ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలపై గళమెత్తేనా?

ABN, First Publish Date - 2023-08-02T22:39:17+05:30

నేటి నుంచి వర్షాలకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బుధవారం నుంచి కొనసాగనున్న ఈ సమావేశాలపై వికారాబాద్‌ జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగే సమావేశాలు కావడంతో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా జిల్లాకు ఎలాంటి వరాలు కురిపిస్తారోనని ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే అసెంబ్లీలో జిల్లా, నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వచ్చి స్పష్టమైన హామీ పొందేలా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ గళం వినిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

పెండింగ్‌ సమస్యలు చర్చకొచ్చేనా ?

జిల్లాకు వరాలు కురిపిస్తారా..లేక మమ అనిపించేస్తారా..?!

నేటి నుంచి వర్షాలకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బుధవారం నుంచి కొనసాగనున్న ఈ సమావేశాలపై వికారాబాద్‌ జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగే సమావేశాలు కావడంతో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా జిల్లాకు ఎలాంటి వరాలు కురిపిస్తారోనని ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే అసెంబ్లీలో జిల్లా, నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వచ్చి స్పష్టమైన హామీ పొందేలా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ గళం వినిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వికారాబాద్‌, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం కనబరిచే కేసీఆర్‌ జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రకటన చేస్తారని ఆఽశతో ఉన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి తన వద్ద బృహత్తర ప్రణాళిక ఉందని పేర్కొనే సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక, ఉపాధి రంగాల పరంగా జిల్లాకు ఈ సమావేశాల్లో వరాలు కురిపించవచ్చని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సమయం, సందర్భం లభించినప్పుడు అనంతగిరి కొండల ప్రశస్థాన్ని వేనోళ్ల కొనియాడుతూ జిల్లా పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకునే సీఎం కేసీఆర్‌ జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేయకపోతారా అని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మినహా జిల్లాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తీసుకు వచ్చిన కార్యక్రమాలు లేవని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌ తదితర జిల్లాలతో పోలిస్తే.. మౌలిక సదుపాయాల కల్పన పరంగా అభివృద్ధి పనుల్లో మనమెంత వెనకబడి ఉన్నామనేది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గుర్తించాలని ప్రజలు సూచిస్తున్నారు. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన లక్ష రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. రూ.50 వేల వరకు అమలుకు ఆదేశించగా, వారిలో కొందరికే రుణమాఫీ వర్తించింది. అసెంబ్లీ సమావేశాల్లోనైనా సీఎం కేసీఆర్‌ రూ. లక్ష రుణమాఫీ పూర్తిగా వర్తించేలా ప్రకటన చేస్తారేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

అనంతగిరి పర్యాటక కేంద్రం ప్రకటనలకే పరిమితం

గత ఎన్నికల సమయంలో వికారాబాద్‌కు వచ్చిన కేసీఆర్‌ అనంతగిరిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్‌ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. వారాంతాల్లో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టును వేలాది మంది సందర్శకులు సందర్శిస్తుంటారు. కోట్‌పల్లి ప్రాజెక్టును మరో లక్నవరంగా, అనంతగిరి కొండలను పర్యాటకపరంగా అభివృద్ధి పరిచేందుకు అవకాశాలు పుష్పలంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అనంతగిరిని పర్యాటక పరంగా ఎంతో అభివృద్ది పరిచేందుకు అవకాశాలు ఉన్నా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత వ్యాలీ రిసార్ట్‌ నిర్మాణం చేపట్టి చేతులు దులుపేసుకుంది. ప్రతిపాదించిన జంగిల్‌ రిసార్ట్స్‌, అడ్వంచర్‌పార్క్‌, ఎకో టూరిజం వంటి నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. జిల్లాకు మణిహారంగా భావించే అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇంతకు ముందు జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన దివ్యా దేవరాజన్‌, సయ్యద్‌ ఒమర్‌జలీల్‌, ఆయేషామస్రత్‌ఖానమ్‌ ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకుండాపోయింది. మూడేళ్ల కిందట రాష్ట్ర మంత్రులు సబితారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ అనంతగిరిని సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.

