కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2023-01-06T23:54:43+05:30
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి అర్బన్, జనవరి 6 : కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు డెమో వీడియోను మంత్రి వీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష నిర్వహించడమే పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈనెల 9వ తేదిన మున్సిపల్ కార్పొరేషన్‌లలో, మున్సిపాలిటీలు, మండల స్థాయిల్లో, 10వ తేదిన గ్రామ పంచాయతీల్లో కంటి వెలుగు కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం జనవరి 18న ప్రారంభించుకుని జూన్ 30న ముగించుకోవడం జరుగుతుందని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులతోపాటు అద్దాలు అందించనున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. గ్రామాల్లో క్యాంపు నిర్వహించే సమయంలో డప్పు చాటింపు ద్వారా ప్రజలకు సమచారం అందించాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 558 గ్రామ పంచాయతీలు, 23 జీహెచ్‌ఎంసీ వార్డులు, 358 యుఎల్‌బీసీలు, 965 హాబిటేషన్‌లలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభీవానిదేవి, దయానంద్‌గుప్తా, పట్నం మహేందర్‌రెడ్డి, శాసన సభ్యులు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్, జిల్లాపంచాయతీ అధికారి శ్రీనివా్‌సరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-06T23:54:44+05:30 IST