నిధుల లేమితో నిలిచిన పనులు
ABN, First Publish Date - 2023-01-18T00:15:03+05:30
నిజామాబాద్ కార్పొరేషన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలుపెట్టి దశాబ్దం దాటినా ఇప్పటికీ పూర్తికాలేదు. నిధులు రాకపోవడంతో పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
కార్పొరేషన్‌లో నిధులు లేక నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు
అమృత్ పథకం కింద రెండేళ్లుగా విడుదలకాని నిధులు
కొత్త డివిజన్‌ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
నిజామాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ కార్పొరేషన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలుపెట్టి దశాబ్దం దాటినా ఇప్పటికీ పూర్తికాలేదు. నిధులు రాకపోవడంతో పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నిర్మాణమైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పూర్తిస్థాయిలో వినియోగంలేదు. అదనపు నిధుల కోసం పబ్లిక్ హెల్త్ ఈఎల్‌సీకి రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరుకాలేదు. ఇప్పటి వరకు నిర్మాణమైన అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌లు వినియోగంలేకపోవడంతో పలుచోట్ల మూసుకుపోయాయి. ఇదేపరిస్థితి ఉంటే మొత్తం దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు.
దశాబ్దం క్రితం పనులు..
నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం దశాబ్దం క్రితం పనులు చేపట్టారు. మొదల రూ.240 కోట్ల అంచనాలతో పనులను ప్రారంభించారు. పనులు చేపట్టడం ఆలస్యంకావడం వల్ల అంచనా వ్యయం పెరిగిపోయింది. పాత మున్సిపాలిటీ పరిధిలోని పలు డివిజన్‌లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద పైప్‌లైన్‌ల నిర్మాణం చేపట్టారు. ఈ డ్రైనేజీకి అవసరమైన రెండు ఎస్టీపీ నిర్మాణాలు ఎల్లమ్మగుట్ల, ఖానాపూర్ ప్రాంతంలో నిర్మాణం చేశారు. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చారు. నగరం పరిధిలో పలు డివిజన్‌లలో పైప్‌లైన్‌లు వేసినా అన్నిచోట్ల ఇంకా పైప్‌లైన్‌లను కలపలేదు. కొన్నిచోట్ల కలిపినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వినియోగంలోకి రాలేదు. రోడ్లు వేయడం, ఇతర తవ్వకాలు చేపట్టడం, డ్రైనేజీ మూసుకుపోవడం వల్ల పలుచోట్ల వేసిన పైపులు కూడా మట్టిలో కూడుకుపోయాయి. మొదట చేపట్టిన ప్రణాళిక ప్రకారం అదనపు నిధులు రూ.168 కోట్లు అవసరం కావడంతో అమృత్ పథకం కింద మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలకు ఒప్పుకున్నా ఇప్పటి వరకు మాత్రం నిధులు రాలేదు. రెండేళ్లు గడిచినా నిధులు రాకపోవడంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. నగరం పరిధిలో రూ.240 కోట్లతో చేపట్టిన పనులు కూడా పనికిరాకుండా పోయాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ త్వరగా పూర్తిచేసి అన్ని ఇళ్లకు కనెక్షన్‌లు ఇస్తే పారిశుధ్యం వ్యవస్థ మెరుగుపడడంతో పాటు దోమలు, ఇతర సమస్యలు కూడా తగ్గేవని నగర వాసులు పేర్కొంటున్నారు.
నిధులు విడుదల చేస్తే ఏడాదిలోపే..
నగర కార్పొరేషన్ పరిధిలో వివిధ పథకాల కింద నిధులు మంజూరవుతున్నాయి. అమృత్ పథకం కింద మంజూరు చేసిన నిధులను త్వరగా విడుదల చేస్తే పనులు సంవత్సరంలోపు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పనులు చేపట్టకపోతే వేసిన పైప్‌లైన్‌లు కూడా ఎక్కువ మొత్తంలో దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. పాత మున్సిపాలిటీ పరిధిలో ఈ నిధులు విడుదలైతే పనులు పూర్తిచేయనున్నారు. కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాలు కలవడం, కొత్త డివిజన్‌లు ఏర్పడినందున వాటిని కూడా కలిపి పనులు చేయాలంటే నిధులు భారీగా అవసరమవుతాయి. ప్రస్తుతం మంజూరైన నిధులు విడుదలైతే ప్రణాళిక ప్రకారం పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని మొత్తం డివిజన్‌లను కలిపి పనులు చేపట్టాలంటే భారీగా నిఽధులు అవసరంకానున్నాయి. జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు నగర ప్రజాప్రతినిధులు దృష్టిపెడితే ప్రస్తుతం ఉన్న పెండింగ్ పనులకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టిన విధంగా కొంతమేర పూర్తయ్యాయని పబ్లిక్ హెల్త్ ఈఈ మురళీమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ పనుల కోసం ఇప్పటి వరకు రూ.240 కోట్లు ఖర్చు చేశామన్నారు. అమృత్ పథకం కింద నిధులు విడుదలైతే మొత్తం పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.
Updated Date - 2023-01-18T00:15:04+05:30 IST