మైనార్టీలకు 100శాతం సబ్సిడీతో రుణాలు
ABN, First Publish Date - 2023-07-24T00:00:05+05:30
మైనార్టీలకు 100శాతం సబ్సీడీతో కూడిన పథకానికి సంబంధించి జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.
జీవో జారీ చేసిన ప్రభుత్వం
జిల్లా స్థాయిలో కమిటీలు
గతేడాది దరఖాస్తు చేసుకున్న వారికీ వర్తింపు
తాండూరు, జూలై 23: మైనార్టీలకు 100శాతం సబ్సీడీతో కూడిన పథకానికి సంబంధించి జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. గతంలో దరఖాస్తు పెట్టుకొని పెండింగ్‌లో ఉన్న మైనార్టీలకు ఈ ఆర్థిక సంవత్సరం చేయూతను అందిచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం సెలవురోజు అయినప్పటికీ ప్రత్యేక జీవోను జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు అందించాలని నిర్ణయించింది. బీసీ బంధు మాదిరిగానే మైనార్టీలకు కూడా రూ.లక్ష అర్హులైన మైనార్టీలకు 100శాతం సబ్సీడీతో రుణాన్ని అందించనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. గతంలో బీసీ బంధు కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మూడేళ్లుగా మైనార్టీ కార్పోరేషన్ సంబంధించి నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రుణాలు రాక పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం జారీ చేసిన జీవోలో గతంలో దరఖాస్తు చేసుకొని పెండింగ్‌లో ఉన్న వాటికీ ఈ ఆర్థిక సంవత్సరం అందించే రుణాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 100శాతం సబ్సీడీతో రూ.లక్ష ఆర్థికసాయాన్ని పొందేందుకు మోక్షం లభించనుంది. గతంలో 50-60 మాత్రమే ఒక నియోజకవర్గానికి మైనార్టీ రుణాలు మంజూరయ్యే ఛాన్స్ ఉండేది. ప్రస్తుతం మంజూరయ్యే మైనార్టీ రుణాలకు ఎలాంటి నిబంధన విధించలేదు. కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాలలో రూ.1.5లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.2లక్షల ఆదాయానికి పరిమితం చేశారు. ముస్లింలతోపాటు క్రిస్టియన్‌లకూ ఈ రుణాలను అందించనున్నారు. టీఎస్‌ఎంఎఫ్‌సీ వెబ్‌సైట్‌లో నమోదు చేయవలసి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులను పరిగణలోని తీసుకొని సబ్సిడీని ఒకేసారి విడుదల చేస్తారు.
Updated Date - 2023-07-24T00:00:05+05:30 IST