మట్టి పాత్రలకు యమ క్రేజ్
ABN, First Publish Date - 2023-03-05T23:53:11+05:30
ఒకప్పుడు ఇంట్లో చేసే వంటలకు మట్టి పాత్రలనే ఉపయోగించే వారు. దీంతో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
వేసవి దృష్ఠ్యా కొనేందుకు మొగ్గుచూపుతున్న ప్రజలు
ఆరోగ్యంపై దృష్టి, జోరుగా అమ్మకాలు
మొయినాబాద్ రూరల్, మార్చి 5 : ఒకప్పుడు ఇంట్లో చేసే వంటలకు మట్టి పాత్రలనే ఉపయోగించే వారు. దీంతో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అదేవిధంగా మట్టి కుండలను కేవలం వేసవికాలంలో మంచినీరు తాగేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో మట్టిపాత్రల వినియోగం కొద్దికొద్దిగా కనుమరుగవుతోంది. ఈక్రమంలో గ్రామాల్లో కుమ్మరి కులస్తులకు చేతినిండా పని లేకుండా పోయింది. నేటి ఆధునిక కాలంలో స్టీల్ పాత్రలు, రైస్ కుక్కర్లు, తదితర పాత్రల్లో మాత్రమే ప్రజలు వంట చేసుకుంటున్నారు. దీంతో అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. అయితే, మళ్లీ నాటి మట్టి పాత్రలపై వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడిప్పుడే నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాల కూడళ్లలో, పలు గ్రామాల్లో నిర్వాహకులు మట్టిపాత్రలను అమ్మకాలకు ఉంచడమే కాకుండా వీటి కోసం ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మట్టి పాత్రలకు క్రేజ్ పెరిగింది. మట్టి వంట పాత్రలు కనిపిస్తే చాలు.. జనం వాటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. నేటి యాంత్రిక జీవనంలో ప్రతీ మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో మట్టి వంట పాత్రల్లో వండుకొని తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతారని పలువురు నిపుణులు తెలుపుతుండటంతో ప్రజలు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
వేసవిలో కుండ నీటికే మొగ్గు
పేదోడి ఫ్రిజ్‌గా పిలవబడే మట్టికుండలో నీటిని తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ఫ్రిజ్ నీళ్లకే అలవాటు పడినప్పటికీ.. వేసవిలో మాత్రం కుండనీటికి మొగ్గు చూపుతున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లి ఇంటికి చేరిన ప్రజలు దాహం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి కుండలో నీటినే తాగుతున్నారు. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నప్పటికీ కుండలను కొనుగోలు చేస్తున్నారు. కాగా, చిన్న కుండలకు రూ.90 ఉండగా.. పెద్దవాటికి రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. వేసవిలో వీటికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్లో మట్టి వంట పాత్రలు
గతంలో కేవలం తాగు నీటికోసమే మట్టి కుండలను వాడేవారు. నేడు పలు రకాల కూరలు వండేందుకు మట్టి పాత్రలను కొనుగోలు చేస్తున్నారు. మట్టి పాత్రల్లో కూరలు వండితే బాగా రుచిగా ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. పెరుగు తోడు వేయలన్నా మట్టి పాత్రలవైపే మొగ్గుచూపుతున్నారు. నగర శివారులోని మొయినాబాద్ మండల పరిధిలోని గల హిమాయత్‌నగర్, చిలుకూరు, అజీజ్‌నగర్, ఎన్కేపల్లి తదితర గ్రామాలతో పాటు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మట్టిపాత్రల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, వీటిని విక్రయిస్తున్నది మాత్రం హిమాయత్‌నగర్ గ్రామానికి చెందిన కుమ్మరి కులస్థులే. గ్రామంలో తయారు చేసిన నీటి కుండలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టి పాత్రలతో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. వీటికి తోడు కూజాలు, వాటర్ బాటిల్ ఆకారంలో ఉండే జగ్గులు, తదితర మట్టి పాత్రల పట్ల ప్రజల ఆదరణ చూపుతున్నారు.
మట్టి పాత్రలకు పెరిగిన గిరాకీ
సాధారణంగా వేసవి రాగానే చల్లటినీటి కోసం చాలా మంది ఫ్రిజ్‌లకు బదులు మట్టికుండలను ఇష్టపడుతున్నారు. ఈ మధ్య మట్టి వంట పాత్రలు కావాలని పలువురు అడుగుతున్నారు. ఇందుకోసం మట్టి వంట పాత్రలను సైతం అమ్మకానికి ఉంచాం. కాగా, వాటికి మంచి గిరాకీ ఉంది. కానీ, ఆశించిన స్థాయిలో లాభం రావాడం లేదు. ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించి ఆర్థికంగా ఆదుకోవాలి.
- కుమ్మరి కుమార్, విక్రయదారు, హిమాయత్‌నగర్
మట్టి పాత్రల్లో చేసే వంటలు శ్రేష్టం
నాడు స్టీల్ పాత్రలు, రైస్ కుక్కర్లు లేనప్పుడు మట్టి వంటపాత్రల్లోనే వంటలు వండేవారు. అందులో వండిన అన్నం, కూర ఎంతో రుచిగా ఉండేది. రానురాను మట్టి వంటపాత్రలు ఉపయోగించడం పూర్తిగా తగ్గించారు. దీంతో వాటిని తయారుచేసే వారు కూడా తగ్గిపోయారు. ప్రస్తుతం ఆనారోగ్యాల కారణంగా మళ్లీ మట్టి వంటపాత్రలను ఇష్టపడుతున్నాం. అందులో వండిన ఆహారం తింటే ఆరోగ్యకరంగా ఉంటామన్న నమ్మకం ఉంది.
- బండ్లగూడ సంధ్య , సర్పంచ్, అజీజ్‌నగర్,
Updated Date - 2023-03-05T23:53:11+05:30 IST