దయనీయం!
ABN, First Publish Date - 2023-06-18T23:26:11+05:30
భావితరాలకు విద్యాబోధన చేసే ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే అధ్యాపకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా బోధన చేసే అఽధ్యాపకులు లేకపోవడంతో చురుకైన ఛాత్రోపాధ్యాయులు తమ సహచర విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అంతేకాకుండా డైట్ కళాశాల ఆవరణలో శుభ్రత అనేది ప్రశార్థకంగా మారింది. ఎవరి పనులు వారే చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
డైట్‌లో అధ్యాపకులేరీ?
28 మంది అధ్యాపకులకు ఇద్దరే దిక్కు
అధ్యాపకులు లేకుండా విద్యాబోధనలో శిక్షణ ఎలా ?
సహచరులకు పాఠాలు బోధిస్తున్న ఛాత్రోపాధ్యాయులు
ప్రాభవం కోల్పోతున్న వికారాబాద్ జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ
భావితరాలకు విద్యాబోధన చేసే ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే అధ్యాపకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా బోధన చేసే అఽధ్యాపకులు లేకపోవడంతో చురుకైన ఛాత్రోపాధ్యాయులు తమ సహచర విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అంతేకాకుండా డైట్ కళాశాల ఆవరణలో శుభ్రత అనేది ప్రశార్థకంగా మారింది. ఎవరి పనులు వారే చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వికారాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తరగతి గదుల్లో విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ఛాత్రోపాధ్యాయుల చదువులు ఈ విధంగా కొనసాగితే ప్రభుత్వ విద్యా రంగంపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ విధంగా నమ్మకం పెరుగుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) కళాశాల వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ఈకళాశాలలో డీఎడ్ కోర్సు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో కొనసాగుతోంది. ఒక్కో మీడియంలో 50 మంది విద్యార్థుల వంతున ప్రతిఏటా 150 మందిని చేర్చుకుంటున్నారు. ఈ కళాశాలలో మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి మొత్తం 300 మంది ఛాత్రోపాధ్యాయులకు ప్రాథమిక విద్యాబోధనలో శిక్షణ ఇస్తున్నారు. విద్యా బోధనకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునేందుకు డీఎడ్ కోర్సులో చేరితే.. ఇక్కడ శిక్షణ ఇచ్చే అధ్యాపకులు లేక ఛాత్రోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యా శిక్షణలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) అధ్యాపకులు లేక ఆ గుర్తింపు కోల్పోతోంది. వేలాది మంది ఛాత్రోపాధ్యాయులకు, వేలాది మంది ఉపాధ్యాయులకు విద్యా బోధనలో ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఈ సంస్థ క్రమంగా ప్రాభవం కోల్పోవడం విచారకరం.
ఇద్దరే అధ్యాపకులు దిక్కు
ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ కళాశాలలో మొత్తం 29 పోస్టులు ఉండగా... ఇద్దరు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియాల్లో ఛాత్రోపాధ్యాయులకు విద్యా బోధన చేసేందుకు ఒక ప్రిన్సిపాల్ పోస్టుతో పాటు ఏడుగురు సీనియర్ లెక్చరర్లు, 16 మంది లెక్చరర్లు, 5 మంది ఉర్దూ మీడియం లెక్చరర్లు ఇక్కడ ఉండాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ డైట్ కళాశాల ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులతోనే కొనసాగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకుల్లో ఒకరు ప్రిన్సిపాల్‌గా.. మరొకరు లెక్చరర్‌గా కొనసాగుతున్నారు. అతిథి అధ్యాపకుల సేవలతో ఇంత కాలం నెట్టుకువచ్చిన ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో వారి సేవలకు స్వస్తి పలికింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంత వరకు అధ్యాపకుల నియమకం జరగకపోవడంతో ఛాత్రోపాధ్యాయులు తమకు తామే విద్యా బోధన చేసుకోవాల్సిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల డీసెట్ -2023 ఫలితాలు వెల్లడించడంతో త్వరలో డీఎడ్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల ఛాత్రోపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ తరగతులు సక్రమంగా కొనసాగేందుకు వీలుగా అవసరమైన సంఖ్యలో అధ్యాపకులను నియమించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, డైట్‌లో నలుగురు అటెండర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు. ఫలితంగా డైట్ కళాశాల ఆవరణలో శుభ్రత అనేది ప్రశార్థకంగా మారింది. ఎవరి పనులు వారే చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అధ్యాపకులు లేకుండా ఉర్దూ బోధన ఎలా?
ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ కళాశాలలో ఉర్దూ మీడియం బోధించేందుకు అధ్యాపకులు లేక ఆ భాషలో శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉర్దూ మీడియం డీఎడ్ కోర్సు కొనసాగుతున్న ప్రభుత్వడైట్ కళాశాలల్లో వికారాబాద్ ఒకటి. ఉర్దూ మీడియంలో బోధించేందుకు డైట్‌లో ఐదుగురు రెగ్యులర్ అధ్యాపకులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఉర్దూ మీడియం ఛాత్రోపాధ్యాయులకు ఉర్దూలోనే బోధిస్తేనే వారు రాబోయే రోజుల్లో ఉర్దూ భాషలో చదివే విద్యార్థులకు విద్యా బోధన చేయగలుగుతారు. భావితరాలకు మంచి విద్య అందించగలుగుతారనేది అందరికీ తెలిసిందే.
అధ్యాపకులను నియమించాలి :పావని, డీఎడ్ - ఇంగ్లీష్ మీడియం సెకండియర్, వికారాబాద్
ప్రభుత్వ డైట్‌లో అధ్యాపకులు లేక ఛాత్రోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధ్యాపకులు లేక మా చదువులు ఎలా కొనసాగుతున్నాయనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి డైట్‌లో పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించాలి. అధ్యాపకులు ఉంటేనే మా శిక్షణ సజావుగా కొనసాగుతుంది.
ఛాత్రోపాధ్యాయులే అధ్యాపకులుగా: ఐఐఐ:: ఇర్షాద్, డీఎడ్, ఉర్దూ మీడియం ఫస్టియర్, వికారాబాద్
డైట్‌లో అధ్యాపకులు లేక ఛాత్రోపాధ్యాయులే అధ్యాపకులుగా మారి చదువులు చెప్పుకోవాల్సి వస్తోంది. అధ్యాపకులు లేక విద్యాబోధనలో అవసరమైన నైపుణ్యాలు మేము నేర్చుకోలేకపోతున్నాం. మేమే సరిగా శిక్షణ తీసుకోకపోతే ఉపాధ్యాయులుగా ఎలా రాణించగలం. మా పరిస్థితిని అర్థం చేసుకుని అధ్యాపకులను నియమించేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం.
ఇద్దరితోనే విద్యా బోధన: విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎడ్, ఇంగ్లీష్ మీడియం ఫస్టియర్, వికారాబాద్
డైట్‌లో ఇద్దరు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల ఛాత్రోపాధ్యాయులకు ఆఇద్దరు ఎలా బోధించగలరు ? డైట్‌లో అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలంటూ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నా ఫలితం లేకుండాపోతోంది. డైట్‌లో అధ్యాపకుల నియామకం చేపట్టాలని ఇటీవల వికారాబాద్‌కు వచ్చిన విద్యా శాఖ మంత్రి సబితారెడ్డికి విజ్ఞప్తి చేశాం.
Updated Date - 2023-06-18T23:26:11+05:30 IST