School upgradation : స్కూల్ అప్‌గ్రెడేషన్..ఎన్వోసీ జారీకి 80 వేల లంచం
ABN, First Publish Date - 2023-09-22T03:47:36+05:30
ఓ పాఠశాల స్థాయిని సీబీఎ్‌సఈకి అప్‌గ్రేడ్ చేసేందుకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.80 వేల లంచం తీసుకున్న పాఠశాల విద్యాశాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అరెస్టు చేసింది.
పాఠశాల విద్యాశాఖలో ఏసీబీ సోదాలు
ఏడీ, సూపరింటెండెంట్, పీఏ అరెస్టు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓ పాఠశాల స్థాయిని సీబీఎ్‌సఈకి అప్‌గ్రేడ్ చేసేందుకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.80 వేల లంచం తీసుకున్న పాఠశాల విద్యాశాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అరెస్టు చేసింది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫారుక్‌నగర్‌లోని ఓ పాఠశాలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సీబీఎ్‌సఈకి అప్‌గ్రేడ్ చేసేందుకు ఆ స్కూలు యాజమాన్యం గత నెల బషీర్‌బాగ్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో.. రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. అందుకోసం ఆర్జేడీ కార్యాలయం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ముందుకు కదలాలంటే.. రూ.80 వేల లంచం ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ డైరెక్టర్ సాయి పూర్ణచందర్‌రావు, సూపరింటెండెంట్ జగ్జీవన్ డిమాండ్ చేశారు. ఆర్జేడీ పీఏ(జూనియర్ అసిస్టెంట్) సతీశ్ కూడా.. ఫైలు పని పూర్తయ్యాక తన చేతులు కూడా తడపాల్సిందేనని తెగేసి చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో.. అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చందర్‌రావుకు బాధితుడు రూ.80 వేలు ఇస్తుండగా.. అరెస్టు చేశారు. ఈ కేసుతో ప్రమేయమున్న జగ్జీవన్, సతీశ్‌లపైనా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గురువారం రాత్రి కూడా సోదాలు కొనసాగాయి. అయితే.. రూ.80 వేల లంచం తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్.. వెంటనే దాన్ని రెండుగా విభజించి, రూ.40 వేలను వేరుగా పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ డబ్బు ఎవరికోసం? ఎందుకు రెండుగా విభజించారు? అంటూ పూర్ణ చందర్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. అన్నింటికీ అతని నుంచి మౌనమే సమాధానంగా వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో అజ్ఞాత వ్యక్తి/వ్యక్తుల భాగస్వామ్యం కూడా ఉందని, రూ.40 వేలు వారి కోసం తీసిపెట్టారని అనుమానిస్తున్నారు. కాగా.. అరెస్టయిన ముగ్గురి ఇళ్లలో పలు కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాలను ఏసీబీ అదికారులు స్వాధీనం చేసుకున్నారు.
మెదక్‌లో సీహెచ్‌వో పట్టివేత
మెదక్ : ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటుకు అనుమతినిచ్చేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ.. మెదక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో) ఫహీంపాషా ఏసీబీ అధికారులకు చిక్కాడు. సతీశ్ అనే వ్యక్తి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా.. రూ.15 వేలు ఇస్తేనే అనుమతి లభిస్తుందంటూ ఫహీంపాషా తేల్చిచెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం సతీశ్ నుంచి ఫహీం రూ.15 వేలు తీసుకోగా.. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఫహీం ఇంట్లో సోదాలు జరిపామని ఆనంద్‌కుమార్ వివరించారు.
Updated Date - 2023-09-22T03:47:36+05:30 IST