Normal Rainfall: నైరుతిలో సాధారణ వర్షపాతమే!
ABN, First Publish Date - 2023-04-12T03:15:30+05:30
వచ్చే నైరుతి సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందంటూ ప్రైవేటు వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ వెల్లడించిన మరుసటి రోజే భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రైతంగానికి ఊరటనిచ్చే కబురు చెప్పింది.
ఎల్‌నినో ప్రభావం ఉన్నా సాధారణానికే చాన్స్
‘స్కైమెట్’కు భిన్నంగా ఐఎండీ అంచనా
దీర్ఘకాలిక సగటులో 96ు కురుస్తుందని వెల్లడి
నైరుతి సీజన్‌పై ఐఎండీ మొదటి దశ బులెటిన్
జూలై నాటికి ఎల్‌నినో ఏర్పడే అవకాశం
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): వచ్చే నైరుతి సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందంటూ ప్రైవేటు వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ వెల్లడించిన మరుసటి రోజే భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రైతంగానికి ఊరటనిచ్చే కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం (దీర్ఘకాలిక సగటులో 96 శాతం) నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల సీజన్‌లో 87 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేసింది. నైరుతి కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కరవు పరిస్థితులు రావడానికి 20 శాతం అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం భారత వాతావరణ శాఖ నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నైరుతి సీజన్‌లో వర్షాలపై సాధారణంగా ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీల మధ్య ఐఎండీ మొదటి దశ బులెటిన్ విడుదల చేస్తుంది. అయితే స్కైమెట్ సోమవారమే అంచనా నివేదిక విడుదల చేయడంతో.. నాలుగు రోజుల ముందుగానే ఐఎండీ కూడా ముందస్తు నివేదికను విడుదల చేసిందని కొందరు వాతావరణ నిపుణులు వ్యాఖ్యానించారు.
ఐఎండీ తాజా నివేదికను పరిశీలిస్తే... వచ్చే నైరుతి సీజన్‌లో దీర్ఘకాలిక సగటులో 96 శాతం వర్షపాతం నమోదవుతుంది. దీనికి అటుఇటుగా ఐదు శాతం సవరణ ఉంటుంది. దేశంలో 1971 నుంచి 2020 వరకు నైరుతి సీజన్‌లో కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని దీర్ఘకాలిక సగటు నిర్ణయిస్తారు. దీని ప్రకారం 90 శాతం కంటే తక్కువ వర్షపాతం కురిస్తే వర్షాభావంగా, 90 నుంచి 95 వరకూ సాధారణం కంటే కురిస్తే తక్కువగా, 96 నుంచి 104 వరకూ కురిస్తే సాధారణ వర్షపాతంగా, 105 నుంచి 110 వరకూ సాధారణం కంటే అధిక వర్షపాతంగా, 110 కంటే ఎక్కువ కురిస్తే అత్యంత ఎక్కువ వర్షపాతంగా పరిగణిస్తారు. వచ్చే సీజన్‌లో 22 శాతం వర్షాభావం, 29 శాతం సాధారణం కంటే తక్కువ, 35 శాతం సాధారణ వర్షపాతం, 11 శాతం సాధారణం కంటే ఎక్కువ, 3 శాతం అత్యధిక వర్షపాతం నమోదుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రకారం సాధారణ వర్షపాతానికి 35 శాతం అవకాశాలున్నాయని అంచనా వేసింది.
జూలై నాటికి ఎల్‌నినో ఏర్పడే చాన్స్
భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో లానినా బలహీనపడి తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశం తరువాత జూలై నాటికి ఎల్‌నినో ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అన్ని ఎల్‌నినో సంవత్సరాల్లో నైరుతి సీజన్ దెబ్బతినదని పలువురు నిపుణులు విశ్లేషించారు. కాగా, స్కైమెట్ గతంలో ఇచ్చిన పలు నివేదికల్లో ఎక్కువ సవరణలు ఉన్నాయని రిటైర్డు వాతావరణ అధికారి ఒకరు గుర్తుచేశారు. కాగా, తెలంగాణలో ఉత్తర, మధ్య భాగాల్లో ఈ ఏడాది తక్కువ వర్షపాతం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Updated Date - 2023-04-12T03:15:31+05:30 IST