RSS : భైంసాలో ఆర్‌ఎస్‌ఎస్ కవాతు
ABN, First Publish Date - 2023-03-06T03:54:31+05:30
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం కాషాయమయమైంది.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మహిషానగర శాఖ తలపెట్టిన కవాతు భారీ బందోబస్తు మధ్య సాగింది. ఆదివారం ఆర్‌ఎ్‌సఎస్ చేపట్టిన పథ
భారీ బందోబస్తు మధ్య నిర్వహణ
హిందువులంతా ఏకమై ముందుకు సాగాలి: ఇందు శేఖర్
భైంసా, మార్చి 5: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం కాషాయమయమైంది.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మహిషానగర శాఖ తలపెట్టిన కవాతు భారీ బందోబస్తు మధ్య సాగింది. ఆదివారం ఆర్‌ఎ్‌సఎస్ చేపట్టిన పథ సంచాలన్, శారీరక్ ప్రధానోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని హిందూ సంఘాలు భారీగా కాషాయ జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా భైంసా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆర్‌ఎ్‌సఎస్ పథ సంచాలన్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫూలేనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ నుంచి ప్రారంభమైన పథ సంచాలన్ పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ వారిపై పూల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఇతిహాస సంకలన సమితి భాగ్యనగర్ ప్రధాన కార్యదర్శి ఇందు శేఖర్ మాట్లాడుతూ.. కులం, ప్రాంతం, భాష తదితర విభేదాలన్నీ విడిచి సంఘటితమైతేనే హిందూ సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు. హిందువులంతా ఏకమై ముందుకు సాగితేనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. సంఘ్ కార్యకర్తలు పర్యావరణ పరిరక్షణ, గోరక్షణ, దేవాలయాల రక్షణ, సనాతనమైన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తున్నారన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ కవాతు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఎస్పీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. బందోబస్తు విధుల్లో ఒక ఏఏస్పీ, ఆరుగురు సీఐలు, 17 మంది ఎస్సైలు, 21 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 200 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు, 60 మందికిపైగా హోంగార్డులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-06T03:54:43+05:30 IST