‘ఆత్మీయత’కు కలిసిరాని సీనియర్లు
ABN, First Publish Date - 2023-04-03T00:30:03+05:30
ఆత్మీయ సమ్మేళనాల కారణంగా అధికార పార్టీ బీఆర్‌ఎ్‌స లో నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. కొంతమంది సీనియర్ నాయకులు ఈ సమ్మేళనాలకు దూరంగా ఉంటూ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినా ఎక్కడా అమలు కావడంలేదు.
పలుచోట్ల బయటపడుతున్న విభేదాలు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): ఆత్మీయ సమ్మేళనాల కారణంగా అధికార పార్టీ బీఆర్‌ఎ్‌స లో నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. కొంతమంది సీనియర్ నాయకులు ఈ సమ్మేళనాలకు దూరంగా ఉంటూ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినా ఎక్కడా అమలు కావడంలేదు. సమ్మేళనాల్లో మండల స్థాయి నాయకులే పాల్గొంటున్నారు తప్ప కుటుంబసభ్యులు ఎక్కడా కన్పించడం లేదు.
సూర్యాపేట నియోజకవరగంలో గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. 48వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్తకర్తలను సమ్మేళనానికి పిలిచి వారి సాదకబాధలు సానుకూలంగా విన్నారు. కొన్ని వార్డుల్లో వార్డు కమిటీ, పార్టీ చైర్మన్‌లు సమావేశాలకు రావొద్దని స్థానిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా స్థాయి నాయకులను ఆ వార్డులకు పంపి సమావేశాలు నిర్వహించారు. స్థానిక నాయకులపై వ్యతిరేకత ఈ సందర్భంగా కనిపించింది. మండలాల్లో మండల స్థాయి నాయకులు సమావేశాలు నిర్వహించినా స్థానిక ప్రజలు ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమవడం కావడంతో హాజరు అంతంత మాత్రంగానే ఉంది. మండల స్థాయిలో సమావేశాలు పూర్తికావడంతో త్వరలో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాన్ని భారీగా నిర్వహించేందుకు మంత్రి జగదీ్‌షరెడ్డి యోచిస్తున్నారు.
తుంగతుర్తిలో..
తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా కొనసాగుతున్నాయి. మండల స్థాయిలో జరిగే సమ్మేళనాలకు పార్టీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ హాజరవుతుండగా, గ్రామస్థాయిలో జరిగే సమ్మేళనాలకు పార్టీ మండల స్థాయి నాయకులు హాజరవుతున్నారు. గ్రామాల్లో ఉండే నాయకులు స్థానిక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువస్తున్నారు. వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు హామీ ఇస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అసంతృప్తులు ఉన్నా బయటపడడంలేదు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని కార్యకర్తలకు అండగా నిలుస్తున్న నాయకుడు కరువయ్యాడు. బహునాయకత్వంతో ఆ పార్టీ శ్రేణులు ఎవరివైపు తిరగాలో అర్థం కావడంలేదు. దీంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే నాయకత్వంలో ఏకతాటిపై ఉన్నారు. అక్కడక్కడ అసంతృప్తి ఉన్నా అది బయటపడటం లేదు.
కోదాడలో సీనియర్ నేతల డుమ్మా
కోదాడ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు సీనియర్ నేతలు హాజరుకావడంలేదు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ గెలిచాక అంతా కలసికట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, ఏర్నెని వెంకటరత్నం, మహబూబ్‌జానీ, ప్రస్తుత మునిసిపల్ చైర్‌పర్సన్ శిరీష బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అన్నీ తానై వ్యవహరించి మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన పార్టీ సభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తనకే టికెట్ దక్కుతుందని ఆయన ప్రకటించారు. ఇక్కడి ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ హాజరుకాలేదు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సైతం కొన్ని చోట్ల సీనియర్లు హాజరు కావడం లేదు. వేపలసింగారం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డికి, ఎంపీపీ గూడెపు శ్రీనుకు పొసగడంలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గూడెపు శ్రీను ఆ తరువాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఆయన పార్టీలోని రాష్ట్ర నాయకులతో సన్నిహితంగా ఉండడంతో ఎమ్మెల్యేతో విభేదా లు ఏర్పడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హుజూర్‌నగర్ మిన హా నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు, మేళ్లచెర్వు, మఠంపల్లి మండలా ల్లో ఆత్మీయ సమ్మేళనాలు సజావుగానే సాగాయి. అయితే గ్రామ, మం డల స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. ఇప్పటికే కొ న్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎ్‌సతో నువ్వానేనా అనే స్థితిలో ఉంది. ఎన్నికల సంవత్సరం అయినందున అబివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
Updated Date - 2023-04-03T00:30:03+05:30 IST