ముడుపులు.. అసభ్యకర చేష్టలు
ABN, First Publish Date - 2023-08-22T04:30:21+05:30
తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. బీఆర్‌ఎ్‌సలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా..
తాటికొండ రాజయ్య కొంపముంచింది అవే!
స్టేషన్‌ఘన్‌పూర్/జనగామ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. బీఆర్‌ఎ్‌సలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. వారందరినీ కాదని సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడితే దానిని మూణ్నాళ్ల ముచ్చటగానే పోగొట్టుకున్న తాటికొండ రాజయ్య క్రమక్రమంగా తన ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. చివరికి ఎమ్మెల్యే టికెట్‌ను కూడా అఽధిష్ఠానం నిరాకరించే పరిస్థితికి వచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యను కాదని రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వనున్నట్లు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అధిష్ఠానం రాజయ్యకు మొండిచేయి చూపడానికి ప్రధానంగా మూడు కారణాలను పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటినుంచీ రాజయ్యకు వివాదాస్పదుడిగానే పేరుంది. పలుమార్లు ఆయన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధానంగా ఇటీవల ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్యతో వివాదమే రాజయ్య టికెట్‌కు ఎసరు తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను ఓ మహిళా నేత ద్వారా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ సర్పంచ్ నవ్య మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజయ్యపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు రాజయ్య.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణలు కూడా చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా రాజయ్యపై నవ్య మీడియా ముఖంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక దళితబంధులో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్నారని రాజయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లిందని, దీంతో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అందరు ఎమ్మెల్యేల ముందే రాజయ్యకు కేసీఆర్ క్లాస్ పీకారని సమాచారం. దీంతో వెంటనే లబ్ధిదారులను పిలిపించుకొని తీసుకున్న ముడుపులను తిరిగి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇదే కాకుండా.. అధికారుల బదిలీల్లో కూడా రాజయ్య కమీషన్లు తీసుకున్నారని అధినేత దృష్టికి వెళ్లడంతో టికెట్‌కు ఎసరు వచ్చిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సైలెంట్ మోడ్‌లో ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. ఆయన ముఖ్య అనుచరులకు ఫోన్ చేసి ఆరా తీస్తే ‘మా ఫోన్లను కూడా ఎత్తడం లేదు’ అంటున్నారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే రాజయ్య వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని నేరుగా హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో రాజయ్య మీడియా ముందుకు వస్తారని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.
Updated Date - 2023-08-22T04:30:21+05:30 IST