వరుణుడి కోసం ఎదురుచూపులు
ABN, First Publish Date - 2023-06-26T00:06:06+05:30
ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, జూన్ ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. వరుణుడు దోబూచులాడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎండుముఖం పడుతున్న పత్తి మొలకలు
నెలక్రితమే విత్తనాలు నాటిన రైతులు
వర్షాలు లేక దిగాలు
యాచారం, జూన్ 25 : ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, జూన్ ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. వరుణుడు దోబూచులాడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట పంటలతో పాటు వరినాట్లు వేసేందుకు వాతావరణం అనుకూలంగా లేదు. కాగా, మండల పరిధిలోని కుర్మిద్ద, మేడిపల్లి, మాల్, కుర్మిద్దతండాల్లో నెల క్రితం కురిసిన వర్షానికి రైతులు పత్తి విత్తనాలు నాటారు. అయితే, మేఘాలు ముఖం చాటేయడంతో వర్షాలు లేక పత్తి మొలకలు ఎండుముఖం పడుతున్నాయి. కొన్నిచోట్ల అసలు మొలకలు కనిపించడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. ఐదు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షానికి మొలకెత్తని విత్తనాల స్థానంలో తిరిగి కొత్తగా నాటారు. అయితే, రెండు రోజులకోసారి దట్టమైన మబ్బులు కమ్మినా.. ఒక్క చినుకు కూడా పడటం లేదని రైతులు తల్లడిల్లుతున్నారు. కాగా, గతేడాది ఇదే సమయానికి కుర్మిద్ద, మేడిపల్లి, మాల్, కుర్మిద్దతండాల్లో మొత్తం 150 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈసారి మాత్రం వర్షాలు కురియక నాట్లు వేసే పరిస్థితి లేదు. గత ఏడాది 853 ఎకరాల్లో జొన్న, కంది, పత్తి పంటలు వేయగా.. ఈసారి కనీసం 50 ఎకరాల్లో కూడా సాగు చేయలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మృగశిర కార్తె దాటినా ఎండల ప్రభావంతో వరినారు ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.30 వేల అప్పు చేశాం : సుజాత, మహిళా రైతు, కుర్మిద్ద తండా
మాకున్న మూడెకరాల్లో నెల క్రితం ఆరు పత్తి విత్తనాలు ప్యాకెట్లను రూ.6,425కు కొనుగోలు చేశాం. దుక్కి దున్నడానికి రూ.5,800, ఎరువులకు రూ.14,500, కూలీలకు రూ.3300 ఖర్చయ్యాయి. వర్షాలు కురియకపోవడంతో మరో రూ.2వేల పత్తి విత్తనాలు తీసుకొచ్చి విత్తినాము. అంతకుముందు వేసిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. రెండు రోజుల్లో వర్షం కురవకుంటే పంటంతా ఎండిపోవడం ఖాయం.
Updated Date - 2023-06-26T00:06:06+05:30 IST