మమ్మల్ని పట్టించుకోండి సారూ..!
ABN, First Publish Date - 2023-08-22T04:40:13+05:30
సర్కారు స్థలాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న పేదలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించేసరికి పేదలందరూ తాము సొంత ఇంటికి యజమానులవుతామని హర్షం వ్యక్తం చేశారు.
59 జీఓ దరఖాస్తుదారుల ఆవేదన
లక్షలు ఎలా చెల్లించాలని లబోదిబో
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): సర్కారు స్థలాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న పేదలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించేసరికి పేదలందరూ తాము సొంత ఇంటికి యజమానులవుతామని హర్షం వ్యక్తం చేశారు. అయితే.. హక్కుపత్రాలు పొందేందుకు స్థానికంగా ఉన్న ధరలో 25శాతాన్ని చెల్లించాలంటూ ఇప్పుడు నోటీసులు జారీ చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. మమ్మల్లి పట్టించుకోండి సారూ అంటూ కలెక్టర్ వద్దకు పరుగులు తీశారు. అధికారులు చెప్పే లెక్కన చూస్తే కొంతమంది రూ. 10 లక్షలకు మించి చెల్లించాల్సిన పరిస్థితి ఉండటం గమనార్హం. 2014లో బీఆర్‌ఎ్‌స(అప్పుడు టీఆర్‌ఎస్) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 58, 59 జీఓలను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రివర్గ భేటీలో 2020, జూన్ 2 వరకు ఉన్న ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఆమేరకు ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు గడువు ఇవ్వడంతో చాలామంది పేదలు ఆసక్తి చూపించారు. జీఓ 58 కింద 8425మంది, జీఓ 59 కింద 2897మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుల్లో ఇప్పటివరకూ 16,036 పెండింగ్‌లో ఉన్నాయి. 125 గజాలలోపు స్థలాలకు 58 జీఓ కింద ఉచితంగా పట్టాలను ఇస్తుండగా, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాలను 59 జీఓ కింద క్రమబద్ధీకరిస్తున్నారు. 59జీఓ కిందకు వచ్చే భూములకు స్థానిక రేటులో 25 శాతం చెల్లించి హక్కుపత్రాలను పొందాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న పేదలకు రెవెన్యూ అధికారులు 59 జీఓ కింద పొంతన లేని ధరల్ని విధించి డిమాండ్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు షేక్‌పేట్ మండలంలోని ఎన్‌బీటీ నగర్‌లో మరో మహిళకు చెందిన 67 గజాలకు ఏకంగా రూ.34,12,000 కట్టాలంటూ నోటీసును పంపించారు. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ హయత్‌నగర్ గ్రామంలోని మరో మహిళకు చెందిన 204 గజాలకు రూ.35,19,000 కట్టాలంటూ నోటీసు వచ్చింది.
కలెక్టరేట్‌కు బాధితులు
సోమవారం షేక్‌పేట మండలంలోని ఎన్‌బీటీనగర్, గాయత్రినగర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్-12కు చెందిన పలువురు పేదలు హైదరాబాద్ కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి తమ ఆవేదన మొరపెట్టుకున్నారు. ఎన్‌బీటీ నగర్‌లో నేతలకు చెందిన 400 పైగా గజాల భూములకు కేవలం రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షలలోపు మాత్రమే ఫీజు తీసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం గమనార్హం.
Updated Date - 2023-08-22T04:40:13+05:30 IST