మీ చర్యల్ని బట్టే మా నిర్ణయం
ABN, First Publish Date - 2023-06-26T03:02:23+05:30
బీజేపీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ముదిరిపాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ కుటుం బం పట్ల ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు నేతలు తాడో పేడో తేల్చుకునే దిశగానే అడుగులు వేస్తున్న ట్లు తెలుస్తోంది.....
కేసీఆర్‌ను గద్దె దించేందుకే బీజేపీలో చేరాం
చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనమేంటి?
తెలంగాణ ప్రజల నాడి బీజేపీకి తెలియదు
బీజేపీ కొంత పోటీ ఇవ్వగలదేమోగానీ అధికారం మాత్రం కష్టం
అమిత్ షాకు స్పష్టం చేసిన ఈటల, రాజగోపాల్‌రెడ్డి
పట్టించుకోకపోతే నా దారి చూసుకుంటా: రాజగోపాల్
మొహం మీదే చెప్పడంతో విస్తుపోయిన అమిత్ షా!
రాష్ట్రంలో పార్టీకి అధికారం కష్టం
షాకు స్పష్టం చేసిన ఈటల, రాజగోపాల్
న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ముదిరిపాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ కుటుం బం పట్ల ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు నేతలు తాడో పేడో తేల్చుకునే దిశగానే అడుగులు వేస్తున్న ట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన లో తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించినట్లు, పార్టీ అధిష్ఠానం తీసుకునే చర్యలపై ఆధారపడే తమ నిర్ణయాలు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. ‘‘మీరు కాంగ్రె్‌సలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి?’’ అని అమిత్ షా ప్రశ్నించగా, ‘‘మీరు పార్టీని బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నేనెందుకు బీజేపీలో ఉంటాను?’’ అని రాజగోపాల్‌రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. కేసీఆర్‌ను గద్దె దించాలన్న ఉద్దేశంతోనే తాము బీజేపీలో చేరామని, ఆ లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోతే పార్టీలో ఉండి ప్రయోజనమేంటని రాజగోపాల్‌తోపాటు ఈటల అన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తన వ్యాపారాన్ని కేసీఆర్ సర్కారు దెబ్బ తీసిందని, అయినా తాను లెక్కచేయలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ అడిగిన వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశానని, తనకు న్యాయంగా దక్కిన వ్యాపారంపైనా బురద చల్లినా సహించానని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసి నా బీజేపీ కోసం భరించానని, కానీ.. అదే బీజేపీలో తనకు విలువ ఇవ్వకపోతే, కేంద్ర నేతలు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. తనతో చర్చిస్తే బీజేపీకే లాభమని, తనను పట్టించుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. తమ కుటుంబం ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ఉత్తరాదిలా కాదు..
తెలంగాణ ప్రజల నాడి బీజేపీకి ఏ మాత్రం తెలియదని అమిత్ షాతో ఈటల అన్నారు. ‘‘తెలంగాణ ఉత్తరాది కాదు మీరనుకున్నట్లు జరగడానికి’’అని ఈటలతోపాటు కోమటిరెడ్డి కూడా అనడంతో అమిత్ షా విస్తుపోయారు. కర్ణాటక ఎన్నికలకు ముందే వేగంగా చర్యలు తీసుకుని అందరికీ కీలక బాధ్యతలు అప్పజెప్పి ఉంటే అనేక మంది చేరేవారని వారు అమిత్ షా దృష్టికి తెచ్చారు. ఇప్పుడు పార్టీ బలహీనంగా మారిందన్నారు. ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకుంటే కొంత పోటీనివ్వగలదేమోగాని అధికారంలోకి రావడం మాత్రం కష్టమని స్పష్టం చేశారు. అయితే మరో ఐదేళ్లలో బలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, అమిత్ షాతో ఈటల, రాజగోపాల్‌రెడ్డి అన్ని విషయాలను ముక్కుసాటిగా చెప్పడాన్ని చూసి.. సమావేశంలో పాల్గొన్న సంతోష్, సునీల్ బన్సల్ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇంత స్పష్టంగా, ధైర్యంగా ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదని, తామూ అలా మాట్లాడేందుకు వెనుకాడతామని వారితో అన్నారు. వారిద్దర్నీ ప్రశంసించడంతోపాటు వారు చెప్పిన విషయాలు పార్టీకి ఉపయోగపడతాయని అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అమిత్ షాతో తాము చెప్పాల్సింది చెప్పామని, ఇక చెప్పేదేమీలేదని ఈటల, రాజగోపాల్ రెడ్డి తమ అనుయాయులతో అన్నారు. బీజేపీ అగ్రనేతలు మళ్లీ పిలిస్తే తప్ప వెళ్లబోమని అన్నట్లు తెలిసింది. బీజేపీని ఇప్పుడే వదిలిపెట్టాలన్న తొందర తమకేమీ లేదని, పార్టీ నిర్ణయాల కోసం కొంతకాలం వేచి చూస్తామని వారు చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
బీఆర్‌ఎస్ అవినీతిని ఉపేక్షించబోం: అమిత్ షా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపై చర్యలతో పాటు బీఆర్‌ఎస్ నేతల అవినీతిని తాము ఉపేక్షిస్తున్నామన్న అభిప్రాయంలో ఏ మాత్రం వాస్తవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఎప్పుడు, ఏ చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. చూస్తూ ఉండండి.. మరో మూడు నెలల్లో ఏం జరుగుతుందో’’ అని అమిత్ షా వారితో అన్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ పునర్వ్యవస్థీకరణ కూడా త్వరలోనే జరుగుతుందని, సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరినందునే ఇచ్చానని, అందులో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంపై ఈటల, రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రశ్నించడంతో అమిత్ షా ఆలోచ నలో పడ్డారని, అందుకే ఇంటికి వెళ్లగానే అపాయింట్‌మెంట్ రద్దు చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారని తెలిసింది.
Updated Date - 2023-06-26T03:02:23+05:30 IST