నారు.
టెండర్ రూల్స్ మార్చండి సార్..
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరమ్మతులు చేయాల్సిన పనులకు రూ.1,867 కోట్లు కేటాయించినా ఆశించిన మేర టెండర్లు దాఖలు కావడం లేదు. దీంతో టెండర్ నిబంధనలు మార్చాలంటూ జిల్లాల ఎస్‌ఈలు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ పనుల కింద రెండుసార్లు టెండర్లను 498 ప్యాకేజీలకు ఆహ్వానించగా వీటిలో 207 ప్యాకేజీలకే టెండర్లు రాగా, మరో 291 ప్యాకేజీలకు రెండోసారి కూడా స్పందన రాలేదు. ఈ పనులను 2023 మే 31 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడాలంటే టెండర్ నిబంధనలను మార్చాలంటూ ఓ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నతాధికారికి లేఖ రాశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారి టెండర్ రూల్స్‌లో మార్పులు చేయడంతోపాటు ప్యాకేజీలవారీగా కాకుండా విడి విడిగా టెండర్లను ఆహ్వానించాలని జనవరి 30న విడుదల చేసిన ఉత్తర్వులో సూచించారు. అయినా ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడం గమనార్హం. అయితే టెండర్ రూల్స్ మార్చితే రహదారుల నాణ్యత దెబ్బతింటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఆర్‌అండ్‌బీ బిజీ.. కానీ
ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 9 సర్కిళ్లలో 4 వేల కి.మీ. మేర పాడైన రోడ్లకు మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ, ఇంతవరకూ రాష్ట్రంలో ఏ ఒక్కచోటా పనులు మొదలుకాలేదు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు నిత్యం బిజీగా ఉంటారు. కానీ.. ఒక్క పనీ ముందుకు సాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2023-02-06T02:42:15+05:30 IST