మద్యం టెండర్ల కిక్కు...!
ABN, First Publish Date - 2023-08-12T23:00:42+05:30
అసలే వచ్చేది ఎన్నికల సీజన్. ఎన్నికలంటేనే మద్యం వరదలై పారుతుంది. ఇలాంటి తరుణంలో మద్యం దుకాణాల నుంచి సరుకు భారీగా అమ్ముడవుతుంది. దీనిద్వారా దుకాణాల యజమానులకు కాసుల పంట పండినట్టే. దీంతో మద్యం
మద్యం షాపులకు వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
ఎక్సైజ్ అకాడమీలో చురుగ్గా దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి టెండర్లు వేస్తున్న వ్యాపారులు
18 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు
11 వరకు స్వీకరించిన దరఖాస్తులు 3,130
అత్యధికంగా 1,096 దరఖాస్తులు శేరిలింగంపల్లి నుంచే
సిండికేట్‌గా మారుతున్న దరఖాస్తుదారులు
అసలే వచ్చేది ఎన్నికల సీజన్. ఎన్నికలంటేనే మద్యం వరదలై పారుతుంది. ఇలాంటి తరుణంలో మద్యం దుకాణాల నుంచి సరుకు భారీగా అమ్ముడవుతుంది. దీనిద్వారా దుకాణాల యజమానులకు కాసుల పంట పండినట్టే. దీంతో మద్యం దుకాణాలు పొందేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అయితే, ప్రతిసారీ లాగానే వారంతా సిండికేట్‌గా మారి దరఖాస్తులు సమర్పించి సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు.
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 12 : మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. రాబోయే ఏడాది ఎన్నికల సందడి ఉండడంతో తమ అదృష్టాన్ని దరఖాస్తుదారులు పరీక్షించుకోబోతున్నారు. యువకులు, మహిళలు, నేతలు, కాంట్రాక్టర్లు అనే తేడా లేకుండా మద్యం షాప్ టెండర్ల కోసం క్యూ కడుతున్నారు. ఆరె మైసమ్మ ప్రాంతంలోని ఎక్సైజ్ అకాడమీలో మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 234 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నుంచి వ్యాపారులు టెండర్లు వేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 11వ తేదీ వరకు సరూర్‌నగర్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మొత్తం 3,130 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శేరిలింగంపల్లి ఎక్సైజ్ డివిజన్ నుంచి 1,096 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు గడువు ఈసారి భారీగానే టెండర్లు వచ్చే అవకాశం కనబడుతుంది.
రిజర్వేషన్లు ఇలా..
గత ఎక్సైజ్ పాలసీ మాదిరిగానే ఈ సారి కూడా ఎస్సీ, ఎస్టీలతో పాటు గౌడ కులస్తులకు వైన్స్‌లో రిజర్వేషన్లను కేటాయించారు. జిల్లాలో 234 మద్యం షాపులకు గాను 53 ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేశారు. 181 షాపులు జనరల్‌కు కేటాయించారు. సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం. మహేశ్వరం, ఆమనగల్లు, షాద్‌నగర్ ఎక్సైజ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఎస్సీలకు 11, ఎస్టీలకు 2, గౌడ, సామాజిక వర్గాలకు 25 షాపులను కేటాయించారు. అలాగే శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలో శంషాబాద్, చేవెళ్ల, శేరిలింగంపల్లి ఎక్సైజ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఎస్సీకి 6 కేటాయించారు. ఎస్టీలు ఎవరూ లేరు. గౌడ, సామాజిక వర్గాలకు 9 షాపులను రిజర్వ్ చేశారు.
ఎన్ని దరఖాస్తులైనా దాఖలు చేసే అవకాశం
2023-25 మద్యం పాలసీకి సంబంధించి ఆశావహులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఒకే షాపునకు ఎన్ని దరఖాస్తులైన దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. వేరే షాపులకు టెండర్లు వేసి ఎన్ని లైసెన్స్‌లైనా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో వ్యాపారులు ఈ సారి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దరఖాస్తుకు రూ. 2 లక్షలు
ఈసారి ఔత్సాహికుల నుంచి స్పందన భారీగానే ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. గడువు చివరి రోజు వరకు దరఖాస్తులు ముంచుకు వచ్చే అవకాశాలు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి దరఖాస్తుకి గతంలో మాదిరిగా రూ. 2లక్షల డీడీ తప్పనిసరిగా జత చేయాలి. ఇవి తిరిగి ఇవ్వరు.