కలగానే పాలమూరు ఎత్తిపోతల జలాలు..

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికారాబాద్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామన్న కేసీఆర్‌ హామీ కార్యరూపం దాల్చడానికి మరింత సమయం పట్టనుంది. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా పూర్తి చేసి జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లాలో సాగునీటి వనరులైన కోట్‌పల్లి, లక్నాపూర్‌, నందివాగు ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకీకరణ పనులకు నిధులు కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరిన కాలువలకు మరమ్మతులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది. చిన్న చిన్న ప్రాజెక్టుల విషయం ఎలా ఉన్నా జిల్లాలో ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోట్‌పల్లికి కూడా నిధులు కేటాయించకపోవడం గమనార్హం.

కొంత ఊరట...

జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఆ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగడం ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న వికారాబాద్‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.96 కోట్లు మంజూరు చేసింది. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌, గురుకుల, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలలకు స్వంత భవనాలు, మునిసిపాలిటీల్లో సుందరీకరణ పనులు మినహా చెప్పుకోదగ్గ ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. పారిశ్రామిక పరంగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయి. స్థానికంగా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో పక్కనే ఉన్న రాష్ట్ర రాజధానికి వెళ్లాల్సి వస్తోంది. ఇతర జిల్లాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పక్కనే ఉన్న వికారాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. శిథిలమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టలేకపోతున్నారే ఆరోపణలు ఉన్నాయి. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. లక్ష రూపాయల సాయం చేస్తామన్న కేసీఆర్‌ ప్రకటన ఇంత వరకు సాకారం కాలేదని రైతులు ఽఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలపై గళమెత్తేనా...?

జిల్లా సమస్యలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఆశించిన స్థాయిలో తమ గళాన్ని వినిపించలేక పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడంతో తమ నియోజకవర్గ, జిల్లా సమస్యలను సభలో ప్రస్తావిస్తే తమ ప్రభుత్వాన్ని తామే ఇరుకున పెట్టిన వారమవుతామని వారు భావించడమే కారణమని తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే అసెంబ్లీలో జిల్లా, నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వచ్చి స్పష్టమైన హామీ పొందేలా ఎంఎల్‌సీ, ఎమ్మెల్యేలు తమ గళం వినిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ప్రజా, ప్రాంత సమస్యలను సభలో ప్రస్తావిస్తారా, లేక మౌనంగా ఉంటారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇండస్ర్టీల ఏర్పాటుపై ప్రస్తావిస్తా

కొడంగల్‌ : నిరుద్యోగ యువత, ఉపాధి కోసం, వెనకబడిన కొడంగల్‌ నియోజకవర్గంలో ఇండస్ర్టీయల్‌ ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్వావిస్తా. కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు వ్యవసాయమే జీవనధారంగా జీవనం కొనసాగిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో ఇండస్ర్టీయల్‌ను ఏర్పాటు చేస్తే యువత ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగు, తాగునీరందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. గత అసెంబ్లీ సమావేశాల్లో దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇతరాత్ర వాటి గురించి ప్రస్తావించగా మంజూరుతో సమస్య పరిష్కారమైంది.

ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి , కొడంగల్‌

పరిగి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

పరిగి: పరిగి నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతా. నియోజకవరంలో కొన్ని కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాల్సి ఉంది వాటి గురించి అడుగుతా. పాలమూరు-రంగారెడ్డి మంజూరైంది. అయితే పనులు ప్రారంభించి వేగవంతం చేయాలని కోరుతా. డిగ్రీ కాలేజీకి సొంతభవనం. ఆధ్యాపకుల నియమాకం, అన్ని విద్యాసంస్థలకు సొంత భవనాల గురించి ప్రస్తావిస్తా. నియోజకవర్గంలోని వివిధ రోడ్లకు నిధులు కేటాయించాలని కోరతా.

-పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి

Updated Date - 2023-08-02T22:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising