పట్టణాభివృద్ధి పనులకు మోక్షం
ABN, First Publish Date - 2023-06-26T01:02:16+05:30
భువనగిరి పట్టణాభివృద్ధి పనులు ఇక చకచకా కొనసాగనున్నాయి. కొన్నినెలలుగా వాయిదాపడుతూ వస్తున్న టీయూఎ్‌ఫఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) రెండో దశ పనుల టెండర్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
టెండరు దశ దాటిన టీయూఎ్‌ఫఐడీసీ పనులు
ఐదు ప్యాకేజీలు.. రూ.5.55 కోట్లు
భువనగిరి టౌన్, జూన్ 25: భువనగిరి పట్టణాభివృద్ధి పనులు ఇక చకచకా కొనసాగనున్నాయి. కొన్నినెలలుగా వాయిదాపడుతూ వస్తున్న టీయూఎ్‌ఫఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) రెండో దశ పనుల టెండర్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పట్టణాభివృద్ధికోసం టీయూఎ్‌ఫఐడీసీ రెండో దశలో మంజూరు చేసిన రూ.17కోట్లతో 11 ప్యాకేజీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలని మునిసిపల్ అధికారులు ప్రతిపాదించారు. ఈమేరకు గతంలో నాలుగుసార్లు టెండర్లు పిలువగా రెండు పర్యాయాల్లో కేవలం ఐదు ప్యాకేజీలు టెండర్ల ప్రక్రియ పూర్తయి క్షేత్రస్థాయిలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. మిగతా ఆరు ప్యాకేజీలపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో నిధుల సౌలభ్యం ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. ఈ నేపఽథ్యంలో ఇటీవల ఐదో పర్యాయం పిలిచిన టెండర్లలో రూ.5.55కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు దాఖలు కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో ప్యాకేజీ కాంట్రాక్టర్ల అనాసక్తితో నేటికీ టెండర్ల దశను దాటలేదు. ఐదు ప్యాకేజీల టెండర్లు పనులు వారం పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న పనులు
టీయూఎ్‌ఫఐడీసీ నిధులతో పట్టణంలోని పలు వార్డుల్లో ప్రతిపాదించిన రూ.5.55కోట్ల విలువైన ఐదు ప్యాకేజీల పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ప్రతిపాదిత పనులు పూర్తయితే పట్టణంలోని పలు వార్డుల్లో వరద, మురుగు నీటిసమస్య, రహదారుల ఇక్కట్లు తీరనున్నాయి. ముఖ్యంగా గాంధీనగర్ నుంచి జంఖాన్‌గూడ చౌరస్తా వరకు ప్రధాన మురుగుకాల్వ సమస్య పరిష్కారం కానుంది. 20, 28, 29 వారుల్లో రూ.1,11,41,483 విలువైన పనులను 5.40శాతం లెస్‌తో, 21, 22, 23 వార్డుల్లో రూ.1,47,59,435 విలువైన పనులను 4.50 శాతం లెస్‌తో, 8, 9, 10 వార్డుల్లో రూ.74,15,595 విలువైన పనులను 6.55 శాతం లెస్‌తో 12, 13, 27 వార్డుల రూ.81,58,706 విలువైన పనులను 16.88 శాతం లెస్‌తో, 2, 3, 4, 5, 6, 7, 18, 19 వార్డుల రూ.1,40,53,426 విలువైన పనులను 18.68 శాతం లెస్‌తో కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నారు. అయితే లెస్‌తో కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నప్పటికీ పనుల నాణ్యతా ప్రమాణాలకు ఆటంకం ఉండదని, పైగా రూ.57.53లక్షల మిగులు నిధులతో ఇతర అభివృద్ధి పనులను చేపట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిపాదిత పనులన్నీ ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ గడువుకు ముందే పనులు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Updated Date - 2023-06-26T01:02:16+05:30 IST