ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిట్లు సరే.. పైసలేవీ?

ABN, First Publish Date - 2023-06-08T00:25:16+05:30

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకం గాడి తప్పుతోంది. సర్కార్‌ దవాఖానాల్లో డెలివరీ చేయించుకున్న మహిళలకు కిట్లు, నగదు ప్రోత్సాహం అందించాలని సర్కార్‌ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మఒడి పథకానికి వేధిస్తున్న నిధుల కొరత

గర్భిణులు, బాలింతలకు అందని ఆర్థిక సాయం

జిల్లాలో గాడి తప్పుతున్న అమ్మఒడి పథకం

కిట్‌ వరకే పరిమితం, అందని నగదు

మూడేళ్లుగా రూ.39కోట్లు ప్రోత్సాహకం పెండింగ్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకం గాడి తప్పుతోంది. సర్కార్‌ దవాఖానాల్లో డెలివరీ చేయించుకున్న మహిళలకు కిట్లు, నగదు ప్రోత్సాహం అందించాలని సర్కార్‌ నిర్ణయించింది. కానీ చాలాచోట్ల కిట్లు మాత్రమే ఇచ్చి, డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో లబ్ధిదారులు నగదు కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 7 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అమలుపై అయోమయం నెలకొంది. జిల్లాలో ఈ పథకం అమలవుతున్నా.. ప్రసూతి మహిళల అకౌంట్‌లో నగదు ప్రోత్సాహకం జమ కావడం లేదు. బాలింతలకు అండగా నిలిచే అమ్మఒడి పథకానికి నిధుల కొరత వేధిస్తుంది. దీంతో ప్రోత్సాహకపు సొమ్ము లబ్ధిదారులకు అందటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన కొందరు తల్లులు నగదు ప్రోత్సాహకం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. బాలింతగా ఉన్నప్పుడు అందాల్సిన సాయం.. కొందరికి మూడేళ్లవుతున్నా అందటం లేదు. జిల్లాలో 32,500 మంది లబ్ధిదారులు నగదు ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. పేద గర్భిణులకు అమ్మఒడి పథకం ఆర్థికంగా తోడ్పాటునందిస్తుందని భారీగా ప్రచారం చేసిన ప్రభుత్వం.. కేసీఆర్‌ కిట్లను మాత్రమే అందించి ఇంటికి పంపుతున్నారు. నగదు ప్రోత్సాహం మాత్రం అందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిధుల కొరతను అధిగమించి లబ్ధిదారులకు చెందాల్సిన నగదును వారి ఖాతాలో జమ చేయాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

గాడి తప్పుతున్న పథకం

అమ్మఒడి పథకానికి ముందు జిల్లాలో ఇంటి ప్రసవాలు ఎక్కువగా జరిగేవి. దీనివల్ల తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు ఎక్కువగా ఉండేది. కేసీఆర్‌ కిట్‌ పథకంలో ప్రోత్సాహక నగదుతో పాటు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందటంతో చాలామంది ప్రభుత్వాసుపత్రుల బాట పట్టారు. కొంతకాలం వరకు బాగానే నడిచిన ఈ పథకం ఏడాదిగా గాడి తప్పింది. ఐదు నెలలుగా లబ్ధిదారులకు కిట్‌ మాత్రమే ఇస్తూ.. నగదు ప్రోత్సాహకంలో జాప్యం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం నగదు ప్రోత్సాహకం రూ.39కోట్లు, 32,500మంది గర్భిణులు, బాలింతలకు అందాల్సి ఉంది.

విడతల వారీగా ఇలా..

బిడ్డ కడుపులో పడిన క్షణం నుంచి ప్రసవమైన అనంతరం చిన్నారికి ఇంజక్షన్లు వేసే వరకు విడతల వారీగా డబ్బులు బాలింతకు రావాలి. జిల్లాకు మూడేళ్లుగా అమ్మఒడి పథకం నిధులు రావడం లేదు. కొందరికి పిల్లలు పుట్టి రెండేళ్లు గడిచిపోతున్నా ప్రోత్సాక నగదు పూర్తి స్థాయిలో అందలేదు. మరికొందరికి ఒకటి, రెండు విడతల్లో మాత్రమే వచ్చాయి. అమ్మాయికి రూ.13వేలు, అబ్బాయికి రూ.12వేల చొప్పున అందించే ఆర్థిక సాయం, నాలుగు విడతల్లో ఇస్తారు. గర్భం దాల్చిన మూడు నెలల అనంతరం మహిళ స్థానిక పీహెచ్‌సీలో పరీక్షలు చేసుకుని పేరు నమోదు చేసుకుంటే మొదటి విడతగా రూ.3వేలు, ఐదు నెలలు నిండే సరికి రెండుసార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుంటే రూ.5వేలు ఆ మహిళా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. జన్మించిన శిశువుకు నాలుగు నెలల్లో మూడు టీకాలు పూర్తయిన అనంతరం రూ.2వేలు, తొమ్మిది నెలలు టీకా ఇచ్చాక రూ.3వేలు అందజేస్తారు.