సిండికేటుగా..
గతంలో మాదిరిగానే మద్యం పాలసీలోనూ దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు నిర్ణయించడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి 20 నుంచి 30 వరకు దరఖాస్తులను సమర్పిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో సర్కారుకు రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. గతంలో కూడా ఇదే తీరు కనిపించింది. ఒక్కొక్కరు వివిధ దుకాణాలకు దరఖాస్తులు సమర్పిస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ, చాలామంది కలిసి ఒక్కో దుకాణానికి పంపకం రూపంలో దరఖాస్తులు చేస్తున్నారు. దుకాణాల కోసం పోటీ పడడం కన్నా కలిసికట్టుగా దరఖాస్తు చేసుకుని.. డ్రాలో వచ్చే దుకాణాలను పంచుకోవాలని భావిస్తున్నారు.
ఆశావహుల పోటాపోటీ
ఈ సారి 9వేల నుంచి 10 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు మరి కొంతమంది టెండర్లు దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
డిసెంబరు 1 నుంచి వైన్స్..
డ్రాలో వైన్స్ దక్కించుకున్న వారి షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి 2021-23 ఎక్సైజ్ పాలసీకి గడువు డిసెబర్ 30వ తేది వరకుంది. ఆయితే ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వం ముందుగానే షాపుల కేటాయింపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం జరగనున్న డ్రాలో షాపులు దక్కించుకునే వారు నవంబరు 30 సాయంత్రం వరకు మద్యం డిపో నుంచి స్టాక్ తీసుకుని డిసెంబర్ 1వ తేదీ నుంచి షాపులు ప్రారంభించాల్సి ఉంటుంది.
21న డ్రా..
మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఈ నెల 21న శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో డ్రా తీసి కేటాయించనున్నట్టు సరూర్‌నగర్ ఏఈఎస్ హన్మంతరావు తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వేగంగా సాగుతుందని, వ్యాపారులు ఉత్సాహంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో...
వికారాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు అందరూ ఒక్కటయ్యారు. మద్యం వ్యాపారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులు, ఉద్యోగ వర్గాలు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగే అవకాశం ఉండడంతో దుకాణాలు దక్కించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు ఆశావహులందరూ సిండికేట్లుగా మారి దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు అన్ని వర్గాలూ పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది చివరి నుంచి వరుసగా ఎన్నికలు జరగనున్న క్రమంలో మద్యానికి ఉండే డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగారు.ఈ ఏడాది చివరి నుంచి వరుసగా అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు జరగనున్న క్రమంలో మద్యానికి ఉండే డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యాపారులు రంగంలోకి దిగారు. గత 10, 15 ఏళ్ల నుంచి మద్యం వ్యాపారం చేస్తున్న కొందరు ఒక్కొక్కరుగానే మద్యం దుకాణాలను దరఖాస్తు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉండగా, మిగతా వారు తమకు తోడుగా కొందరు రాజకీయ నాయకులను, శ్రీమంతులుు, ఇతర వ్యాపారులను జతగా చేసుకుని సిండికేట్‌గా మారి మద్యం దుకాణాలను దక్కించుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. మద్యం వ్యాపారంలో బినామీ వ్యవస్థను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు కేటాయించిన మద్యం దుకాణాలను సులువుగా చేజిక్కించుకునేందుకు మద్యం వ్యాపారుల సిండికేట్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జిల్లాలో మొత్తం 59 మద్యం దుకాణాలు ఉండగా, తాండూరు సర్కిల్ పరిధిలో 18, వికారాబాద్‌లో 15, పరిగిలో 12, కొడంగల్‌లో 8, మోమిన్‌పేట్ సర్కిల్ పరిధిలో 6 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 9, ఎస్టీలకు 2, గౌడ్‌లకు 6 దుకాణాలను రిజర్వు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీ 2023, డిసెంబరు ఒకటో తేదీ నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉండనుంది. గతంలో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, మోమిన్‌పేట పట్టణాల్లోని మద్యం దుకాణాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటే, రాబోయేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈసారి అన్ని మద్యం దుకాణాలకూ తీవ్ర పోటీ నెలకొంది.
