పేదోడి వైద్యంపై మంత్రి కరుణచూపేనా?
ABN, First Publish Date - 2023-05-27T23:53:47+05:30
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదోడికి మెరుగైన వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతంతా మాత్రంగానే సౌకర్యాలు ఉండడం ఒక ఎత్తు అయితే సమయానికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్య చికిత్సలు సకాలంలో అందడం లేదు.
- జిల్లాలో పేదోడికి మెరుగైన వైద్యం కరువు
- చాలా చోట్ల వెక్కిరిస్తున్న ఖాళీలు
- ఉన్న వైద్యులు, సిబ్బందిపైనే అధిక భారం
- ఏరియా ఆసుపత్రిగా మారిన ఎల్లారెడ్డి ఆసుపత్రిలో సేవలు అంతంత మాత్రమే
- ఆసుపత్రిలో వెక్కిరిస్తున్న ఖాళీలు
- వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, రోగులు
- జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనూ గైనిక్‌ల కొరత
- వైద్యులు లేక ఉన్న వారిపై పెరుగుతున్న పని భారం
- దోమకొండ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చాలని వినతులు
- ఇప్పటికీ ఎంతో మందికి అందని కేసీఆర్ నగదు
- జిల్లాకు నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రాక
కామారెడ్డి(ఆంధ్రజ్యోతి), కామారెడ్డి టౌన్, మే 27: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదోడికి మెరుగైన వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతంతా మాత్రంగానే సౌకర్యాలు ఉండడం ఒక ఎత్తు అయితే సమయానికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్య చికిత్సలు సకాలంలో అందడం లేదు. జిల్లా వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశాఖ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లె, పట్టణ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలందించేవారు కరువవుతున్నారు. నాలుగేళ్ల కిందట కామారెడ్డి ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎల్లారెడ్డి, బాన్సువాడలో ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికీ కామారెడ్డి డి విజన్‌లో మరో ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మూడు జిల్లాల ప్రజలకు దగ్గరగా ఉన్న దోమకొండ సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిగా మారిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సైతం ఆలోచన చేస్తూ మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగినప్పటికీ ఆస్పత్రి భవనం సరిపోక, గైనిక్ వైద్యులు అంతంత మాత్రంగానే ఉండడంతో రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల సీహెచ్‌సీ నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మారిన వైద్యుల కేటాయింపు, సేవలు మాత్రం మెరుగుపడలేదని వాదనలు లేకపోలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదివారం జిల్లా పర్యటన సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ప్రభుత్వ ఆసుపత్రులకు పెరుగుతున్న రోగుల తాకిడి
జిల్లాలోని చాలా మట్టుకు వెనుకబడిన ప్రాంతాలే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలే అధిక శాతం ఉన్నారు. వీరికి ఏవైన జబ్బులు వస్తే ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. దీంతో జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీనికి తోడు సీజనల్ వ్యాధుల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగాలతో జనాలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్‌ల ప్రభావంతో గర్భిణుల తాకిడి మరింత పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో ఎన్నో సంవత్సరాలు ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బందుల పోస్టులు మాత్రం భర్తీ చేయలేకపోతోంది. ఇలా వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశాఖ విభాగాలకు చెందిన ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో సకాలంలో ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడమో లేదా సరైన వైద్యం అందక మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలు చేయించుకోవాలంటూ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తున్నా దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేయడంలో, నిధులను కేటాయించడంలో మీనమేషాలు లెక్కించడంతో ప్రజలకు అందాల్సిన వైద్యం ఎండమావిగానే మారుతోంది.
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా మారిన అందని వైద్యసేవలు
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రిగా మారిన వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రంగానే అందుతున్నాయి. కేసీఆర్ కిట్, అమ్మఒడి లాంటి పఽథకాలు వచ్చినప్పటి నుంచి ఆసుపత్రికి గర్భిణుల తాకిడి విపరీతంగా పెరిగింది. వీరితో పాటు నిత్యం చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం వైద్యం కోసం ఆసుపత్రికి రోగులు వస్తున్నా వైద్యం మాత్రం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో 16 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 8 మంది వైద్యులు ఉన్నారు. ఇందులో పిట్లం ఆసుపత్రిలో ముగ్గురు, ఒకరు కామారెడ్డి జిల్లా కేంద్రంకు డిప్యూటేషన్‌లో వెళ్లడంతో మరో నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. అంటే 10 మంది వైద్య పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. ఒకే ఒక గైనిక్ వైద్యురాలు ఉండడంతో గర్భిణులకు సేవలు అందడం లేదు. పురిటినొప్పులు