ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కలక’లం

ABN, First Publish Date - 2023-08-02T00:33:58+05:30

రంగారెడ్డి జిల్లాలో కండ్ల కలక వ్యాధి కలవరం రేపుతోంది. వాతావరణ మార్పుల కారణంగా కండ్ల కలక బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

  • వ్యాపిస్తున్న కండ్ల కలక

  • ఆందోళన కలిగిస్తున్న నేత్ర వ్యాధి

  • ప్రభుత్వ హాస్టళ్లలో 1,005 మందికి సోకిన వైరస్‌

  • వ్యాధి భయంతో ఇంటి బాట పడుతున్న విద్యార్థులు

  • ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోనే కండ్ల కలక అధికం

  • జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న పీడితులు

జిల్లాలో కండ్ల కలక వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. బ్యాక్టీరియా, కెమికల్స్‌, వైర్‌సల ద్వారా ఈ వ్యాధి సోకుతోంది. పెద్ద వారితో పోలిస్తే పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో వ్యాధి పీడిత విద్యార్థులు ఉంటున్నారు. ఒకచోట గుమికూడినట్టుగా ఉండటం, తరగతి గదుల్లో ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 1,005 మంది విద్యార్థినులకు కండ్లకలక సోకింది. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థుల్లో ఎక్కువ మంది వ్యాధి బారిన పడుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 1): రంగారెడ్డి జిల్లాలో కండ్ల కలక వ్యాధి కలవరం రేపుతోంది. వాతావరణ మార్పుల కారణంగా కండ్ల కలక బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సమస్య పిల్లల్లో ఎక్కువ కన్పిస్తోంది. బ్యాక్టీరియా లేదా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. జలుబు కారక వైర్‌సతోనూ కండ్ల కలక వస్తుందంటున్నారు. కాగా వ్యాధి సోకిన వారి నుంచి తోటి వారికి వ్యాధి త్వరగా వ్యాపిస్తోంది. వ్యాధి పీడితులు ముట్టుకున్న వస్తువులను వేరేవారు ముట్టుకొని అవే చేతులతో కండ్లు నలుచుకున్నా, తుడుచుకున్నా ఆ బ్యాక్టీరియా, వైరస్‌ వారికి సైతం సోకి కండ్ల కలక వస్తుంది. ఈ కారణంగానే ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది.

విద్యాసంస్థల్లో వ్యాప్తి చెందుతున్న వ్యాధి

రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1,005 మంది విద్యార్థినులకు కండ్ల కలక సోకింది. కడ్తాల మండలం కస్తూర్బా బాలికల పాఠశాలలో 50 మంది విద్యార్థినులకు కండ్ల కలక వచ్చింది. దీంతో వారందరినీ ఉపాధ్యాయులు ఇళ్లకు పంపారు. అలాగే షాబాద్‌లోని కస్తూర్బా పాఠశాలలో 30మంది విద్యార్థినులు కండ్ల కలకతో ఇబ్బంది పడుతున్నారు. వీరందరినీ తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ముగ్గురు విద్యార్థినులకు కండ్ల కలక వచ్చింది. ఆమనగల్లులో కండ్ల కలక సోకి ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లిపోయింది. షాద్‌నగర్‌లో 10 మంది హాస్టల్‌ విద్యార్థులకు కండ్ల కలక సోకడంతో వారిని ఉపాధ్యాయులు ఇండ్లకు పంపించారు. చేవెళ్లలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో 12మందికి కండ్ల కలక రాగా వారందరికి చికిత్స చేయించారు. తల్లిదండ్రులకు సమచారం ఇవ్వడంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఎక్కువ మంది విద్యార్థులు కండ్ల కలకతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఆదిభట్లలోని ఓ కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సుమారు 600మందికి కండ్ల కలక సోకింది. వైద్య సౌకర్యం అందుబాటులో లేక విద్యార్థులను వారి ఇళ్లకు పంపుతున్నారు. కొంగరకలాన్‌లోని మరో కార్పొరేట్‌ బాలికల పాఠశాలలో 300మంది వరకు కండ్ల కలక సోకడంతో విద్యార్థులను ఇంటికి పంపించారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉన్నారు. కండ్ల కలక వచ్చిన విద్యార్థులను వేరుగా ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే పాఠశాలలు, కాలేజీల్లో కండ్ల కలక రావడానికి కారణం ఇది పిల్లల్లో ఎక్కువ వస్తుంది. అదీగాక వారంతా తరగతి గదుల్లో, స్కూలు ఆవరణలు, గ్రౌండ్లలో గుమిగూడినట్టు ఒకచోట ఉంటారు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ త్వరగా వ్యాపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, తరచూ సబ్బుతో కడుక్కోవడం, కండ్లను నలపకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కండ్ల కలకను నివారిం చొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

ఎలా వస్తుంది?

