నేతల మధ్య ‘విగ్రహాల’ చిచ్చు
ABN, First Publish Date - 2023-09-29T23:50:32+05:30
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై స్థానిక నేతల మధ్య చిచ్చు రగులుతోంది.
ఏర్పాటు చేయాలని అధికార పార్టీ నేతలు
వద్దంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ టౌన్, సెప్టెంబరు 27: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై స్థానిక నేతల మధ్య చిచ్చు రగులుతోంది. విగ్రహాల ఏర్పాటు కొందరికి ప్రతిష్టాత్మకంగా, మరికొందరికి ఆటంకంగా మారింది. ఫలితంగా విగ్రహం ఏర్పాటు చేయాలా? తొలగించాలా? అనే విషయంపై కొందరు నేతలు జనాభిప్రాయం తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. మాజీ సర్పంచ్ స్థానికంగా మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించి తన కంటూ ఒక గుర్తింపు పొందగా ప్రస్తుతం అదేబాటలో మరికొందరు నేతలు ఆ గుర్తింపు కోసం పాకులాడుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందున్న కూడలివద్ద అధికార పార్టీకి చెందిన నేతలు చేపడుతున్న మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటు స్థానికంగా చర్చనీయాంశమైంది. చిన్నపాటి చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహంతో ట్రాఫిక్ సమస్య నెలకొని స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యతిరేకించిన వారు తిరిగి అక్కడే మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీసింది. మాజీసర్పంచ్ బేరీ ఈశ్వర్ స్థానికంగా ఉన్న ప్రధాన కూడలి వద్ద 25అడుగుల అతిపెద్ద బాబా సాహేబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాన్ని అప్పట్లో కొందరు రాజకీయ నేతలు పరోక్షంగా అడ్డుకుని సంవత్సరాల తరబడి విగ్రహాలు ప్రారంభానికి నోచుకోకుండా చేశారు. అనంతరం నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో ఇటీవల ఆ విగ్రహాలను ప్రారంభించారు.
కేంద్ర బిందువుగా మారిన ప్రధాన కూడలి
గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందున్న ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన బాబాసాహేబ్ అంబేడ్కర్ విగ్రహం పక్కనే మహాత్మాగాంధీ విగ్రహాన్ని అధికార పార్టీకి చెందిన వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం అబేడ్కర్ విగ్రహం కన్న ఎతైనది కావటంతో పాటు స్థలాన్ని చాలావరకు అక్రమించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ఆశ్రయించి విగ్రహఏర్పాటు పనులను అడ్డుకుంటున్నారు. అప్పట్లో విగ్రహాల ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేతలు ప్రస్తుతం అదే బాటలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శోచనీయమంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్నారు.
విగ్రహాలను వేరే చోటికి మార్చాలి: సాయిపేట శ్రీనివాస్ యాదవ్ (కాంగ్రెస్ కౌన్సిలర్)
విగ్రహాల ఏర్పాటుతో కూడలి కుదించుకుపోయింది. ఫలితంగా వాహనాల రాక పోకలకు అంటంకం కలిగి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. మహనీయుల విగ్రహాలను అగౌరవ పరచకుండా సురక్షితంగా ఉండే ప్రాంతాలకు తరలించి అన్ని హంగులతో అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ప్రజల ఇబ్బందులను గ్రహించాలి: అమరం సరస్వతీ(బీజేపీ కౌన్సిలర్)
మేం మహనీయుల విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించటం లేదు. పోటీపడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప ప్రజల ఇబ్బందులను గ్రహించడం లేదు. చిన్నగా ఉన్న ప్రధాన కూడలి వద్దపెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలో నాయకులు పోటీపడటం తగదు. విగ్రహం ఏర్పాటుతో తలెత్తే ఇబ్బందులను గ్రహించాలి.
విగ్రహ ఏర్పాటుతో ఎలాంటి సమస్య లేదు: అమరం హేమంత్ రెడ్డి (బీఆర్‌ఎస్ కౌన్సిలర్)
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ కూడలి వద్ద మహాత్మా గాంధీ, అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలు ఉండగా వాటిని తొలగించి తిరిగి అక్కడే అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాగా మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు వాయిదా పడింది. తిరిగి కూడలి వద్ద స్థానికులకు ఇబ్బందులు కలగకుండా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుండ్లపోచంపల్లి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అమరం హేమంత్‌రెడ్డి అన్నారు.
================================================================
Updated Date - 2023-09-29T23:50:32+05:30 IST