ప్రగతిబాటలో తుక్కుగూడ
ABN, First Publish Date - 2023-09-22T22:36:22+05:30
మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రగతిబాటలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం, సెప్టెంబరు 22 : మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రగతిబాటలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీ లోని 6 వ వార్డులోని ప్రజయ్ వెంచర్ వద్ధ రూ. 45 లక్షలతో చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక చొరవతో తుక్కుగూడ ప్రాంతంలో అనేక రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు తరలి రావడంతో మున్సిపాలిటీ పరిశ్రమల హబ్‌గా తయారవుతుందన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు పరుస్తూ పట్టణాలను, పల్లెలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు. నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నాళాలు, తాగునీరు సమస్యల పరిష్కారం కోసం రూ. 320 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అదే విధంగా మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నామన్నారు. రూ. 40 కోట్లతో 11 చెరువులను సుందరీకరణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలోని పురాతన బురుజు ఆధునీకరణకు రూ.25 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు సప్పిటి లావణ్యరాజు, భావన, హేమలత, సుమన్, తేజశ్విని శ్రీకాంత్, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, నాయకులు సామేల్‌రాజు, పి.సురేష్, యు.శ్రీనివాస్, పద్మ, శ్రీలత, మున్సిపల్ కమిషనర్ వెంకట్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T22:36:22+05:30 IST