Chidambaram : బీఆర్‌ఎస్ వల్లే తెలంగాణ అంటే నవ్వొస్తోంది!
ABN, First Publish Date - 2023-10-08T04:00:06+05:30
‘ప్రజలందరి ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార ఫలాలు ప్రజలందరికీ అందుతాయని భావించాం.
నాడు కేసీఆర్ రాజకీయంగా బలహీనపడ్డారు
కావాలనుకుంటే ఆయనను పక్కనపెట్టేవాళ్లం
ప్రజల కాంక్ష మేరకే తెలంగాణ
కానీ ఆశయాలు నెరవేరలేదు
రాష్ట్రంలో బీజేపీ పనైపోయింది
మాదే గెలుపు.. బీఆర్‌ఎస్సే పోటీ
‘ఆంధ్రజ్యోతి’తో చిదంబరం
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజలందరి ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార ఫలాలు ప్రజలందరికీ అందుతాయని భావించాం. కానీ, అధికారం ప్రజలకు దక్కలేదు. కొందరి వద్దే కేంద్రీకృతమైంది. ఇది బాధాకరం’ అని కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం విచారం వ్యక్తం చేశారు. తమ వల్లే తెలంగాణ సాధ్యమైందని కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. అప్పట్లో కేసీఆర్ రాజకీయంగా బలహీనమైన దశకు చేరుకున్నారని, ఆయనను కావాలంటే పక్కన పెట్టగలిగే వాళ్లమని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని తెలిపారు. 2009 డిసెంబరు 9న ‘రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అనే ప్రకటన చేయడమే కాకుండా, బిల్లు తయారీలో కీలకంగా వ్యవహరించిన చిదంబరం శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈసందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది.
వివరాలు ఆయన మాటల్లోనే...
ఆంధ్రజ్యోతి: కేంద్ర హోంశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర అత్యంత కీలకమైనది. ఆకాంక్షలు సాకారమయ్యాయని భావిస్తున్నారా?
చిదంబరం: తెలంగాణ రాష్ట్రం కావాలనేది ప్రజలందరి ఆకాంక్ష. కేసీఆర్ కూడా డిమాండ్‌ను అందుకున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజీ మార్గాలున్నా ఆ దారిలో కాంగ్రెస్ నడువలేదు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశాం. తెలంగాణ ఇవ్వాలనే సిఫారసుతోపాటు ఆ కమిటీ ఆరు సిఫారసులు చేసింది. ప్రజలందరి ఆకాంక్షలతో రాష్ట్రం ఇచ్చాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆధునిక రాష్ట్రంగా మారుతుందనుకున్నాం. పాలనలో ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందని ఆకాంక్షించాం. కానీ విచారకరం ఏమిటంటే.. అలా జరుగలేదు. కేసీఆర్ పాలనలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా పోయింది.
కొందరి చేతుల్లో అధికారం కేంద్రీకృతమైంది. ఇది నన్ను బాధపెట్టింది.
తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు. మేం పోరాడి తెచ్చుకున్నాం అని బీఆర్‌ఎస్ అంటోంది.. మీరేమంటారు?
చిదంబరం: బీఆర్‌ఎస్ అలా చెప్పడం నాకు నవ్వు తెప్పిస్తోంది. ఎందుకంటే, నాడు కేసీఆర్‌ను మేం విస్మరించగలిగే పరిస్థితిలో ఉన్నాం. అలా విస్మరించినా ఏమీ జరిగి ఉండేది కాదు. నాటి ఉమ్మడి ఏపీ సీఎం చాలా శక్తిమంతుడు. ఆయన అనుకుంటే పరిస్థితిని చక్కబెట్టేసేవాడు. కేసీఆర్ ఒత్తిడి వల్లే తెలంగాణ ఇచ్చామన్నది తప్పు. అంతేకాదు... ఒక దశలో కేసీఆర్ రాజకీయంగా చాలా బలహీనమై పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై కమిటీ వేసి విస్తృత ప్రజాభిప్రాయం తీసుకోవడం మొదలుపెట్టాక, మేం ప్రజల నుంచి తెలంగాణ పట్ల ఏకగ్రీవ డిమాండ్ విన్నాకే కేసీఆర్‌కు రాజకీయంగా పునర్జన్మ లభించింది.
తెలంగాణలో రెండుసార్లు ఓటమి పాలైన కాంగ్రెస్ ఈసారి విజయం సాధించే అవకాశాలున్నాయా?
