పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు!
ABN, First Publish Date - 2023-07-07T22:57:44+05:30
గ్రామ పంచాయతీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీలను యూపీఐ గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు చేపట్టింది. పట్టణాల్లో అమలవుతున్న విధంగా పంచాయతీల్లోనూ విస్తృతంగా నగదు రహిత లావాదేవీలు కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది.
యూపీఐ ఆధారిత సేవలు పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు
ఆగస్టు 15 తరువాత అన్ని పంచాయతీల్లో అమలు చేసేందుకు సన్నాహాలు
గ్రామ పంచాయతీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీలను యూపీఐ గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు చేపట్టింది. పట్టణాల్లో అమలవుతున్న విధంగా పంచాయతీల్లోనూ విస్తృతంగా నగదు రహిత లావాదేవీలు కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది.
వికారాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లలో డిజిటల్ చెల్లింపుల విధానం అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈఏడాది ఆగస్టు 15వ తేదీ తరువాత అన్ని గ్రామ పంచాయతీలను యూపీఐ వినియోగ పంచాయతీలుగా ప్రకటించాలని భావిస్తోంది. వికారాబాద్ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నగదు రహిత లావాదేవీలు పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించాయి. గతంతో పోలిస్తే గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులు పంచాయతీల్లో పెరిగాయి. టీస్టాల్ నుంచి పెద్ద దుకాణాల వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగాయి. ప్రస్తుతం చాలా వరకు అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీల్లో కూడా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ సేవలను అమల్లోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపులు...
జిల్లాలో కొన్ని పంచాయతీల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు కొనసాగుతున్నాయి. ప్రజలు పన్నుల వసూళ్లు, నిర్మాణాల అనుమతులు, జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ వంటి సేవలను యూపీఐ ఆధారిత చెల్లింపుల ద్వారా పొందే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన టీ-యాప్ ద్వారా పన్నులు, ఫీజుల వసూళ్లను సంబంధిత అధికారులు ప్రోత్సహిస్తున్నారు. వాణిజ్య, వ్యాపార దుకాణాలకు సంబంధించిన లైసెన్స్, ఇతర అనుమతుల ఫీజుల వసూళ్లకు డిజిటల్ చెల్లింపుల విధానం వినియోగించుకునే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో యూపీఐ ఆధారిత చెల్లింపులు కొనసాగేందుకు వీలుగా సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ ఆధారిత చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు.
పెరగనున్న పారదర్శకత...
జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే నగదు రహిత సేవలు అమలవుతున్నాయి. మీ సేవ కేంద్రాల ద్వారా, ఖాతాల్లో జమ చేస్తున్నారు. యూపీఐ ఆధారిత చెల్లింపులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పంచాయతీల్లో పారదర్శకత పెరగనుంది.
Updated Date - 2023-07-07T22:57:44+05:30 IST