Medigadda bridge : మేడిగడ్డలో 20వ పిల్లర్ కుంగింది
ABN, First Publish Date - 2023-10-23T03:13:20+05:30
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 20వ నంబర్ పిల్లర్ అడుగు మేర కుంగిపోయిందని ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు.
అడుగు మేర కుంగినట్లు అంచనా వేస్తున్నాం..
ఇలా ఎందుకు జరిగిందన్నది ఇప్పుడే చెప్పలేం
విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తాం
పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి పూర్వస్థితికి తీసుకొస్తాం: ఈఎన్‌సీ
సాంకేతిక కారణాలు అన్వేషిస్తున్నాం
నష్ట నివారణకు చర్యలు: ఎల్‌అండ్‌టీ
ప్రాజెక్టు వద్దకు ఎస్‌డీపీవో అధికారులు
నేడు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారుల రాక
మహదేవపూర్ రూరల్/హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 20వ నంబర్ పిల్లర్ అడుగు మేర కుంగిపోయిందని ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. దాని ప్రభావంతో 20 నంబరు పిల్లరుకు ఇరువైపులా బ్యారేజీ వంతెన కుంగిందని పేర్కొన్నారు. పిల్లరు కుంగడానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణ చేపట్టి.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బ్యారేజీ వంతెన కుంగిన విషయం తెలుసుకున్న తాను అర్ధరాత్రే ఇక్కడకు వచ్చి పరిశీలించినట్లు పేర్కొన్నారు. తమ ఇంజనీరింగ్ నిపుణుల బృందంతోపాటు కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ నిపుణుల బృందం వచ్చిందని, నీటి నిల్వ తగ్గగానే ప్రమాదంపై విచారణ చేపడతామన్నారు. సాంకేతిక పరీక్షల తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టి, ప్రాజెక్టును పూర్వ స్థితికి తీసుకొస్తామని చెప్పారు.
బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదం జరిగిందా..? అన్న విలేకరుల ప్రశ్నకు ఈఎన్‌సీ సమాధానం దాటవేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ వెళ్లిపోయారు. కాగా, ఈ అంశంపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సైతం స్పందించింది. బ్యారేజీ వంతెన కుంగిపోవడానికి గల సాంకేతిక కారణాలను అన్వేషిస్తున్నామని, రాష్ట్ర అధికారులతో కలిసి తమ సాంకేతిక నిపుణుల బృందం జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోందని వెల్లడించింది. ఈ నష్టాన్ని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్యకు తగిన పరిష్కారం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ బ్యారేజీని 28.25 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జికి అనుగుణంగా డిజైన్ చేయగా, గత ఏడాది జూలైలో దీని సామర్థ్యానికి మించి 28.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఇక్కడ నమోదైందని పేర్కొంది. అంత వరదను కూడా ఈ బ్యారేజీ తట్టుకుందని గుర్తు చేసింది. 2019లో ఈ బ్యారేజీ అందుబాటులోకి రాగా, ఉద్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో నెరవేర్చిందని పేర్కొంది. కాగా, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీపీవో) అధికారులు ఆదివారమే మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుని పరిశీలించారు. సోమవారం కేంద్ర జల వనరుల సంఘానికి చెందిన కేంద్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(సీడీపీవో) అధికారులు మేడిగడ్డను సందర్శించనున్నారు. స్టేట్ డ్యామ్ రివ్యూ ప్యానల్ సందర్శన అనంతరం మరమ్మతులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Updated Date - 2023-10-23T03:13:20+05:30 IST