సంక్షేమం, అభివృద్ధి మన నినాదం
ABN, First Publish Date - 2023-08-02T00:18:18+05:30
సంక్షేమం-అభివృద్ధి నినాదాలుగా, ఈ విధానాలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఈ విధానాలతోనే ముందుకెళుతున్న ప్రభుత్వం
మెట్రోరైల్ ఏర్పాటుకు నిర్ణయించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కందుకూరు సమగ్రాభివృద్ధికి బాటలు : మంత్రి సబితారెడ్డి
కందుకూరు, ఆగస్టు 1: సంక్షేమం-అభివృద్ధి నినాదాలుగా, ఈ విధానాలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్‌పేట మున్సిపాలిటీ పరిధి ఎస్‌వైఆర్ గార్డెన్‌లో మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కందుకూరు వరకు మెట్రో రైల్వేలైన్ ఏర్పాటుకు, కందుకూరుకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు వసతి ఉన్న చోట్ల జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా నెలకు రూ.3వేల మెయింటెనెన్స్ ఖర్చులు, రూ.10వేల పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. కందుకూరులో మెడికల్ కళాశాల మంజూరు, శంషాబాద్ నుంచి తుక్కుగూడ, మహేశ్వరం గేటు మీదుగా కందుకూరు వరకు మెట్రో రైల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతం అభివృద్ధికి పునాదులు వేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల మహేశ్వరం పర్యటన సందర్భంగా ప్రతీ గ్రామానికి రూ.15లక్షలు మంజూరు చేశారని ఆమె గుర్తుచేశారు. సమావేశంలో జెడ్పీటీసీ బి.జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ డి.చంద్రశేఖర్, తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, ట్రాన్స్‌కో ఏఈ రమే్‌షగౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జయేందర్, మండల రైతు సమితి కన్వీనర్ బి.కృష్ణరాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:18:18+05:30 IST