బ్యాక్టీరియా, రసాయనాలు, వైర్‌సల ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి త్వరగా విస్తరిస్తుంది. కండ్ల కలక వచ్చిన వారికి కనీసం మూడు గజాల దూరం పాటించాలి. ఎందుకంటే గాలిద్వారా సైతం బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అలాగే కండ్ల కలక వచ్చిన వారి కళ్లలోకి అదే పనిగా చూసినా వైరస్‌ సోకే ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు.

లక్షణాలివే..

కండ్ల కలక సోకిన వారి కన్ను ఎర్రగా మారుతుంది. కంటి నుంచి నీరు కారడంతో పాటు కను రెప్పలకు వాపు వొస్తుంది. అదే పనిగా ఊసులు తోడుతాయి. నిద్రించినప్పుడు ఊసులు తోడి కను రెప్పలు అంటుకుంటాయి. వ్యాధి తీవ్రతతో కంటి నొప్పి, దురద, మంట వస్తాయి. కంట్లో ఇసుక పడితే కలిగే ఇబ్బందుల మాదిరిగానే కండ్ల కలక వచ్చిన వారికీ ఇబ్బందులు కలుగుతాయి.

చికిత్స.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కండ్ల కలక పీడితులు యాంటీ బయోటిక్‌ ఐ డ్రాప్స్‌, ‘లూబ్రికేటింగ్‌ ఐ డ్రాప్స్‌’ వేసుకోవాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. రెండు గంటలోకోసారి చేతులను సబ్బుతో కడుక్కోవాలి. కండ్లను నలవకుండా ఉండాలి. రోజులో ఒకటి రెండు సార్లు గోరువెచ్చని మంచి నీరు, సబ్బుతో ముఖాన్ని కడుక్కోవాలి. ముఖం తడిగా ఉండకుండా చూసుకోవాలి. కండ్ల కింద తడి లేకుండా ఎప్పటికప్పుడు ఎండిన గుడ్డతో తుడిచేసుకోవాలి. కూలింగ్‌ గ్లాస్‌ వాడాలి. కండ్లు దురద పెడితే నేరుగా చేతితో నలుపుకోకుండా అప్పుడప్పుడు శుభ్రమైన ఎండిన కాటన్‌ క్లాత్‌తో సుతిమొత్తగా రుద్దుకోవాలి. అదే పనిగా కండ్లు నలిస్తే కంటిపై మరింత ఒత్తిడై వ్యాధి తీవ్రం అయి నొప్పి ఎక్కువవుతుంది. మన పరిసరాల్లో(ఆఫీ్‌సలు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ఇంటిలో) ఎవరికైనా కండ్ల కలక వస్తే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు(టవల్స్‌, సబ్బులు, ఇతర వస్తువులు) వాడటం, తాకడం చేయొద్దు. ఒక వేళ తాకితే చేతులను సబ్బుతో కడుక్కోవాలి. కళ్ల కలక వస్తే తప్పనిసరిగా కంటి అద్దాలు ఉపయోగించాలి. కండ్ల కలక సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దీనిని నివారించాలి. వ్యాధి సోకినా పెద్దగా ఆందోళన చెందొద్దు. రాకుండా మాత్రం అన్ని రకాల జాగ్రత్తలూ పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్టే ఆరికట్టవచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలి.

ఆందోళన వద్దు.. జాగ్రత్తపడాలి : డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

కండ్ల కలక సోకితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాతావరణ మార్పులతో ఈ వ్యాధి వానాకాలంలో వస్తూనే ఉంటుంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని నివారణ, చికిత్స సులువే. ప్రతీ ఒక్కరు పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. సొంత వైద్యం చేసుకోకుండా నేత్ర వైద్యులను సంప్రదించాలి. మనిషి అవయవాల్లో కండ్లు ప్రధానమైనవి. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. నేత్ర వైద్యుల సలహా మేరకు కంటి చుక్కలు వేసుకోవాలి. కండ్ల కలక తగ్గకుంటే యాంటీబయోటిక్‌ టాబ్లెట్స్‌ వాడాలి. నిపుణులు సూచించిన మందులే వాడాలి.

Updated Date - 2023-08-02T00:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising