Pravalika Case : ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్.. అసలేం జరిగిందో వీడియోల్లో..!
ABN, First Publish Date - 2023-10-18T04:22:01+05:30
ప్రవళిక సూసైడ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గ్రూప్స్ వల్లే ఆత్మహత్య అని కొందరు.. యువకుడి వేధింపులతో అని మరికొందరు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలేం జరిగిందో క్లియర్ కట్‌గా తేలింది. ఇదొక బిగ్ ట్విస్టే అని చెప్పుకోవచ్చు..
హాస్టల్‌కు వెళ్లేవాడు.. ఫోన్ చేసి సతాయించేవాడు
ఆమె చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలి
మా బిడ్డ బలవన్మరణాన్ని రాజకీయం చేయొద్దు
ఏమైనా రాజకీయాలుంటే పార్టీలే చూసుకోవాలి
పరామర్శలు, ప్రశ్నలతో మమ్మల్ని వేధించొద్దు
ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ విజ్ఞప్తి
వేర్వేరుగా వీడియోలు విడుదల చేసిన వైనం
నర్సంపేట/నర్సంపేట టౌన్, వరంగల్, అక్టోబరు 17: హైదరాబాద్‌లో శివరామ్ అనే యువకుడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తమ బిడ్డ చావును రాజకీయం చేయవద్దని కోరారు. ఏమైనా రాజకీయాలు ఉంటే పార్టీలే చూసుకోవాలని, బిడ్డను కోల్పోయిన దుఃఖంలో తాము ఉన్నామని.. పరామర్శలతో, ప్రశ్నలతో తమను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ వేర్వేరు వీడియోలను విడుదల చేశారు. తాను గ్రామంలో కూలీ పనులకు వెళ్తానని.. తన పిల్లలు ప్రవళిక, ప్రణయ్‌కు మంచి చదువులు చెప్పించేందుకు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు పంపినట్లు వీడియోలో విజయ తెలిపింది.
ప్రవళిక అక్కడ చదువుకుంటున్నప్పుడే ఆమెను ఓ యువకుడు వేధించాడని, అది భరించలేక, తమకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. తమ బిడ్డను టార్చర్ చేసి, ఆమె మరణానికి కారణమైన సదరు యువకుడికి ఉరిశిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఉద్యోగం చేసుకుని బాగుంటుందని ఆశిస్తే, ఆత్మహత్యకు పాల్పడి తమకు కడుపుకోత మిగిల్చిందని, ఇటువంటి బాధ ఎవరికీ రావొద్దని కన్నీటిపర్యంతమైంది. కాగా ప్రవళికకు శివరామ్ అనే యువకుడు ఆమె స్నేహితురాలితో పరిచయమై తరుచూ మాట్లాడాలంటూ వేధించాడని వీడియోలో ప్రణయ్ చెప్పాడు. చదువుకునే సమయంలో హాస్టల్‌కు రావడంతో పాటు తరుచూ ఫోన్ చేసి వేధించేవాడని పేర్కొన్నాడు. అక్కకు న్యాయం జరగాలంటే ఆమె చనిపోయిన విధంగానే శివరామ్‌కు ఉరివేయడమో, ఎన్‌కౌంటర్ చేయడమో చేయాలని వీడియో లో కోరాడు. కాగా ప్రవళిక తల్లి, సోదరుడి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. స్వగ్రామంలో ప్రవళిక 5వ రోజు కార్యక్రమం పూర్తయ్యాక గ్రామ సమీపంలోని పురోహితుడి వద్దకు వెళ్తున్నామంటూ విజయ, ప్రణయ్ ఓ కారులో వెళ్లిపోయారు.
బుధవారం రామప్పలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ సభకు ప్రవళిక కుటుంబాన్ని తీసుకెళ్తామని ఆ పార్టీ నేతలు ఇటీవల ప్రవళిక తల్లిదండ్రులకు పరామర్శ సందర్భం గా మాటిచ్చారు. తాజా పరిణామాలతో ప్రవళిక కుటుంబసభ్యులు సభకు వెళ్తారా? లేదా? అన్నది చూడాలి. ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించడానికి మంగళవారం ఆమె స్వగ్రామం బిక్కాజిపల్లికి వెళ్లాలని బీజేపీ బృందం భావించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వారిని పరామర్శిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. అయితే మంగళవారం ఇంటివద్ద ప్రవళిక కుటుంబ సభ్యులు అందుబాటులో లేరన్న సమాచారం తెలుసుకొని పరామర్శ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అనివార్య కారణాలతో పరామర్శను వాయిదా వేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
శివరామ్ కోసం ముమ్మర గాలింపు: ఏసీపీ
ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతడిని పట్టుకోడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏసీపీ మీడియాతో మాట్లాడారు. ప్రవళిక ఆత్మహత్య విషయంలో శివరామ్‌పై 417, 420, 306 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
Updated Date - 2023-10-18T09:31:42+05:30 IST