పడుతూ ఆసుపత్రికి వస్తే కనీసం పట్టించుకోవడం లేదని గర్భిణుల బంధువు పేర్కొంటున్నారు. గతంలో ఎల్లారెడ్డి పట్టణంలోని బాలాజీనగర్ తండాకు చెందిన రాజేశ్వరీ అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. వైద్యురాలు, సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గ ర్భంలో ఉమ్మనీరు మింగి బిడ్డ చనిపోయింది. కళ్యాణి గ్రామానికి చెందిన అనురాధ అనే మహిళ పురిటినొప్పులు రావడంతో రాత్రి వేళ ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అనురాధ తీవ్ర నొప్పితో బాధపడుతూ కుటుంబ సభ్యులకు తెలుపడంతో వైద్యసిబ్బందికి తెలియజేశారు. దీంతో వారు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేయగా మార్గమాధ్యలోనే అనురాధ మృతి చెందింది. పేరుకే ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రకటన ఇచ్చారే తప్ప ఎక్కడ అందుకు అనుగుణంగా సేవలు అందక పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఇరుకుగా మారిన జిల్లా కేంద్ర ఆస్పత్రి
23 సంవత్సరాల క్రితం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నిర్మించారు. నాలుగేళ్ల కిందట ఈ ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మార్చారు. ఈ ఆసుపత్రికి నూతన సేవల విభాగాలు వస్తున్నాయి. ప్రస్తుతం మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిగా మారింది. దీంతో ఈ ఆసుపత్రిలో నిత్యం వందలాది రోగులతో కిటకిట లాడుతోంది. కేసీఆర్ కిట్ పథకం ప్రభావంతో మరింతగా గర్భిణులతో కిక్కిరిసిపోతోంది. ఉన్న విభాగాలతో తలనొప్పి అంటే రానురాను పెరిగిపోతున్న విభాగాలతో మరింత ఇబ్బందిగా మారుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం పూర్తిగా ఇరుకుగా తయారైంది. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగం, స్త్రీ, పురుష ఇన్ పేషెంట్స్ విభాగాలు, ఆపరేషన్ థియేటర్, మెటర్నిటీ వార్డు, ఐసోలేషన్ వార్డు, పోస్టుమార్టమ్ గది, ట్రామాకేర్ సెంటర్, ట్రామా ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, ఈసీజీ విభాగం, ప్రసవ విభాగం, రక్త పరీక్షలు, టీబీ పరీక్షల కేంద్రం, హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల కేంద్రం, ఫైలేరియా నివారణ విభాగం, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్, పీఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, డయాలసిస్ సెంటర్, ఐసీయూ, ఫార్మా విభాగం, వీటితో పాటు ఓపీలో ఆయా విభాగాలు, ఇలా విభాగాలతో రోగులకు సేవలందిస్తున్నారు. గతంలో ఏరియా ఆసుపత్రిగా ఉండటంతో వంద పడకలు ఉండేవి. జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారి నాలుగేళ్లు గడుస్తున్నా 250 పడకలు ఉండాల్సి ఉండగా గతంలో ఉన్న 100 పడకలకు మాత్రమే పరిమితమైంది. నిత్యం పదుల సంఖ్య దాటి ప్రసవాలు, శస్త్రచికిత్సలు జరుగుతుండడంతో వారికి బెడ్‌లు సరిపోవడం లేదు. ఆపరేషన్‌లు చేసిన రెండు రోజులకే బాలింతలకు పంపించేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక గైనిక్ వైద్యులు ఇద్దరే ఉండడంతో బాలింతలు, నవజాత శిశువులు మృత్యువాత పడాల్సి వస్తోంది. అటు ప్రజల ఒత్తిళ్లు, ఇటు ప్రభుత్వ ఆదేశాలతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ సేవలు అందిస్తున్నారు. ఇక నీటి కొరత ఉందంటూ ఏకంగా మంత్రి హరీష్‌రావుకు ఇటీవల ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి కార్యాలయం నుంచి సైతం ఆదేశాలు రావడం శోచనీయం. ఇక అమ్మఒడి పథకం నగదు ప్రోత్సాహకం నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయాయి. కొందరికి ప్రసవం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వారి ఖాతాలో జమ కావడం లేదు. కొందరికి మొదటి విడత జమ చేసి మూడు విడతలు, రెండు విడతలు జమ చేయలేదు. వైద్యాధికారుల వద్దకు వెళ్లితే తమ పరిధిలో ఈ అంశం లేదని ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుందని చెబుతున్నారని వాపోతున్నారు. వెంటనే ఈ నగదు తమ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు.
దోమకొండ ఏరియా ఆసుపత్రిగా మార్చేనా?
కామారెడ్డి డివిజన్ పరిధిలో జిల్లా కేంద్ర ఆసుపత్రి మరికొద్ది రోజుల్లో డీఎంఏ కిందకు వెళ్తుండగా టీవీవీపీ పరిధిలో మరో ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే వాదనలు పెరుగుతున్నాయి. దోమకొండ సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిగా మారిస్తే సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు ఇబ్బందులు తగ్గనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ విప్ దృష్టికి ఆ ప్రాంత నాయకులు తీసుకుపోయారు. ఇటీవల పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏరియా ఆసుపత్రి ప్రాధాన్యతపై చర్చించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకుపోతే సీహెచ్‌సీ స్థానంలో ఏరియా ఆసుపత్రి ఏర్పడితే నిపుణులైన వైద్యులతో పాటు 24 గంటల సేవలు అందనున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తున్న రోగుల తాకిడి సైతం తగ్గనుంది. జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఉండడం జాతీయ రహదారి సైతం దగ్గరలోనే ఉండడంతో ఏదైన ప్రమాదాలు జరిగినా లేదంటే ఇతర సేవలు కావాల్సి ఉన్నా ఏరియా ఆసుపత్రిగా మారితే ప్రజలకు వైద్యసేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోతాయి.
Updated Date - 2023-05-27T23:53:47+05:30 IST