ఆ అర్హత రాహుల్‌కు కాక ఇంకెవరికుంది?
ABN, First Publish Date - 2023-07-04T03:38:03+05:30
‘‘రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారంటూ బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నరు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబానికి తెలంగాణలో పర్యటించే
తెలంగాణకు ఏ హోదాలో వచ్చారని ప్రశ్నిస్తారా?.. రాహుల్‌ను విమర్శిస్తున్న మీకున్న అర్హతేంటి?
● కేసీఆర్‌లా ఆయనది దోపిడీ కుటుంబం కాదు: రేవంత్
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘‘రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారంటూ బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నరు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదా? వారు అంటకాగుతున్న ప్రధాని మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా?’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిలదీశారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నా.. రాహుల్ ఏ పదవినీ తీసుకోలేదన్నారు. దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసింది గాంధీ కుటుంబమన్నారు. అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకొచ్చి మొరుగుతున్నాయని మండిపడ్డారు. ‘‘రాహుల్‌ది కేసీఆర్‌లా దోపిడీ కుటుంబం కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడు. దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు. ఆయనకు కాకుండా తెలంగాణలో పర్యటించే అర్హత ఇంకెవరికి ఉంది?’’ అని ప్రశ్నించారు. అసలు రాహుల్‌ను విమర్శిస్తున్న వారికి ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. అన్నం తినేవారు ఎవరూ ఆయన అర్హత గురించి ప్రశ్నించబోరన్నారు. తెలంగాణ వచ్చాక ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు అమాంతం పెరిగాయన్నారు. 2014 జూన్ 2న కేసీఆర్ కుటుంబం ఆస్తులు.. 2023 జూలై 2 నాటికి ఉన్న ఆస్తులపైన చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసిందని ఆరోపించారు. అన్ని కుట్రలను చేధించి ఖమ్మం సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
వనరులను మింగే తెల్ల ఏనుగు కాళేశ్వరం
కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ చెప్పారు. దీనిపై తమ పార్టీ తరపున ఇద్దరు ప్రతినిధులు వస్తారని, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాహుల్ వ్యాఖ్యలతో తమ అవినీతి బయటపడిందని కేటీఆర్, హరీశ్ పెడ బొబ్బలు పెడుతున్నారన్నారు. ‘‘కాళేశ్వరం అవినీతిపై రాహుల్ చేసిన ఆరోపణలు నిజం. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు మొదలుపెట్టింది. ప్రాజెక్టు పేరు, డిజైన్ మార్చిన కేసీఆర్ దాని బడ్జెట్‌ను రూ.1.49 లక్షల కోట్లకు పెంచారు. మూడో టీఎంసీ కోసం రూ. 25,831 కోట్ల బడ్జెట్ కేటాయించారు. హరీశ్, కేటీఆర్‌లను ప్రశ్నిస్తున్నా.. ఇప్పటివరకు రూ.85 వేల కోట్లు బిల్లులు చెల్లించింది నిజం కాదా? కాళేశ్వరం ద్వారా ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి రూ.45 వేలు ఖర్చవుతుంది. కాళేశ్వరం నిర్వహణకు ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి పరిస్థితి. తెలంగాణ వనరులను మింగే తెల్ల ఏనుగు కాళేశ్వరం. ఇవన్నీ కాగ్ చెప్పిందే’’ అని వ్యాఖ్యానించారు. ఖమ్మం సభ చూసైనా కేటీఆర్, హరీశ్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.
కేసీఆర్ అవినీతిని ఆపితే..
ఖమ్మం సభలో ప్రకటించిన రూ.4 వేల పెన్షన్ స్కీంకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. ‘‘కేసీఆర్ అవినీతిని ఆపితే రాష్ట్రంలోని మొత్తం 55 లక్షల మంది పెన్షన్‌దారులకు పెన్షన్ ఇవ్వచ్చు. మేం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకివ్వట్లేదని అడుగుతున్నారు. ఎక్కడైనా రాష్ట్ర ఆదాయం ఆధారంగానే ప్రాధాన్యతలు ఉంటాయి. తెలంగాణలో మా ప్రాధాన్యత రూ.4 వేలు పెన్షన్ ఇవ్వడమే’’ అని వివరించారు. ఎట్ హోం కంపెనీలో సంతోష్‌రావు, కల్వకుంట్ల కవిత, శైలిమ, తేలుకుంట్ల శ్రీధర్‌లు డైరెక్టర్లుగా ఉన్నారని, ఈ కంపెనీపై ఐటీ దాడుల నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఈడీ అన్నది అమిత్‌షా పరిధిలోకి వస్తుందని, ఐటీ తర్వాత ఈడీ వస్తుందన్న భయంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లారన్నారు.
Updated Date - 2023-07-04T03:38:03+05:30 IST