మద్యం దుకాణాల కోసం కలిసికట్టుగా
మద్యం దుకాణాల కోసం ఎన్ని ఎక్కువ దరఖాస్తులు వస్తే అంత మొత్తం ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. ప్రధాన కేంద్రాల్లో ఉన్న మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు మద్యం సిండికేట్ బృందాలు పావులు కదుపుతున్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మద్యం దుకాణాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుని నష్టపోయే కంటే అందరూ సిండికేట్‌గా మారి దుకాణాలను దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు. మద్యం దుకాణాల కోసం పోటీ పడడం కంటే కలిసి కట్టుగా దరఖాస్తు చేసుకుని... డ్రాలో వచ్చే దుకాణాలను పంచుకోవాలని భావిస్తున్నారు. మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులు, ఉద్యోగ, వ్యాపార వర్గాలు కూడా ఈసారి మద్యం దుకాణాలకు జరిగే డ్రాలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మద్యం వ్యాపారం కాసులు కురిపించేది కావడంతో కొత్త వారు కూడా ఈ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
చివరి రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆరు రోజులు గడువు ఉన్నా... వాటిలో 13, 15వ తేదీలు ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో ఆ రోజుల్లో దరఖాస్తులు స్వీకరించరు. మిగతా నాలుగు రోజుల్లోనే దరఖాస్తులు దాఖలు చేయడానికి వీలుంటుంది. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మద్యం వ్యాపారుల మధ్య చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్ వర్గాలకు కేటాయించిన దుకాణాలకు సంబంధిత రిజర్వేషన్ కలిగిన వారితో మద ్యం వ్యాపారులు దరఖాస్తులు వేయిస్తున్నారు. రిజర్వు కేటగిరిల్లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు తమకు అనుకూలంగా ఉన్న వారినే ఎంచుకుంటున్నారు. లాటరీలో ఎంపికైతే సంబంధిత వ్యక్తి తమ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా ముందుగానే రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్కీ డ్రాలో దుకాణం దక్కించుకున్న వారే మద్యం దుకాణం నిర్వహించాలి. బినామీలు దుకాణం నిర్వహించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా పలుచోట్ల గుడ్‌విల్ ఇచ్చి నడిపించిన ఉదంతాలు ఉన్న విషయం తెలిసిందే.
శనివారం వరకు 561 దరఖాస్తులు
వికారాబాదా్ జిల్లాలో 59 మద్యం దుకాణాలకు శనివారం వరకు 561 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటి వరకు వికారాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు దాఖలు కాగా, ఆ తరువాత స్థానాల్లో పరిగి, మోమిన్‌పేట్, తాండూరు, కొడంగల్ స్థానాలు నిలిచాయి. ఈనెల 4 నుంచి 11వ రోజు వరకు 169 దరఖాస్తులు రాగా, 12వ తేదీన 362 దరఖాస్తులు దాఖలయ్యాయి. వికారాబాద్ ఎక్పైజ్ స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు 171 దరఖాస్తులు రాగా, పరిగి పరిధిలోని 12 మద్యం దుకాణాలకు 158 దరఖాస్తులు దాఖలయ్యాయి. తాండూరు పరిధిలోని 18 దుకాణాలకు 104 దరఖాస్తులు రాగా, మోమిన్‌పేట పరిధిలోని 6 దుకాణాలకు 82 దరఖాస్తులు, కొడంగల్ పరిధిలోని 8 దుకాణాలకు 46 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన నాలుగు రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు దాఖలవుతాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది 59 మద్యం దుకాణాలకు 837 దరఖాస్తులు రాగా, ఈసారి 1500లకు పైగానే దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక మద్యం దుకాణానికి కనీసం 20 నుంచి 50 వరకు దరఖాస్తులు దాఖలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - 2023-08-13T00:48:38+05:30 IST