ప్రైవేటు పీజీ వైద్య విద్య ఫీజులు రెట్టింపు!
ABN, First Publish Date - 2023-08-05T02:49:00+05:30
ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ పీజీ సీట్ల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది.
జీవో జారీ చేసిన ప్రభుత్వం
భారీగా పెంచుతూ సర్కార్ జీవో జారీ
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ పీజీ సీట్ల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది. కన్వీనర్ కోటా ఫీజును రూ.7లక్షలకు, మేనేజ్‌మెంట్ కోటాలో బీ కేటగిరీ సీటు ఫీజును రూ.23 లక్షలకు పెంచింది. బీ కేటగిరీ సీటుకు మూడింతలు సీ కేటగిరీ సీటుకు వసూలు చేసుకోవచ్చని జీవోలో పేర్కొంది. డెంటల్ పీజీ సీట్ల ఫీజులను కూడా పెంచింది. ఇందులో కన్వీనర్ కోటాకు రూ.6 లక్షలకు, మేనేజ్‌మెంట్ కోటా బీ కేటగిరీ సీటుకు రూ.10 లక్షలకు పెంచింది. ఈ మేరకు గత నెల 28నే సర్కారు జీవో ఇచ్చింది. అయితే దీన్ని బయటకు విడుదల చేయలేదు. 2020లో కూడా ప్రభుత్వం ఇదే విధంగా ఫీజులను పెంచి ఉత్తర్వులు ఇచ్చింది. దానిపై వైద్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది. ఫీజుల పెంపుపై స్టే ఇచ్చింది. పెంచిన ఫీజుల్లో సగం మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. తాజాగా మరోసారి పాత జీవోనే తేదీలు మార్చి విడుదల చేసినట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫీజులన్నీ రెట్టింపు అయ్యాయని అంటున్నారు.
Updated Date - 2023-08-05T02:49:00+05:30 IST