ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటి వెలుగులో కక్కుర్తి

ABN, First Publish Date - 2023-04-28T23:56:35+05:30

వికారాబాద్‌ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి జనవరి 19వ తేదీన శ్రీకారం చుట్టారు. 42 బృందాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామ పంచాయతీలపైనే భోజన భారం

వైద్య బృందాల భోజన ఖర్చులకు రూ.50లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం

అయినా పంచాయతీల్లో భోజన వసతి కల్పించని వైద్యారోగ్య శాఖ అధికారులు

శిబిరాల నిర్వహణ ఖర్చులతో సర్పంచ్‌లపై ఆర్థిక భారం

గ్రామ పంచాయతీల నిధులకు ఎసరు పెడుతున్న ‘కంటి వెలుగు’

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 70 శాతం మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించే వైద్య బృందాలకు రోజూ టిఫిన్‌, భోజనం, అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించినా క్షేత్రస్థాయిలో పంచాయతీలకు అందడం లేదు. దీంతో సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పడం లేదు. మంజూరైన నిధుల్లో చేతివాటం చూపించే క్రమంలోనే శిబిరాలకు హాజరయ్యే బృందాల భోజన ఖర్చు పై సర్పంచ్‌లకు అధికారులు చెప్పడం లేదని స్పష్టమవుతోంది.

వికారాబాద్‌, ఏప్రిల్‌ 28: వికారాబాద్‌ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి జనవరి 19వ తేదీన శ్రీకారం చుట్టారు. 42 బృందాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో మెడికల్‌ ఆఫీసర్‌, ఆప్తమాలజిస్ట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్‌, ఇద్దరు ఆశా వర్కర్లు ఉంటారు. కంటి పరీక్షలు చేసుకునే వారి సంఖ్య ఆధారంగా ఒక్కో బృందంలో 8 నుంచి 10 మంది సభ్యులతో శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇంత వరకూ 60 రోజులు శిబిరాలు నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో 70 శాతం మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి పరీక్షలు నిర్వహించే ప్రత్యేక బృందాలకు రోజూ భోజనం, అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు క్షేత్ర స్థాయిలో కేటాయించలేదు. ఫలితంగా గ్రామాల్లో కంటి పరీక్షల శిబిరాలకు హాజరయ్యే బృందాల్లో కొందరు తమ సొంత ఖర్చులతో భోజనం చేస్తుంటే, మరికొందరు ఇంటి నుంచే భోజనం బాక్సులు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో చురుకుగా వ్యవహరించే సర్పంచ్‌లున్న గ్రామాల్లో మాత్రం కంటి పరీక్షలు నిర్వహించే బృందాలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రెండుసార్లు టీ తదితర వసతులు కల్పిస్తున్నారు. అయితే కంటి వెలుగు నిర్వహణకు తాము పెట్టిన ఖర్చులను పంచాయతీ నిధుల నుంచి క్లెయిమ్‌ చేసుకుంటున్నారు.

జిల్లాకు సుమారు రూ.50లక్షల నిధులు

కంటి పరీక్షలకు వంద రోజుల పాటు 42 బృందాలు తమకు కేటాయించిన షెడ్యూల్‌ ప్రకారం శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేపట్టాలి. కంటి పరీక్షలు నిర్వహించే ఒక్కో బృందంలో 8 నుంచి 10 మందికి రోజూ భోజన సదుపాయం కల్పించేందుకు రూ.1,500 మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లాకు సుమారు రూ.50లక్షల వరకు విడుదల చేసినట్లు తెలిసింది. రోజూ అల్పాహారం, భోజన సదుపాయం కల్పించేందుకు ఒక్కో బృందానికి రోజుకు రూ.1,500 వంతున వైద్య ఆరోగ్య శాఖ చెల్లింపులు చేయాల్సి ఉన్నా పంచాయతీల కు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కంటి పరీక్షలు నిర్వహించే బృందాలకు సర్పంచ్‌లు మొదట భోజన వసతి కల్పించి ఆ తరువాత ఖర్చులను పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలియజేస్తే చెల్లింపులు చేస్తామంటూ చెప్పిన ఆ శాఖ అధికారులు చేతులు దులుపేసుకున్నారు.

ఎంపీడీవోలకూ తెలియజేయలేదు

అయితే భోజన సదుపాయం కల్పించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించిందని, వసతి కల్పించిన సర్పంచులకు చెల్లింపులు చేస్తామంటూ అధికారులు చెప్పక పోవడంతో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల్లో అయోమయం నెలకొంది. కంటివెలుగు శిబిరం నిర్వహించే బృందానికి భోజన వసతి కల్పించే సర్పంచులకు రోజుకు రూ. 1500 వంతున చెల్లించాలి. జనాభా ఆధారంగా ఒక్కో పంచాయతీ పరిధిలో 4 నుంచి 12, పెద్ద పంచాయతీల పరిధిలో 8 నుంచి 12 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.

