మండల కేంద్రంగా ఇర్విన్
ABN, First Publish Date - 2023-06-26T00:19:15+05:30
పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలం రెండు మండలాలుగా విడిపోనుంది. ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తుంది.
గ్రామ పంచాయతీలతో మండలం ఏర్పాటు
ఎంపీటీసీ స్థానాల కేటాయింపు
దశాబ్దాల కల సాకారంతో ఇర్విన్ గ్రామస్థుల ఆనందం
ఆమనగల్లు, జూన్ 25 : పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలం రెండు మండలాలుగా విడిపోనుంది. ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ విన్నపం మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మండల వ్యవస్థ ఏర్పాటు సమయంలో ఇర్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటుకు ప్రతిపాదించినా.. అప్పటి రాజకీయాల కారణంగా మాడ్గులను మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. మళ్లీ 2016లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో మారు కొత్త మండలాల ఏర్పాటు సందర్భంగా ఈ విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చి ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచారు. నియోజకవర్గంలో మరికొన్ని గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్ నేపసథ్యంలో ఈ అంశం మరుగున పడింది. చివరకు ఎమ్మెల్యే ఒత్తిడి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇర్విన్ మండలం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా దశాబ్దాల కల సాకారం కాబోతుండడంతో ఇర్విన్ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
22 గ్రామ పంచాయతీలతో..
మాడ్గుల మండలంలోని 19 పంచాయతీలు, వెల్దండ మండలంలోని 3 గ్రామ పంచాయతీలను కలిపి ఇర్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటుచేశారు. మాడ్గుల మండలంలో 14 ఎంపీటీసీలకు గాను ఇర్విన్‌కు 7 కేటాయించి, అజిలాపూర్ ఎంపీటీసీ స్థానాన్ని కూడా కలిపారు. దీంతో 8 ఎంపీటీసీ స్థానాలతో ఇర్విన్ మండలంగా రూపాంతరం చెందుతుంది. మాడ్గుల మండలంలోని ఇర్విన్, గిరికొత్తపల్లి, రాందుగ్యాల, నర్సంపల్లి, కూభ్యతండా, జర్పుల తండా, అందుగుల, అంతంపేట, ఆర్కపల్లి, పల్లె తండా, పలుగుతండా, సుద్దపల్లి, అన్నెబోయిన్‌పల్లి, కొత్తబ్రాహ్మణపల్లి, పాత బ్రహ్మణపల్లి, కలకొండ, చంద్రాయన్‌పల్లి, సండ్రల గడ్డ తండా, కాశగూడెంతో పాటు వెల్దండ మండలంలోని అజిలాపూర్, లాలుతాండ, కుందారం గ్రామ పంచాయతీలను ఇర్విన్‌లో కలుపుతున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదించి ప్రభుత్వానికి నివేదించారు.
ఇప్పటికే ఇర్విన్‌లో పలు సౌకర్యాలు
మాడ్గుల మండలం ఇర్విన్‌లో ఇప్పటికే పలు సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మండల కేంద్రం ఏర్పాటుతో మరిన్ని సౌకర్యాలు, వసతులు ప్రజలకు ఒనగూడనున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో అతి పెద్ద గ్రామాల్లో ఇర్విన్ ఒకటి. ప్రస్తుతం గ్రామీణ బ్యాంక్, విద్యుత్‌ఉప కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుర్వేద ఆసుపత్రి, ఉన్నత పాఠశాలతో పాటు పలు సౌకర్యాలున్నాయి. మండల కేంద్రం ఏర్పాటుతో ఇతర కార్యాలయాలు ఏర్పాటై తమకు ఇబ్బందులు తొలుగుతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇర్విన్‌కు మహర్దశ : ఎమ్మెల్యే
ఇర్విన్ గ్రామానికి మహర్దశ కలగనుందని కల్వకుర్తి ఎమ్మెల్మే జైపాల్ యాదవ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, మండల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్మే మాట్లాడారు. 22గ్రామ పంచాయతీలతో ఇర్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. మాజీ ఎంపీపీ లక్ష్మమ్మయాదయ్య, మాజీ జడ్పీటీసీ రవి, సర ్పంచ్ పుష్పలత జంగయ్య, ఎంపీటీసీ తిరుపతమ్మవెంకటయ్యగౌడ్, ఉపసర్పంచ్ సుజాతశ్రీనివా్‌సలు ఎమ్మెల్యేను సత్కరించారు. నాయకులు యాదిరెడ్డి, తిరుమల్‌రెడ్డి, రమేశ్ రెడ్డి, వెంకటేశ్, బుచ్చమ్మ, కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-06-26T00:19:15+05:30 IST