ఇనుము తిన్నారు?Eat iron?
ABN, First Publish Date - 2023-05-11T23:54:36+05:30
తాండూరులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఉపయోగంలో ఉన్న ఐదు గోదాంలను కూల్చి వేశారు. అయితే ఆ గోదాంలు కూల్చివేయగా లభించిన ఇనుము స్ర్కాప్‌ను మాత్రం మాయం చేశారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ఐదు గోదాంల కూల్చివేత
లక్షల రూపాయల విలువ చేసే ఇనుము స్ర్కాప్ మాయం
అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై విక్రయం?
తాండూరు, మే11 : తాండూరులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఉపయోగంలో ఉన్న ఐదు గోదాంలను కూల్చి వేశారు. అయితే ఆ గోదాంలు కూల్చివేయగా లభించిన ఇనుము స్ర్కాప్‌ను మాత్రం మాయం చేశారు. లభ్యమైన స్ర్కాప్ విలువు లక్షల్లో ఉంటుందని అంచనా. ఆ స్ర్కాప్‌నకు టెండర్లు వేసి విక్రయించారా? లేక వాటిని మున్సిపల్ ఆధీనంలో పెట్టుకోవాల్సి వస్తుందేమోనని వాటిని మాయం చేశారో తెలియడం లేదు. కాగా సంబంధిత కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై వీటిని అమ్ముకున్నట్లు స్థానిక కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో గోదాంలను సివిల్ సప్లయ్ అధికారులకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు అద్దెకు కేటాయించేవారు. ఇప్పటికే తాండూరులో అనుకున్న మేరకు గోదాంలు లేక ధాన్యం, ఉల్లి నిల్వలు వంటివి పెట్టుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న ఈ గోదాంలు, నాలుగు ఎకరాల భూమిని ఇంటిగ్రేడెట్ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపాలిటీకి అప్పగించారు. మున్సిపాలిటీ మాత్రం అక్కడ మార్కెట్ ఏర్పాటు కోసం ఉన్న గోదాంలను కూల్చి వేయగా, లభ్యమైన స్ర్కాప్‌ను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తనకేమి తెలియదంటూ మున్సిపల్ కమిషనర్ శంకర్‌సింగ్ పేర్కొంటున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గోదాంలు కూల్చగా లభ్యమైన పాత ఇనుప సామగ్రిని ఏం చేయాలనే విషయమై అటు మున్సిపల్ పాలకవర్గం దృష్టికి కూడా తీసుకురాకపోవడం విశేషం. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాంలు కూల్చగా లభ్యమైన స్ర్కాప్ ఎంత ఉందో, దాని విలువ ఎంత అనే విషయం కూడా అధికారులు గోప్యంగా ఉంచారు.
అధికారులు, కాంట్రాక్టర్లు అమ్ముకున్నారు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం పాత గోదాంలు కూల్చి వేశారు. దీంతో రూ. లక్షల విలువ చేసే స్ర్కాప్ మెటీరియల్‌ను గుట్టు చప్పుడు కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అమ్ముకున్నారు. ఈ విషయమై కమిషనర్ తనకేమీ తెలియదంటూ దాట వేశారు. మున్సిపల్ డీఈ, కాంట్రాక్లరు మాత్రం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయిన తర్వాత సంబంధిత మెటీరియల్ డబ్బులను మున్సిపల్‌ఖాతాలో జమా చేస్తానని పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విచారణ జరపాలని కోరతాను.
- ప్రభాకర్‌గౌడ్, కౌన్సిలర్, తాండూరు
Updated Date - 2023-05-11T23:54:36+05:30 IST