జిల్లా కోర్టు కుషాయిగూడకు తరలింపు
ABN, First Publish Date - 2023-07-11T00:09:42+05:30
మల్కాజిగిరి జిల్లా కోర్టు కొద్దిరోజుల్లోనే తాత్కాలికంగా కుషాయిగూడకు తరలనుంది. ప్రస్తుతం జిల్లా కోర్టు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయం పక్కన అద్దె భవనంలో కొనసాగుతోంది.
‘ఆపెల్’ భవనంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
కక్షీదారులకు తగ్గనున్న దూరభారం
కుషాయిగూడ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి జిల్లా కోర్టు కొద్దిరోజుల్లోనే తాత్కాలికంగా కుషాయిగూడకు తరలనుంది. ప్రస్తుతం జిల్లా కోర్టు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయం పక్కన అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే జిల్లా కోర్టుకు పక్కా భవనాల సముదాయాన్ని ఓల్డ్ నేరేడ్‌మెట్‌లోని డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) ఆవరణలో నిర్మించేందుకు రూ.90కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఈ నిర్మాణ పనులు ప్రారంభమై భవనాల సముదాయం పూర్తయ్యేందుకు కనీసం మూడు, నాలుగేళ్ల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కోర్టుల సముదాయ ఏర్పాటుకు జిల్లా నడిబొడ్డున ఉండేలా ఈసీఐఎల్ చౌరస్తా ప్రాంతాన్ని అధికారులు ఎంపిక చేశారు. కుషాయిగూడ పారిశ్రామిక వాడలో మూడు దశాబ్ధాల క్రితం వరకు విస్తృతసేవలందించిన ఆంధ్రప్రదేశ్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ (ఆపెల్) సంస్థకు చెందిన భవనం వృథాగా ఉండడంతో దానిలో జిల్లా కోర్టును ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజులుగా భవనం మరమ్మతులు, పెయింటింగ్, రోడ్లు, మరుగుదొడ్లు, విద్యుత్, చెట్ల కొమ్మల తొలగింపు వంటి మౌలిక సదుపాయాల కోసం టీఎ్‌సఐఐసీతో పాటు వివిధ విభాగాల అధికార సిబ్బంది ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 20వ తేదీ లోగా కోర్టు భవనాన్ని ప్రారంభించాలని, నెలాఖరులోగా పూర్తి స్థాయిలో కోర్టులను తరలించి అన్ని కేసుల విచారణ ఇక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలనే స్పష్టమైన ఆదేశాలతో పనులు చకచకా సాగుతున్నాయి. నిత్యం వివిధ కేసుల్లో వచ్చే వేలాది మంది కక్షీదారులకు కుషాయిగూడలో ఏర్పాటు చేస్తున్న ఈ కోర్టు సముదాయం మూలంగా దూరాభారం తగ్గనుందని పలువురు పేర్కొంటున్నారు.
Updated Date - 2023-07-11T00:09:42+05:30 IST