‘కిట్‌’ వరకే పరిమితం

జూన్‌ 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైన మహిళలకు 16 వస్తువులతో కూడిన ఈ కిట్‌ను అందజేస్తారు. డెలివరీ సమయంలో కేసీఆర్‌ కిట్‌ (డైపర్లు, నాప్కిన్స్‌, టోయ్స్‌, దోమతెరలు, బేబీపౌడర్‌, బేబీ ఆయిల్‌, బేబీసోపులు, శారీలు, టవల్‌, షాంపు, పిల్లలకు కావాల్సిన బట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌ తదితర వస్తువులు) ఇస్తున్నారు. కానీ.. నగదు ప్రోత్సాహకం ఇవ్వడం మరిచారు.

హెల్త్‌, ఆశా, ఏఎన్‌ఎంలను నిలదీస్తున్న మహిళలు

ప్రభుత్వం అమ్మఒడి పథకానికి నిధులను విడుదల చేయక పోవడంతో ఆ పథకం అమలు, తీరుతెన్నులు పరిశీలిస్తున్న హెల్త్‌ వర్కర్స్‌, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎందుకంటే గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేది వాళ్లే కావడంతో.. డబ్బులు రాకుంటే వారిని నిలదీస్తున్నారు. మాకు ఎందుకు డబ్బులు జమ కావడం లేదు.. ఏదైనా పొరపాటుగా ఎంటర్‌ చేశారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఆశా వర్కర్లే తమకు కేసీఆర్‌ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మండి పడుతున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితితులు ఇలా ఉంటే ఈ పథకం కిట్‌ల పంపిణీ వరకే పరిమితమా లేక నగదు జమ చేస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

కిట్టు ఇచ్చారు... డబ్బులు ఇవ్వలేదు

రెండేళ్ల క్రితం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వెళ్లాను. ఆసుపత్రిలో రెండో కాన్పులో బాబుకు జన్మనివ్వడంతో డిశ్చార్జి అయ్యే సమయంలో వైద్యులు కేసీఆర్‌ కిట్టు ఇచ్చారు. డబ్బులు బ్యాంకులో జమ చేస్తామని, అకౌంట్‌ వివరాలు తీసుకున్నారు. రెండేళ్లు దాటి పోతున్నా నేటికీ బ్యాంకులో డబ్బులు జమ కాలేదు. ఇప్పటికే ఎన్నోమార్లు వైద్యులను సంప్రదించాను. ఆశా, హెల్త్‌వర్కర్‌, ఏఎన్‌ఎమ్‌ను అడిగాను. డబ్బులు వస్తాయని చెబుతున్నారు. కానీ.. ఎప్పుడు వస్తాయో క్లారిటీ ఇవ్వడం లేదు.

జె. శ్రీలత, చేవెళ్ల

వస్తదనే నమ్మకం పోయింది

నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2022 ఏప్రిల్‌ 20న పాప పుట్టింది. ఆ సమయంలో వైద్యులు కేసీఆర్‌ కిట్టును అందించారు. బ్యాంకు అకౌంట్‌ వివరాలు తీసుకున్నారు. బ్యాంకులో ఆర్థిక ప్రోత్సాహకం జమ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చిల్లీగవ్వ కూడా రాలేదు. ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకం వస్తదనే నమ్మకం పోయింది.

పిట్ల స్వప్న, తుమ్మలపల్లి

ఏడాదిగా ఎదురు చూస్తున్న

గత ఏడాది చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పాప పుట్టింది. కేసీఆర్‌ కిట్‌ ఇచ్చారు. కానీ.. డబ్బులు ఇవ్వలేదు. బ్యాంకులో విడతల వారీగా జమ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి కూడా జమ కాలేదు. నగదు ప్రోత్సాహ సాయం అందించి పేదలను ఆదుకోవాలి.

మాఊరిగారి లావణ్య, తుమ్మలపల్లి

ఇప్పటి వరకు రాలేదు

మేము షాద్‌నగర్‌లోని క్రిష్టియన్‌ కాలనీలో నివాసముంటాం. జూన్‌ 19, 2022న హైదరాబాద్‌ జీహెచ్‌ఎంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చాను. కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.13 వేలు నగదు ప్రోత్సాహం ఇప్పటి వరకు రాలేదు. వైద్యాధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేసినపుడు ఖాతాలో జమ చేస్తామంటున్నారు.

పార్వతమ్మ, షాద్‌నగర్‌

Updated Date - 2023-06-08T00:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising