అంతా ఉత్తదే..!
ABN, First Publish Date - 2023-04-15T00:19:50+05:30
వ్యవసాయ అధికారులకు, రైతులకు సంధానకర్తగా వ్యవహరించి సమన్వయ పరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్బాటంగా రైతు సన్వయ సమితులను ఏర్పాటు చేసింది.
పేరుకే రైతు సమన్వయ సమితులు
రైతుబంధు సమితులుగా పేరు మార్చినా నిరుపయోగం
ఏళ్లు గడుస్తున్నా నిధులు, బాధ్యతలపై స్పష్టత కరువు
ఉత్సవ విగ్రహాల్లా గ్రామ, మండల కోఆర్డినేటర్లు
వ్యవసాయ అధికారులకు, రైతులకు సంధానకర్తగా వ్యవహరించి సమన్వయ పరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్బాటంగా రైతు సన్వయ సమితులను ఏర్పాటు చేసింది. కానీ అవి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. రైతుబంధు సమితులుగా పేరు మార్చినా రైతులకు ఎలాంటి ఉపయోగం కలగడం లేదు. నిధులు, బాధ్యతలు లేకపోవడంతో కోఆర్డినేటర్లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. వ్యవసాయ శాఖతో సమన్వయం కుదరకపోవడంతో రైతులకు సలహాలు, సూచనలు అందక ఇబ్బంది పడుతున్నారు.
రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 14 : రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బంధు సమితిలు ప్రేక్షక పాత్ర పోషిస్తూ రైతుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి చొరవ చూపడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మొదట రైతు సమస్వయ సమితిలుగా ఆవిర్భవించిన కమిటీలు కాలక్రమంలో రైతు బంధు సమితిలుగా మారాయి. ఈ సమితిలు గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా విస్తరించి రాష్ట్ర స్థాయిలో కమిటీగా ఉంది. ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో రైతులకు మేలు జరుగుతుందని అందరూ భావించినా అసలు ఉద్దేశాన్ని గాలికొదిలేయడంతో అభాసుపాలవుతోంది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైనప్పటి నుంచి సమితిల్లోని సభ్యుల కు ఎలాంటి బాధ్యతలు, విధులు అప్పజెప్పలేదు. అడపాదడప ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతున్నా.. వారి ద్వారా రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు.
నామినేటెడ్ పద్ధతిలో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 47 మండలాల్లో మండల సమన్వయ సమితి, 1,058 గ్రామాల్లో గ్రామ సమన్వయ సమితుల కోఆర్డినేటర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ను నియమించారు. రైతు సమన్వయ సమితులకు సంబంధించిన విధివిధానాలతో ఆగస్టు 27న జీవో 39ని జారీ చేసింది. ప్రభుత్వ నామినేటెడ్ ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అప్పట్లో ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ జీవో ప్రకారం గ్రామ రెవెన్యూ స్థాయిలో 15 మంది, మండల స్థాయిలో 24 మంది, జిల్లా స్థాయిలో 24 మంది, రాష్ట్ర స్థాయిలో 42మంది సభ్యులతో రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమితిలకు ప్రభుత్వం నామినేటెడ్‌పద్ధతిలో ఒక సమన్వయ కర్త (కోఆర్డినేటర్) ను నియమించింది.
రైతుబంధు సమితులుగా పేరు మార్పు
రైతు బంధు సమితిలకు ప్రభుత్వం అన్ని రకాల అధికారాలు కట్టబెడుతుందన్న ప్రచారం జరిగింది. రైతు బంధు పథకం, రైతుబీమా, గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి సభ్యులు వస్తారని, పంటలకు గిట్టుబాటు ధరలు, క్రాప్ కాలనీల ఏర్పాటు వంటి వాటిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రూ. 500 కోట్లతో రైతు నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. దీంతో రైతు సమన్వయ సమితిలో స్థానం కోసం అప్పట్లో భారీగానే పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆరేళ్లవుతోన్నా.. ఎలాంటి బాధ్యతలను అప్పగించక పోగా... రైతుసమన్వయ సమితుల పేరు తొలగించి రైతుబంధు సమితి కోఆర్డినేటర్లుగా ఏర్పాటు చేసింది.
కనిపించని సేవలు
రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు రైతు సమన్వయ సమితి సభ్యులు అవసరమైన సేవలను అందించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కనీసం గ్రామాల్లో పర్యటించి రైతు సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా జరగడం లేదు, ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ.. ఇప్పటి వరకు రైతులకు పంటలపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవు.
ఉత్సవ విగ్రహాలుగా..
వ్యవసాయ శాఖ అధికారులతో రైతు సమన్వయ సమితీ సభ్యులు సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా.. ఎవరిదారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారి సమన్వయ సమితీ సభ్యులు వ్యవసాయ శాఖతో సమన్వయం కాలేకపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ, మద్దతు ధరలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన సభ్యులు సైలెంట్‌గా ఉండి పోతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేయాల్సిన సభ్యులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేరుకే గ్రామ, మండల, జిల్లా సమితి కోఆర్డినేటర్లుగా చలామని అవుతున్న వారు రైతు సమస్యలను పరిష్కరించలేక పోతున్నారు.
ఇంకా ఎన్నేళ్లు ఇలా?
ప్రభుత్వం రైతు బంధు సమితిలను నామినేటెడ్ పద్దతిలో ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆరేళ్లు దాటింది. ఈ సమితీలు ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది ప్రభుత్వం నిర్ణయించలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కోఆర్డినేటర్లు ఉన్నా.. లేనట్టుగానే ఉందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నాం
జిల్లా కోఆర్డినేటర్‌తో పాటు మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లను ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు శిక్షణ అందించాం. రైతు సమన్వయ సమితులను రైతు బంధు సమితిలుగా పేరు మార్చాం. నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఎంపిక చేశాం.
గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
ఉమ్మడి జిల్లాలో గ్రామ, మండల రైతు సమన్వయ సమితులు
రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మొత్తం
గ్రామ రైతు సమన్వయ సమితులు 475 482 101 1,058
మండల రైతు సమన్వయ సమితులు 23 18 06 47
ఉమ్మడి జిల్లాలో రైతు వేదికలు
రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మొత్తం
రైతు వేదికలు 83 99 09 191
Updated Date - 2023-04-15T00:19:50+05:30 IST