చిదంబరం: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రజాదరణ ఉంది. పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా బహిరంగసభకు వచ్చిన ప్రజానీకమే దీనికి నిదర్శనం. గడిచిన 50 ఏళ్లలో ఇంతపెద్ద స్థాయిలో ప్రజలు బహిరంగసభలకు తరలిరావ డం అరుదుగా చూశాను. 1976 ఫిబ్రవరి 15న తమిళనాడు లో కాంగ్రె్‌స-ఓ, కాంగ్రె్‌స-ఐ విలీనం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జనం భారీసంఖ్యలో హాజరయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హైదరాబాద్‌లో సభలోనే అంత మందిని చూశా. ఈ సభకు వచ్చిన వారిలో నా అంచనాల ప్రకారం 40 శాతం మంది 25-27 ఏళ్లలోపు యువతే. ఈ జనాదరణతోనే తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం.
రానున్న ఎన్నికల్లో మీ ప్రధాన నినాదం ఏమిటి?
చిదంబరం: మా పార్టీ ప్రకటించిన 6 హామీలే మా ప్రధాన నినాదంగా ఉంటాయి. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రకటించిన ఈ హామీలతోనే ఎన్నికల్లోకి వెళుతున్నాం. ఇవే కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా హామీలిచ్చింది. తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఆర్థిక నిపుణుడిగా ఈ హామీల అమలు సాధ్యమేనంటారా?
చిదంబరం: కర్ణాటకలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తున్నాం. ఐదేళ్లలో హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తాం. తెలంగాణ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకున్నాకే పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది.
కులగణన సమాజంలో చీలిక తెస్తుందన్న వాదనలూ ఉన్నాయి. దీనిపై మీరేమంటారు?
చిదంబరం: భారతీయ సమాజంలో కులం అనేది వాస్త వం. దాన్ని విస్మరించలేం. ఓబీసీలకు రాజ్యాధికారంలో తగిన వాటా దక్కాలి. వెనుకబడినవారితోపాటు అత్యంత వెనుకబడిన కులాలూ ఉన్నాయి. అందరికీ పాలనలో భాగస్వామ్యం లభించాలి. సామాజిక ఆర్థిక న్యాయం అందాలి. మన్మోహన్‌సింగ్ అధికారంలో ఉన్నప్పుడే సామాజిక, ఆర్థిక లెక్కలు తీశాం. మోదీప్రభుత్వం ఆ సర్వే వివరాల్ని ప్రచురించలేదు.
కేంద్రంలో అధికారంలోకొచ్చేందుకు మీ వ్యూహాలేంటి?
చిదంబరం: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఇండియా కూటమి తగిన గుణపాఠం చెప్పనుంది. బలమైన పార్టీలతో ఈ కూటమిని ఏర్పాటు చేశాం. ఇంకోవైపు ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలన్నీ ఆ కూటమిని, బీజేపీని వదిలివెళ్లాయి. శివసేన, శిరోమణి ఆకాలీదళ్, అన్నాడీఎంకే వంటి కీలకపార్టీలన్నీ బయటకు వచ్చేశాయి. బీజేపీ ఏకాకిగా మారింది. ఆ పార్టీ వెంట కొన్ని చిన్నపార్టీలే ఉన్నాయి. దేశంలోని విస్తారమైన, బలమైన పక్షాలతో ఇండియా కూటమి ఉంది. బీజేపీకి ఈ కూటమి గట్టి సవాలు విసురుతోంది.
ఢిల్లీ పార్టీ, సీల్డ్‌కవర్ పార్టీ అని కాంగ్రె్‌సపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు?
చిదంబరం: బీఆర్‌ఎస్ ప్రధానలక్ష్యం కాంగ్రెస్సే. కాంగ్రెస్ ను విమర్శించినంతగా బీజేపీని బీఆర్‌ఎస్ విమర్శించదు. బీఆర్‌ఎ్‌సకు ప్రధాన పోటీ కాంగ్రె్‌సతోనే ఉన్న విషయం తెలుసు. రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా కనుమరుగైంది. కాంగ్రెస్ బలంగా ఉండటంతోనే బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలేంటి?
చిదంబరం: దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీపై విజయం సాధించనున్నాం. ఛత్తీ్‌సగఢ్, రాజస్థాన్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంటాం. మధ్యప్రదేశ్‌లో అత్యధిక స్థానాలతో గెలుస్తాం. రాజస్థాన్‌లో బీజేపీలో అంతర్గత కలహాలున్నాయి. అక్కడ కాంగ్రెస్సే విజయం సాధిస్తుంది. తెలంగాణ లోనూ కాంగ్రె్‌సదే అధికారం.
Updated Date - 2023-10-08T04:10:26+05:30 IST