సాయం కరువు
ABN, First Publish Date - 2023-03-05T23:47:48+05:30
సరైన అవగాహన లేక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు జిల్లా రైతులు దూరమవుతున్నారు.
అవగాహన లోపం.. అందని పంట సాయం!
ఈ-కేవైసీ చేసుకోక పెట్టుబడి సాయం పొందలేని వైనం
అర్హతున్నా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు రైతుల దూరం
వికారాబాద్, మార్చి5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సరైన అవగాహన లేక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు జిల్లా రైతులు దూరమవుతున్నారు. నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ చేసుకోకపోవడంవల్ల కేంద్ర ప్రభుత్వం అందించే పంట సాయాన్ని కోల్పోతున్నారు. ఆధార్, మొబైల్ నంబర్లను అనుసంధానం(ఈ-కేవైసీ) చేసుకోకపోవడం వల్లనే వారు ఈ పథక ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించింది. సాగులో ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమల్లోకి తెచ్చింది. రైౖతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.2వేల వంతున మొత్తం రూ.6వేలను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటి వరకు 12విడతలుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నిధులను విడుదల చేయగా, తాజాగా గత నెల 27వ తేదీన 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో 20,125 మంది రైతులు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకోలేక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పొందలేకపోయారు. జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి 1,33,666మంది రైతులకు అర్హత ఉండగా, వారిలో 1,13,541 మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకోని 20,125 మంది రైతులు కేంద్ర నగదు సాయానికి దూరమయ్యారు.
అధికారులు అవగాహన కల్పిస్తున్నా ...
ఈ-కేవైసీ చేసుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ అవుతాయి. ప్రతీ నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున వస్తాయి. ఈ-కేవైసీ చేసుకోవాలని రైతులకు పలుమార్లు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా కొందరు రైతులు పట్టించుకోవడం లేదు. ఆధార్‌కు లింకై ఉన్న మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ఈ-కేవైసీ చేసుకుంటే సరిపోతుంది. ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానానికి పట్టణాలు, మండల కేంద్రాలకు వెళ్లి రైతులు ఇబ్బందులు పడకుండా ఈ-కేవైసీకి రైతు వేదిక వద్దే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. కొందరు రైతులు ఆధార్, మొబైల్ లింక్ చేసుకోక కేంద్ర ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారు. రైతులే ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ చేసుకునే అవకాశం ఉన్నా చేసుకోలేకపోతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-03-05T23:47:48+05:30 IST