అదృశ్యమైన యువకుడి దారుణ హత్య
ABN, First Publish Date - 2023-07-21T00:24:52+05:30
అదృశ్యమైన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కాగా, ప్రేమ వ్యవహారమే అతడి హత్యకు దారితీసింది. ఈమేరకు 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ప్రేమ వ్యవహారమే కారణం
నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ఇద్దరు మైనర్లు
వివరాలు వెల్లడించిన శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి
కొత్తూర్, జూలై 20(ఆంధ్రజ్యోతి) : అదృశ్యమైన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కాగా, ప్రేమ వ్యవహారమే అతడి హత్యకు దారితీసింది. ఈమేరకు 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. బిహార్‌కు చెందిన రాజ్‌కఫిల్ సాహు(20) అనే యువకుడు రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మున్సిపాలిటీలోని స్టేషన్ తిమ్మాపూర్‌లో నివాసం ఉంటూ హెచ్‌ఐఎల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో బిహార్‌కు చెందిన ఓ యువతి కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. అయితే, రాజ్‌కఫిల్ సాహు ఆ యువతిని ప్రేమిస్తుండగా.. కొత్తూర్‌లో నివాసం ఉంటున్న మరో యువకుడు బిహార్‌కు చెందిన రాహుల్‌సింగ్(21) కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు. దీంతో ఆ యువతి తనకు దక్కదనే ఉద్ధేశ్యంతో రాజ్‌కఫిల్ సాహును హంతమొందించాలని రాహుల్‌సింగ్ తన స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఈనెల 18న సాయంత్రం రాహుల్‌సింగ్ తన స్నేహితులతో కలిసి స్టేషన్ తిమ్మాపూర్‌కు చేరుకుని సాహును కలిసి విందు చేసుకుందామని చెప్పాడు. అనంతరం తిమ్మాపూర్ పరిసరాల్లో ఉన్న ఓ వెంచర్ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ అందరు కలిసి మద్యం సేవించారు. ఈక్రమంలో స్రాహును రాహుల్‌సింగ్‌తో పాటు అతడి స్నేహితులు బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఆనంతరం బండరాయితో తలపై మోది హత్యచేసి మృతదేహంపై మట్టిని కప్పేసి పారిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన సాహు తిరిగి రాకపోవడంతో తోటి కార్మికులు కాంట్రాక్టర్ సోనుకుమార్‌కు సమాచారం అందించారు. దీంతో బుధవారం సోనుకుమార్ కొత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి సాహు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి జనసాయి రియల్‌వెంచర్‌లో గుర్తుతెలియని యువకుడు హత్యకు గురైనట్లు తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి సాహుగా గుర్తించారు. వెంటనే సాహు తోటి కార్మికుల సమాచారం మేరకు పోలీసులు అదే రోజు రాత్రి రాహుల్‌సింగ్‌ను తిమ్మాపూర్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. నిందితులైన రాహుల్‌సింగ్, మహ్మద్ తాహేర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని బాలనేరుస్థుల శిక్షణాలయానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. 24గంటల్లో హత్య కేసు ఛేదించిన ఇన్‌స్పెక్టర్ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ శంకర్, ఏఎస్‌ఐ అబ్దుల్లాతో పాటు సిబ్బందిని డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూర్ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:24:52+05:30 IST