ఒకర్ని దించడమే లక్ష్యం కారాదు
ABN, First Publish Date - 2023-06-26T03:09:26+05:30
‘పోరాటం జరగాల్సింది దేశం ముందున్న ప్రధాన సమస్యలపైన. కానీ దురదృష్టవశాత్తూ మనం (విపక్షాలు) ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం....
విపక్షాల కూటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
మరొకర్ని అందలం ఎక్కించాలనుకుంటున్నారు
కానీ పోరాటం జరగాల్సింది దేశ సమస్యల పైన
దాన్ని విపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి
ఎవరో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఏకం కారాదు
పట్నాలో విపక్షాల సమావేశంపై మంత్రి కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ.. రెండూ దేశానికి ప్రమాదమే
వాటి మద్దతులో కట్టే కూటమి విఫలమవుతుంది
కేంద్రంపై పోరులో కేజ్రీ, మమతది ఒక దారి
మాది మరో మార్గం.. ఆ బాటలో వెళ్తాం
మేం జాతీయ స్థాయిలో ఎదగాలనుకుంటున్నాం
గుజరాత్ అభివృద్ధి నమూనా ముగిసిన కథ
తెలంగాణ అభివృద్ధి నమూనా సమగ్రం
సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్.. రాసి పెట్టుకోండి
షర్మిలతో కలిస్తే కాంగ్రెస్‌కు ఉన్న ఓట్లూ పోతయ్
పీటీఐ ఇంటర్వ్యూలో పలు అంశాలపై వ్యాఖ్యలు
నేడు, రేపు కేసీఆర్ మహా పర్యటన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టూర్
రోడ్డు మార్గంలో షోలాపూర్‌కు సీఎం
తెలంగాణ నేతన్నలను కలిసే అవకాశం
రేపు పండరీపూర్, తుల్జాపూర్ సందర్శన
న్యూఢిల్లీ, జూన్ 25: ‘‘పోరాటం జరగాల్సింది దేశం ముందున్న ప్రధాన సమస్యలపైన. కానీ దురదృష్టవశాత్తూ మనం (విపక్షాలు) ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. పరిస్థితి చూస్తుంటే ఎవరో ఒకరిని అధికారం నుంచి దించి.. మరొకరిని అందలం ఎక్కించడానికే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ, అది మన అజెండా కాకూడదు. దేశ మౌలిక ప్రాథమ్యాల సాధనే అజెండా కావాలి. మనం ఎవరో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఏకం కాకూడదు. ఒక లక్ష్యం కోసం ఏకం కావాలి. ఆ లక్ష్యం ఏంటన్నది ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. బీజేపీపై పోరాడటమే ఉమ్మడి ఎజెండాగా ప్రధాన ప్రతిపక్షాలు పట్నాలో నిర్వహించిన భేటీపై ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ముఖాముఖిలో ఆయ న పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశా రు. తెలంగాణ అభివృద్ధి నమూనా.. అందరినీ కలుపుకొని పోయే, సమగ్రమైన, ఏకీకృత, సంతులిత నమూనా అని.. అది తమకు మెరుగైన ఫలితాలనే అందిస్తుందన్న నమ్మకం, రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశారు. సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండింటినీ దేశానికి ప్రమాదంగా అభివర్ణించిన ఆయన.. ఈ రెండింటిలో ఏ పార్టీ మద్దతుతో ఏర్పడే కూటమి అయినా విఫలమవుతుంద ని పేర్కొన్నారు. ‘‘ఈరోజు దేశానికి కావాల్సిందేంటంటే.. ఉద్యోగ, ఉపాధి కల్పన, రైతులకు సంపద చేకూర్చడం, నీటిపారుదల, గ్రామీణ జీవనోపాధి. ఇవే ముఖ్యమైన అంశాలు తప్ప.. హిజాబ్, హలాల్ ఇలా మతం చుట్టూ తిరిగే పనికిమాలిన అంశాలు కావు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారతదేశ అభివృద్ధిని అడ్డుకున్న పార్టీలను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ‘‘రెండు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్.. వీటిలో కాంగ్రెస్ 50 ఏళ్లపాటు పాలించింది. బీజేపీ 15 ఏళ్లపాటు పాలించింది. ఆ రెండు పార్టీలూ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు. దేశం వెనకబాటుతనానికి.. 75 సంవత్సరాల్లో సాధించాల్సినంత అభివృద్ధి సాధించకపోవడానికి ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలి’’ అని బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. అదే సమయంలో.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ మాత్రం తమ హయాంలో అనతికాలంలోనే సంక్షేమ పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
ఆ ఇద్దరిపై..
కేంద్రంపై పోరులో భాగంగా బీఆర్‌ఎస్ ఇటీవలికాలంలో పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో.. విపక్షాల భేటీకి ఆ ఇద్దరూ హాజరవడాన్ని ఎలా చూస్తారని పీటీఐ వార్తా సంస్థ ప్రశ్నించగా.. ఎవరి అజెండాలు, ప్రాధాన్యాలు, లక్ష్యాలు వారికి ఉంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వారిద్దరూ ప్రతిపక్షాల భేటీకి వెళ్లడాన్ని తాను తప్పుపట్టనని పేర్కొన్నారు. ‘‘వారు దేశానికి మంచి చేయాలనుకున్నారు. అందుకు వారు ఒక మార్గాన్ని నమ్మారు. ఆ బాటలో వెళ్లేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మేం మరో మార్గాన్ని నమ్మాం. మేం మా సొంతదారిలో పురోగమించాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలన్న బీఆర్‌ఎస్ ప్రయత్నాలపై ప్రశ్నించగా.. తమకు అలాంటి ఆలోచన ఏమీ లేదని తేల్చిచెప్పారు. ‘‘మేం మా రెక్కలను విస్తరించాలనుకుంటు న్నాం. జాతీయస్థాయిలో ఎదగాలని భావిస్తున్నాం. కాబ ట్టి.. ఎవరికో వ్యతిరేకంగానో.. ఉమ్మడిగానో పోరాటం అనే ప్రశ్న ఎలా వస్తుంది?’’ అని వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల క్రితం బీఆర్‌ఎస్ తలపెట్టిన బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు ప్రయోగం ఎందుకు ఎలాంటి సత్ఫలితాలనూ ఇవ్వలేకపోయిందని ప్రశ్నించగా.. ‘‘రోమ్‌నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదు. ఇవాళ్టికి కూడా బీజేపీ ఒక పెద్ద శక్తి. ఆ విషయాన్ని ఎవరూ తిరస్కరించలేరు. వారికి 300కు పైగా లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అయితే.. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారి ప్రయాణం కూడా ఇద్దరు ఎంపీలతోనే మొదలైంది. కాబట్టి మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. వెయ్యిమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మేం 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. 2024 తర్వాతా చేయడానికి చాలా ఉంది. జీవితం 2024 ఎన్నికలతోనే మొదలై, దాంతోనే ముగిసిపోదు కదా’’ అని అన్నారు.
మాకే మద్దతు ఎందుకివ్వాలంటే..
టీఆర్‌ఎ్‌సలాంటి ఒక ప్రాంతీయ పార్టీకి ప్రజలు జాతీయస్థాయిలో ఎందుకు మద్దతివ్వాలి? అని అడగ్గా.. ‘‘తెలంగాణలో తొలి అడుగులు వేసి అక్కడ మేం చేయగలిగినంతా చేశాం. మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని విశ్వసిస్తున్నాం. అదే సమయంలో.. జాతీయస్థాయిలో ఎదగడానికి పార్టీకి మంచి అవకాశం ఉంది. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశమంతా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే.. ‘అధికార సాధనకు అవసరమైన 272 సీట్లు 2024 ఎన్నికల్లో మాకు (బీఆర్‌ఎస్‌కు) వస్తాయా?’ అని మీరు ప్రశ్నిస్తే.. దానికి నేను ‘రావు’ అని సమాధానం చెప్పొచ్చు. కానీ.. అలా చెప్పడం నాకిష్టం లేదు. మేం గణనీయమైన సంఖ్యలో పార్లమెంటు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ‘వస్తాయి’ అనే చెప్పాలనుకుంటాను’’ అని బదులిచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిసా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
మూడోసారీ మాదే గెలుపు..
తెలంగాణ విషయానికి వస్తే.. ఎవరు మెరుగైన పాల న అందించగలరో ప్రజలకు బాగా తెలుసని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సరితూగే వ్యక్తి ఎవరూ విపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో అధికారం సాధించాలనుకుంటే.. ఇతర రాష్ట్రాల్లో వారు సాధించిందేంటో చూపాలి. ఆ రెండు పార్టీలూ కలిసి 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. తెలంగాణకన్నా మెరుగైన అభివృద్ధి నమూనాను అవి ఎక్కడైనా అమలు చేసి ఉంటే చూపాలి’’ అని డిమాండ్ చేశారు. గుజరాత్ అభివృద్ధి నమూనాకన్నా తెలంగాణ నమూనా ఎలా వేరు? అని ప్రశ్నించ గా.. గుజరాత్ నమూనాపై తాను మాట్లాడనని, అయి నా అది ముగిసిపోయిన కథ అని.. ప్రజలకు వాస్తవాలేంటో తెలిసివచ్చాయని మోదీ పాలనపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అనుసరిస్తున్న సుపరిపాలన విధానం మెరుగైన ఫలితాలనే అందిస్తుందన్న నమ్మకం, కేసీఆర్ హ్యాట్రిక్ (వరుసగా మూడోసారి) సీఎం అవుతారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ‘‘దక్షిణాదిన ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రీ హ్యాట్రిక్ కొట్టలేదు. ఆ ఘనతను సాధించే తొలి సీఎం కేసీఆరే అవుతారు. రాసి పెట్టుకోండి’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 88 సీట్లు సాధించిందని.. వచ్చే ఎన్నికల్లో 90నుంచి 100 సీట్లు తమకు వస్తాయని జోస్యం చెప్పారు. తాము చేసిన మంచి పనులే తమ విజయానికి తారకమంత్రం అవుతాయన్నారు. ఐటీ రంగంలో ఉపాధికల్పనలో తెలంగాణ కర్ణాటకకన్నా చాలా ముందుందని.. గత రెండేళ్లలోనే హైదరాబాద్‌లో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తే, బెంగళూరులో ఆ సంఖ్య 1.46 లక్షల ఉద్యోగాలకే పరిమితమైందని పేర్కొన్నారు. 2014 నాటికి తెలంగాణ నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లుగా ఉండేదని.. ఇప్పు డా విలువ రూ.2.41 లక్షల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా నగరాలు, పట్టణాల అభివృద్ధిపై బీఆర్‌ఎస్ సర్కారు దృష్టి సారించలేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉన్న విషయాన్ని గుర్తుచేయగా.. అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. కేంద్రం నుంచి తెలంగాణ పలు రంగాల్లో 126 అవార్డులు గెలుచుకుందని తెలిపారు. ద్వితీయశ్రేణి నగరాలపైనే కాక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనా తాము దృష్టి కేంద్రీకరించామని.. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఐదు నగరాల్లో ఐటీ హబ్‌లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
‘బాబు’పై సమాధానం చెప్పను!
బీఆర్‌ఎస్ చెబుతున్న బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేరే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ‘నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పను’ అని కేటీఆర్ దాటవేశారు. అలాగే.. టీడీపీ చీఫ్ చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో మొదలైన అభివృద్ధి పనుల ఘనతను తీసుకోవడానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించగా.. ‘‘నాయుడు 2004లో ముఖ్యమంత్రి. ఆ తర్వాత 20 ఏళ్లు గడిచిపోయాయి. ఎవరైనా వచ్చి.. మేం 1950ల్లో మొక్క నాటాం. వాటి ఫలాలను చంద్రబాబు అనుభవిస్తున్నారంటే ఆయన ఒప్పుకొంటారా? అసలు విషయమేంటంటే.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వమూ ప్రగతిని వేగవంతం చేశాయి. గడిచిన తొమ్మిదేళ్లల్లో మేం అభివృద్ధి అనే యాక్సిలరేటర్ మీద నుంచి కాలు తీయలేదు’’ అని కేటీఆర్ బదులిచ్చారు.
బీజేపీపై మెతక వైఖరి ఎందుకు?
ఢిల్లీ మద్యం కుంభకోణం నేపథ్యంలో.. ఇటీవలికాలంలో కేంద్రమంత్రులతో భేటీల నేపథ్యంలో.. కొద్దిరోజులుగా బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ విషయంలో మెతగ్గా వ్యవహరిస్తోందన్న ఆరోపణల గురించి ప్రశ్నించగా.. తాను ఢిల్లీకి చాలాసార్లు వచ్చానని, ఇదే కేంద్రమంత్రులను పలుమార్లు గతంలోనూ కలిశానని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కేంద్రం ఏ కాస్త మేలు చేసినా తాము అందుకు కృతజ్ఞత తెలుపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
షర్మిలతో కలిస్తే కాంగ్రె్‌సకు ఉన్న ఓట్లూ పోతాయ్!
రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రె్‌సతో జట్టుకడితే దాని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? అని ప్రశ్నించగా.. కాంగ్రెస్‌కు ఉన్న కాస్త ఓటు బ్యాంకునూ పోగొట్టుకోవడం తథ్యమని కేటీఆర్ బదులిచ్చారు. షర్మిల, ఆమె తండ్రి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘షర్మిలకు లవలేశమైనా ఆత్మగౌరవం అంటూ ఉంటే.. ఆమె అసలు తెలంగాణకే రాకూడదు. ఎందుకంటే ఆమె, ఆమె కుటుంబంతా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. వాళ్లసలు తెలంగాణలో ఓట్లు అడగడమే పెద్ద జోక్. దాన్ని కాంగ్రెస్ ఆమోదించడం ఇంకా పెద్ద జోక్’’ అని ఎద్దేవా చేశారు.
అమిత్ షాను కలవకుండానే..
హైదరాబాద్‌కు చేరుకున్న కేటీఆర్
న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ కాకుండానే ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. షా అపాయింట్‌మెంట్ కోసం రెండు రోజులపాటు వేచి చూసి చివరకు ఆయనను కలవకుండానే తిరుగుప్రయాణమయ్యారు. శనివారం రాత్రి 10.15 గంటలకు షా అపాయింట్‌మెంట్ ఉందని స్వయంగా కేటీఆర్ విలేకరులకు చెప్పారు. కానీ.. చివరి నిమిషంలో భేటీ రద్దయిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రెండు రోజుల్లో ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.
Updated Date - 2023-06-26T03:09:26+05:30 IST