నిధుల విడుదలపై సర్పంచ్‌లకు సమాచారమే లేదు...

ఓ గ్రామంలో 8 రోజుల పాటు కంటి వెలుగు శిబిరాన్ని నిర్వహించారు. భోజన వసతి మీరే కల్పించాలని శిబిరం బృందం ఆ గ్రామ సర్పంచ్‌కు చెప్పింది. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా భోజన వసతి కల్పించారు. ఎనిమిది రోజులకు ఆ సర్పంచ్‌ రూ.20వేలు ఖర్చు చేశారు. ఆ డబ్బులు వైద్యశాఖ అధికారులు ఇవ్వకపోవడంతో సర్పంచ్‌ వెచ్చించిన భోజన ఖర్చులను గ్రామ పంచాయతీ ఖాతా నుంచి తీసుకున్నారు. ఇలాంటి సంఘటన ఆ ఒక్క పంచాయతీలోనే కాదు.. జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో చోటు చేసుకుంది. కంటి పరీక్షలు చేసే ఒక్కో బృందానికి భోజనానికి రోజుకు రూ.1,500 చెల్లిస్తామని వైద్యశాఖ అధికారులు ముందుగానే చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి నెలకొనేదే కాదు.

గ్రామాల్లో ఇలా.. పట్టణాలో అలా!

జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి కంటి వెలుగు శిబిరాలకు హాజరయ్యే బృందాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిఽధులతో భోజనం పెట్టించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ కౌన్సిలర్లకు తెలియడంతో కంటి వెలుగు బృందాలకు వారు భోజనం పెట్టించడం మానేశారు. మెడికల్‌ అధికారుల ద్వారా రోజూ శిబిరాల బృందాలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ స్నాక్స్‌ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే భోజన వసతి కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం సర్పంచ్‌లకు చెప్పకుండా ఎందుకు దాచారనేది చర్చనీయాంశంగా మారింది. మంజూరైన నిధుల్లో చేతివాటం చూపించే క్రమంలోనే అధికారులు శిబిరాలకు హాజరయ్యే బృందాల భోజనాలకు రోజూ రూ.1,500 ఇస్తామని స్పష్టంగా చెప్పలేదని స్పష్టమవుతోంది.

జాడలేని టెంట్లు

కంటి వెలుగు శిబిరాలు నిర్వహించే చోట టెంట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడా ఏర్పాటు చేయడం లేదు. ప్రారంభం రోజు మినహాయించి మరుసటి రోజు నుంచి జిల్లాలో ఎక్కడ కూడా కంటి వెలుగు శిబిరాల వద్ద టెంట్లు కనిపించడం లేదు. టెంట్‌ ఏర్పాటు చేయడం లేదనే విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నిస్తే అది మా పరిధిలో లేదని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని సెలవిచ్చారు. టెంట్‌ ఏర్పాటు చేసేందుకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది.

నాకు ఎవరూ సమాచారమివ్వలేదు: కుర్వ రాములు, సర్పంచ్‌, చీలాపూర్‌, పూడూరు మండలం

కంటి శిబిరాన్ని నిర్వహించేందుకు వచ్చే డాక్టర్ల బృందానికి భోజన ఖర్చులు మీరే భరించుకోవాలని అఽధికారులు చెప్పారు. మా గ్రామంలో వారికి నేను భోజన వసతి కల్పించాను. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం హోటల్‌ నుంచి తెప్పించాను. టీ మాత్రం ఇంట్లో చేసి ఇచ్చాము. టెంట్‌ కోసం రూ.5వేలు, భోజనాలకు రూ.15వేల వరకు ఖర్చయింది. వైద్య శాఖ నుంచి డబ్బులు ఇస్తామని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. డాక్టర్లకు నేనే సొంతంగా ఖర్చు పెట్టాను.

భోజనాలకు నిధులొచ్చాయి : డాక్టర్‌ పాల్వన్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో వికారాబాద్‌

జిల్లాలో పని చేస్తున్న ఒక్కొక్క కంటి వెలుగు బృందానికి రోజుకు రూ.1,500 భోజనం ఖర్చు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే నిధులు కూడా వచ్చాయి. అయితే పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా వారు చేసిన ఖర్చును వారికి అందించాలని నిర్ణయించాం. ఆ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో మెడికల్‌ అధికారుల ద్వారా భోజన వసతి కల్పిస్తున్నాం. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే పరి ష్కరిస్తాం. మీల్స్‌ బిల్లులు చెల్లించేలా చూస్తాం.

Updated Date - 2023-04-28T23:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising